అ(న)ధికార పెత్తనం
- టీడీపీ నేతల ఓవరాక్షన్
- అవసరం లేకున్నా పాలనలో జోక్యం
- వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులపై అనవసర దుష్ర్పచారం
మచిలీపట్నం : పంచాయతీ పాలనలో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేకున్నా తమ హవాను నిలబెట్టుకునేందుకు టీడీపీ మండల స్థాయి నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్న సర్పంచులు ఉన్న పంచాయతీల్లో టీడీపీ నేతలు పెత్తనం చెలాయిస్తుండడం పలు విమర్శలకు దారితీస్తోంది. అవసరం ఉన్నా, లేకున్నా పాలనలోజోక్యం చేసుకుంటూ నానా యాగీ చేస్తున్నారు.
టీడీపీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలే కాకుండా ఎమ్మెల్యేలు సైతం అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని వైఎస్సార్ సీపీకి అనుకూల పాలకవర్గాలు ఉన్న పంచాయతీల్లో పాలన భ్రష్ఠు పట్టిందంటూ దుష్ర్పచారం చేస్తున్నారు. మండల పరిషత్ సమావేశాల్లో వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్న సర్పంచులను నిలబెట్టి గ్రామంలో పాలన బాగోలేదంటూ చులకన భావంతో మాట్లాడటం వివాదాస్పదమవుతోంది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పామర్రు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన వ్యక్తి తానే ఎమ్మెల్యేనంటూ తన మాట వినకుంటే అధికారులను శంకరగిరి మాన్యాలకు పంపిస్తానని బెదిరింపులకు దిగుతున్నారు. ఓ అడుగు ముందుకు వేసిన కొందరు టీడీపీ నాయకులు తమ పార్టీ అధికారంలో ఉన్నందున తమ మాటే వినాలని లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని అధికారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారనే విమర్శలున్నాయి.
మచ్చుకు కొన్ని...
మచిలీపట్నం పురపాలక సంఘాన్ని టీడీపీ దక్కించుకుంది. ఈ పురపాలక సంఘంలో 42 వార్డులుండగా 12 మంది వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్లు గెలుపొందారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఉన్న చోట అక్కడ ఓటమి పాలైన టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులే పెత్తనం చెలాయిస్తున్నారు. వీధి లైట్ల నిర్వహణ, పారిశుద్ద్య పనుల నిర్వహణ, పింఛను, రేషన్‌కార్డు దరఖాస్తులు తదితర వ్యవహారాలన్నీ ఓటమి పాలైన అభ్యర్థులే నిర్వహిస్తున్నారు.
అవనిగడ్డ పంచాయతీ పాలకవర్గ వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉంది. ఈ మండల జెడ్పీటీసీ సభ్యుడు టీడీపీకి చెందిన వారు. అవసరం ఉన్నా, లేకున్నా తరచూ పంచాయతీలో పర్యటిస్తూ నానా హడావిడి సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎంపీడీవోను తనతో పాటే తీసుకువెళ్లి డ్రెయిన్ల నిర్వహణ సక్రమంగా లేదని పంచాయతీ పాలకవర్గం ఏం చేస్తోదంటూ సిబ్బందిపై విరుచుకుపడటం వివాదాస్పదమవుతోంది. ఓ అడుగు ముందుకు వేసిన జెడ్పీటీసీ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై తనదైన శైలిలో విరుచుకుపడటంతో ఉద్యోగుల్లో టీడీపీ ప్రజాప్రతినిధుల ప్రవర్తనపై అసహనం వ్యక్తమవుతోంది.
చల్లపల్లి ఎంపీపీ టీడీపీకి చెందిన వారు. మండలంలో టీడీపీని అధికారంలోకి తెచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఇటీవల ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లోకి వెళ్లిన తరువాత ఈ కార్యక్రమాన్ని గ్రామసభగా మార్చేస్తున్నారు. వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్న సర్పంచులు ఉన్న ప్రాంతాల్లో ప్రజాసమస్యలను అధికారుల సమక్షంలోనే ఎత్తి చూపడం, అక్కడున్న సర్పంచిని చులకనగా మాట్లాడటం, పంచాయతీ కార్యదర్శులపై పెత్తనం చలాయించడం చర్చనీయాంశంగా మారింది. ఘంటసాల మండల పరిషత్ సమావేశం ఇటీవల జరిగింది. శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఘంటసాల పంచాయతీలో వీధిలైట్లు సక్రమంగా వెలగడం లేదనే కారణంతో ఈ సమావేశంలో ఘంటసాల సర్పంచి, పంచాయతీ కార్యదర్శిని అరగంటపాటు నిలబెట్టి యక్షప్రశ్నలు వేసి టీడీపీ నాయకులు తమ కసిని తీర్చుకున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. మండలస్థాయి అధికారులు సైతం ఎంపీపీలు, జెడ్పీటీసీల మాట వింటూ వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్న పంచాయతీల్లో పాలకవర్గాలను ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారనే వాదన సర్వత్రా వినిపిస్తోంది.