కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ‘‘ఎన్నికల కోడ్ ఈ నెలాఖరులోగా అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయండి’’ అని కలెక్టర్ ఎం.రఘునందనరావు జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌తో పాటు ఏజేసీ బి.ఎల్.చెన్నకేశవరావు, డీఆర్వో ఎల్.విజయచందర్, ట్రైనీ కలెక్టర్ కాళీచరణ్‌సుదంరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కింద లబ్ధిదారులకు పథకాల యూనిట్లు మంజూరు, బ్యాంకు లింకేజీ రుణాలు తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ నెల 20వ తేదీలోగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యేలా చూడాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూపొందించిన ప్రణాళికలు, సబ్‌ప్లాన్ అమలు వేగవంతం చేయాలన్నారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణం, గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేయాల్సిన గృహాలను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆర్ అండ్ బీ శాఖ ద్వారా చేపట్టిన పనులను పూర్తి చేయాలన్నారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి కొరత రాకుండా ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. ముఖ్యమైన ఫైళ్ల వెంటనే క్లియర్ చేయాలన్నారు. డీఆర్డీఏ పీడీ కె.శివశంకర్, జెడ్పీ సీఈవో బి.సుబ్బారావు, డ్వామా పీడీ అనిల్‌కుమార్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ డి.మధుసూదనరావు, హౌసింగ్ పీడీ సీహెచ్.ప్రతాపరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బి.పద్మావతి, డీఎంఅండ్‌హెచ్‌వో జె.సరసిజాక్షి, డీఎస్‌వో పి.సంధ్యారాణి, డీఈవో డి.దేవానందరెడ్డి, వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో వచ్చిన అర్జీల్లో కొన్ని..
తమ గ్రామంలో అనుమతి లేకుండా చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలు జరుపుతున్నారని, దీని వల్ల సమీప పంటభూములు సెలినిటీ బారిన పడే ప్రమాదం ఉందని మండవల్లి మండలం కానుకొల్లు గ్రామానికి చెందిన కాగిత శ్రీనివాసరావు ఫిర్యాదుచేశారు.
బందరు పోర్టు నిర్మాణం కోసం భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని, మచిలీపట్నం ప్రధాన పార్కులో సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు.
సమాచార హక్కు చట్టం ద్వారా తాము కోరిన వివరాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తు న్న కైకలూరు తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని కోరతూ వెంపటి విష్ణురావు అర్జీ ఇచ్చారు.
కంకిపాడు మండలంలోని వేల్పూరులో ఎస్సీల స్వాధీనంలో ఉన్న భూమిలో లిక్కర్ స్టిక్కర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని దళిత జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనరు మారుమూడి విక్టర్‌ప్రసాద్ అర్జీ సమర్పించారు.
నీలం తుపాను నష్టపరిహారం కోసం బందరు మండలం కోన గ్రామానికి చెందిన రైతులకు బ్యాంకు ఖాతాలు తెరిచినా ఇంత వరకు డబ్బులు జమ చేయలేదని అదే గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరావు ఫిర్యాదుచేశారు.
మండవల్లి మండలం కొర్లపాడును రెవెన్యూ గ్రామంగా మండల పరిషత్ కార్యాలయంలో గెజిట్ ప్రకటించి, గ్రామంలోని భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్పంచి సీహెచ్ శ్రీనివాసరావు అర్జీ ఇచ్చారు.
జాతీయ రహదారి విస్తరణలో కోసం తమ భూములు సేకరించారని, ప్రభుత్వం ప్రకటించిన ధరతో తమకు నష్టం జరుగుతోందని, న్యాయమైన ధర ఇప్పించాలని గన్నవరం మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన రైతుల అర్జీ ఇచ్చారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
Published Tue, Feb 4 2014 1:26 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement