Raghunandanaravu
-
ఎస్పీ ప్రభాకరరావుకు ఘన సన్మానం
కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : జిల్లాలో లా అండ్ ఆర్డర్‌ను గాడిలోపెట్టి ప్రజల హృదయాల్లో సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందిన ఎస్పీ ప్రభాకరరావు ఇతర అధికారులకు ఆదర్శంగా నిలిచారని కలెక్టర్ రఘునందనరావు కొనియాడారు. జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇటీవల కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ అయిన ప్రభాకరరావును ఆదివారం రాత్రి స్థానిక పోలీస్ కల్యాణ మండపంలో ఘనంగా సత్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎస్పీ ప్రభాకరరావు చూపిన చొరవ అభినందనీయమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం, కో-ఆపరేటివ్, పంచాయతీ, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల సమయంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా కృషి చేశారన్నారు. జిల్లా ఇన్చార్జ్ జడ్జి శేషగిరిరావు, రిటైర్డు జిల్లా జడ్జి చక్రధరరావు మాట్లాడుతూ పోలీసు వృత్తి కత్తిమీద సాములాంటిదని, అలాంటి వృత్తిలో జిల్లా అధికారిగా ఉంటూ నేరస్థుల గుండెల్లో దడ పుట్టించ గలిగిన సమర్థుడైన అధికారిగా ప్రభాకరరావు గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఎస్పీ ప్రభాకరరావు మాట్లాడుతూ జిల్లాతో గతంలోనే తనకు మంచి అనుబంధం ఉందన్నారు. డీఎస్పీగా గతంలో పనిచేసిన తాను తిరిగి ఎస్పీగా ఇదే జిల్లాలో ఎస్పీగా పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో సిబ్బంది సహకారం ఎంతో ఉందన్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడటంలో తనకు కలెక్టర్ రఘునందనరావు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, ఆయన అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. సిబ్బంది మెరుగైన పనితీరుతోనే శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చూడగలిగానని చెప్పారు. అనంతరం పలువురు జిల్లా అధికారులు ప్రసంగించారు. ఎస్పీని కలెక్టర్ రఘునందనరావు ఇతర అధికారులు ఘనంగా సత్కరించి అభినందించారు. అడిషనల్ ఎస్పీ బి.డి.వి.సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణాయూనివర్సిటీ వీసీ వి.వెంకయ్య బందరు ఆర్డీవో పి.సాయిబాబు, సన్‌ఫ్లవర్ విద్యాసంస్థల చైర్మన్ పున్నంరాజు, బందరు, గుడివాడ, నూజివీడు, నందిగామ డీఎస్పీలు, ఏఆర్ డీఎస్పీ, డీటీసీ డీఎస్పీ, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, పట్టణ ప్రముఖలు పాల్గొన్నారు. -
జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి
లోక్‌సభ ప్యానల్ స్పీకర్ కొనకళ్ల కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతోపాటు ఇతర ముఖ్య పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు కృషి చేస్తానని బందరు ఎంపీ, లోక్‌సభ ప్యానల్ స్పీకర్ కొనకళ్ల నారాయణరావు హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని ప్రధాన కూడళ్లల్లో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌ను ఆది వారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొనకళ్లతోపాటు రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ రఘునందనరావు, ఎస్పీ ప్రభాకరరావు పాల్గొన్నారు. మంత్రి రవీంద్ర కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. కొనకళ్ల మాట్లాడుతూ పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు పోలీసు అధికారులు తనను సంప్రదించిన వెంటనే రూ.10 లక్షలు మంజూరు చేశానన్నారు. మచిలీపట్నంతో పాటు జిల్లాలోని ఇతర ముఖ్య పట్టణాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేసేం దుకు కృషి చేస్తానన్నారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలో సీసీ కెమేరాల ఏర్పాటు అభినందనీయమన్నారు. అయితే గతంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఏర్పాటుచేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రస్తుతం నిరుపయోగంగా మారాయన్నారు. వాటిని ఉపయోగంలోకి తీసుకొచ్చేలా ఉన్నతాధికారులు కృషి చేస్తేనే ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని సూచించారు. కలెక్టర్ రఘునందనరావు మాట్లాడుతూ పోలీసులు నిరంతరం ప్రజలకు రక్షణ కల్పించేలా విధులు నిర్వర్తించాలన్నారు. పట్టణంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను అవసరమైన మేరకు తాము వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఎస్పీ ప్రభాకరరావు మాట్లాడుతూ పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో ట్రాఫిక్ నియంత్రణ సులభమవుతుందన్నారు. నేరాలు నియంత్రిం చేందుకు దోహదపడుతుందన్నారు. నేరస్థులపై నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రస్తుతం జిల్లాలోని జగ్గయ్యపేట, పామర్రు పట్టణాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు మచిలీపట్నంలోని ప్రధాన కూడళ్లయిన మూడు స్తంభాలసెంటర్, కోనేరుసెంటర్, బస్‌స్టాండ్‌సెంటర్, ప్రభుత్వాస్పత్రి, చేపల మార్కెట్, రైతు బజార్, కాలేఖాన్పేటతో మరో 32 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నిధుల మంజూరుకు కృషి చేసిన కొనకళ్లకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. మునిసిపల్ కమిషనర్ మోటమర్రి బాబా ప్రసాద్, అడిషనల్ ఎస్పీ బి.డి.వి.సాగర్, బందరు డీఎస్పీ డాక్టర్ కె.వి.శ్రీనివాసరావు, సీఐలు, ఎస్సైలు, పట్టణ ప్రముఖలు, జనమైత్రి సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ‘‘ఎన్నికల కోడ్ ఈ నెలాఖరులోగా అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయండి’’ అని కలెక్టర్ ఎం.రఘునందనరావు జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌తో పాటు ఏజేసీ బి.ఎల్.చెన్నకేశవరావు, డీఆర్వో ఎల్.విజయచందర్, ట్రైనీ కలెక్టర్ కాళీచరణ్సుదంరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కింద లబ్ధిదారులకు పథకాల యూనిట్లు మంజూరు, బ్యాంకు లింకేజీ రుణాలు తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ నెల 20వ తేదీలోగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యేలా చూడాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూపొందించిన ప్రణాళికలు, సబ్‌ప్లాన్ అమలు వేగవంతం చేయాలన్నారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణం, గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేయాల్సిన గృహాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖ ద్వారా చేపట్టిన పనులను పూర్తి చేయాలన్నారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి కొరత రాకుండా ఆర్డబ్ల్యూఎస్ శాఖ కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. ముఖ్యమైన ఫైళ్ల వెంటనే క్లియర్ చేయాలన్నారు. డీఆర్డీఏ పీడీ కె.శివశంకర్, జెడ్పీ సీఈవో బి.సుబ్బారావు, డ్వామా పీడీ అనిల్‌కుమార్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ డి.మధుసూదనరావు, హౌసింగ్ పీడీ సీహెచ్.ప్రతాపరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బి.పద్మావతి, డీఎంఅండ్‌హెచ్‌వో జె.సరసిజాక్షి, డీఎస్వో పి.సంధ్యారాణి, డీఈవో డి.దేవానందరెడ్డి, వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీల్లో కొన్ని.. తమ గ్రామంలో అనుమతి లేకుండా చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలు జరుపుతున్నారని, దీని వల్ల సమీప పంటభూములు సెలినిటీ బారిన పడే ప్రమాదం ఉందని మండవల్లి మండలం కానుకొల్లు గ్రామానికి చెందిన కాగిత శ్రీనివాసరావు ఫిర్యాదుచేశారు. బందరు పోర్టు నిర్మాణం కోసం భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని, మచిలీపట్నం ప్రధాన పార్కులో సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. సమాచార హక్కు చట్టం ద్వారా తాము కోరిన వివరాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తు న్న కైకలూరు తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని కోరతూ వెంపటి విష్ణురావు అర్జీ ఇచ్చారు. కంకిపాడు మండలంలోని వేల్పూరులో ఎస్సీల స్వాధీనంలో ఉన్న భూమిలో లిక్కర్ స్టిక్కర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని దళిత జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనరు మారుమూడి విక్టర్‌ప్రసాద్ అర్జీ సమర్పించారు. నీలం తుపాను నష్టపరిహారం కోసం బందరు మండలం కోన గ్రామానికి చెందిన రైతులకు బ్యాంకు ఖాతాలు తెరిచినా ఇంత వరకు డబ్బులు జమ చేయలేదని అదే గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరావు ఫిర్యాదుచేశారు. మండవల్లి మండలం కొర్లపాడును రెవెన్యూ గ్రామంగా మండల పరిషత్ కార్యాలయంలో గెజిట్ ప్రకటించి, గ్రామంలోని భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్పంచి సీహెచ్ శ్రీనివాసరావు అర్జీ ఇచ్చారు. జాతీయ రహదారి విస్తరణలో కోసం తమ భూములు సేకరించారని, ప్రభుత్వం ప్రకటించిన ధరతో తమకు నష్టం జరుగుతోందని, న్యాయమైన ధర ఇప్పించాలని గన్నవరం మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన రైతుల అర్జీ ఇచ్చారు.