సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా, చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎన్.శివప్రసాద్, చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పులివర్తి వెంకటమణి ప్రసాద్ అలియాస్ నాని హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. హౌస్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద్‌రావు, జస్టిస్ జవలాకర్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఇంటి వద్ద విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను శనివారానికి వాయిదా వేసింది. శివప్రసాద్ పిటిషన్ విచారణార్హతపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అలాగే చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో మూడు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ కోసం పులివర్తి నాని ఇచ్చిన వినతిపత్రాలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.
రిటర్నింగ్ అధికారి నివేదిక లేదు
అంతకు ముందు శివప్రసాద్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ, రీపోలింగ్ ఎప్పుడు నిర్వహించాలన్న విషయంలో నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయన్నారు. ఎవరో అడిగారనో.. ఫిర్యాదు చేశారనో.. వ్యక్తుల ఇష్టాయిష్టాల ఆధారంగానో రీ పోలింగ్ నిర్వహించడానికి వీల్లేదని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ జరగనప్పుడు రిటర్నింగ్ అధికారి ఇచ్చే నివేదిక ఆధారంగా రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అయితే ప్రస్తుత కేసులో రిటర్నింగ్ అధికారి రీ పోలింగ్‌కు ఎటువంటి నివేదిక ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని చెప్పారు. ఎన్నికలు ముగిసిన 35 రోజుల తరువాత రీ పోలింగ్‌కు ఆదేశాలు ఇవ్వడం తగదని తెలిపారు. ప్రత్యర్థి పార్టీలకు లబ్ధి చేకూర్చేందుకే ఎన్నికల సంఘం రీపోలింగ్ నిర్ణయం తీసుకుందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, రీపోలింగ్ ఆదేశాల అమలును నిలిపేయాలని కోరారు.
మా వినతి పత్రాలను పట్టించుకోలేదు
పులివర్తి నాని తరఫు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపిస్తూ, ఎన్నికలు ముగిసిన వెంటనే తాము చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని మూడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కోసం ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించామన్నారు. తరువాత ఈ నెల 13న మరోసారి ఆ వినతిపత్రం గుర్తు చేశామన్నారు. అయినా కూడా ఎన్నికల సంఘం ఏ రకంగానూ స్పందించలేదని తెలిపారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇచ్చిన వినతిపత్రంపై మాత్రం స్పందించారని చెప్పారు. ఆ వినతిపత్రం ఆధారంగా ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు ఇచ్చారని, ఎన్నికల సంఘం పక్షపాత వైఖరికి ఇది నిదర్శనమన్నారు.
అక్రమాలకు పక్కా ఆధారాలున్నాయి
ఈ సమయంలో ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అక్రమాలు జరిగాయనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపారు. ఆ ఆధారాలను పరిశీలించి, సంతృప్తి చెందిన తరువాతనే ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు ఇచ్చారన్నారు. శివప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌కు అసలు విచారణార్హతే లేదని తెలిపారు. రీపోలింగ్ విషయంలో ఎన్నికల సంఘం ఆదేశాలు సవాలు చేయడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, శివప్రసాద్ పిటిషన్ విచారణార్హతపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అలాగే రీపోలింగ్ కోసం పులివర్తి నాని ఇచ్చిన వినతిపత్రాలపై ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను శనివారానికి వాయిదా వేసింది.
రీపోలింగ్ ఆదేశాల అమలు నిలిపేయండి
Published Sat, May 18 2019 3:55 AM | Last Updated on Sat, May 18 2019 10:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment