ఎస్పీ ప్రభాకరరావుకు ఘన సన్మానం | SP Prabhakara Rao solid honor | Sakshi
Sakshi News home page

ఎస్పీ ప్రభాకరరావుకు ఘన సన్మానం

Published Mon, Jul 28 2014 2:24 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

ఎస్పీ ప్రభాకరరావుకు ఘన సన్మానం - Sakshi

ఎస్పీ ప్రభాకరరావుకు ఘన సన్మానం

కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : జిల్లాలో లా అండ్ ఆర్డర్‌ను గాడిలోపెట్టి ప్రజల హృదయాల్లో సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందిన ఎస్పీ ప్రభాకరరావు ఇతర అధికారులకు ఆదర్శంగా నిలిచారని కలెక్టర్ రఘునందనరావు కొనియాడారు. జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇటీవల కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ అయిన ప్రభాకరరావును ఆదివారం రాత్రి స్థానిక పోలీస్ కల్యాణ మండపంలో ఘనంగా సత్కరించారు.

కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎస్పీ ప్రభాకరరావు చూపిన చొరవ అభినందనీయమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం, కో-ఆపరేటివ్, పంచాయతీ, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల సమయంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా కృషి చేశారన్నారు. జిల్లా ఇన్‌చార్జ్ జడ్జి శేషగిరిరావు, రిటైర్డు జిల్లా జడ్జి చక్రధరరావు మాట్లాడుతూ పోలీసు వృత్తి కత్తిమీద సాములాంటిదని, అలాంటి వృత్తిలో జిల్లా అధికారిగా ఉంటూ నేరస్థుల గుండెల్లో దడ పుట్టించ గలిగిన సమర్థుడైన అధికారిగా ప్రభాకరరావు గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

ఎస్పీ ప్రభాకరరావు మాట్లాడుతూ జిల్లాతో గతంలోనే తనకు మంచి అనుబంధం ఉందన్నారు. డీఎస్పీగా గతంలో పనిచేసిన తాను తిరిగి ఎస్పీగా ఇదే జిల్లాలో ఎస్పీగా పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో సిబ్బంది సహకారం ఎంతో ఉందన్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడటంలో తనకు కలెక్టర్ రఘునందనరావు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, ఆయన అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. సిబ్బంది మెరుగైన పనితీరుతోనే శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చూడగలిగానని చెప్పారు.

అనంతరం పలువురు జిల్లా అధికారులు ప్రసంగించారు. ఎస్పీని కలెక్టర్ రఘునందనరావు ఇతర అధికారులు ఘనంగా సత్కరించి అభినందించారు. అడిషనల్ ఎస్పీ బి.డి.వి.సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణాయూనివర్సిటీ వీసీ వి.వెంకయ్య బందరు ఆర్డీవో పి.సాయిబాబు,   సన్‌ఫ్లవర్ విద్యాసంస్థల చైర్మన్ పున్నంరాజు, బందరు, గుడివాడ, నూజివీడు, నందిగామ డీఎస్పీలు, ఏఆర్ డీఎస్పీ, డీటీసీ డీఎస్పీ, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు, పట్టణ ప్రముఖలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement