సాక్షి, తిరుపతి : చంద్రబాబు సొంత జిల్లాలోనూ టీడీపీకి ఊహించిన పరాభవం ఎదురైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు చేతులెత్తేశారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సొంత నియోజకవర్గం శ్రీకాళహస్తిలో నాలుగు జెడ్పీటీసీ, 64 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవం చేసుకుంది. జిల్లాలో మొత్తం 65 జెడ్పీటీసీ స్థానాలు ఉంటే... 29 మంది వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 858 ఎంపీటీసీ స్థానాలకు గాను.. 323 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలోని 6 జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 69 ఎంపీటీసీ స్థానాల్లో 66 స్థానాలను వైఎస్సార్‌సీపీ, 3 స్థానాలను టీడీపీ ఏకగ్రీవం చేసుకున్నాయి. తిరుపతి కార్పొరేషన్లోని 50 డివిజన్లలో ఇప్పటికే 16 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిసింది. పలమనేరు మున్సిపాలిటీలోని 26 వార్డుల్లో 10 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, నారాలోకేశ్‌లు ఎంతగా ప్రయత్నించినా వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని ఆపలేకపోతున్నారు.
చంద్రగిరిలో చంద్రబాబుకు షాక్..
తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింది. నియోజకవర్గం పరిధిలోని 95 ఎంపీటీసీలకు గాను 86 ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీకే దక్కాయి. టీడీపీకి దక్కింది కేవలం నాలుగే. చంద్రగిరితో పాటు అన్ని మండలాల్లో ఎంపీపీలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే ఎన్నిక కానున్నారు. ఐదు జెడ్పీటీసీలు సైతం అధికార పార్టీ కైవసం చేసుకుంది. కేవలం ఒక జెడ్పీటీసీ, ఐదు ఎంపీటీసీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఇందులోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలుపొందే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన పథకాలు, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ భాస్కర్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే ఈ ఫలితాలు వచ్చాయని స్థానికులు పేర్కొంటున్నారు.
చరిత్ర సృష్టించిన తంబళ్లపల్లె
బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ చరిత్ర సృష్టించింది. స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలో తొలిసారిగా అన్ని స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. నియోజకవర్గంలో 72 ఎంపీటీసీ స్థానాలుండగా 71 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఒక స్థానంలో స్వతంత్య్ర అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 6 జెడ్పీటీసీ స్థానాల్లో అన్నింటా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కృష్ణాలో వైఎస్సార్‌సీపీ జోరు
కృష్ణా జిల్లాలో రెండు జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండల జెడ్పీటీసీ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ రాష్ట్ర పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు కుమార్తె దుట్టా సీతారామలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కైకలూరు నియోజకవర్గం మండవల్లి జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ముంగర విజయనిర్మల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండవల్లి మండలంలో 14 ఎంపీటీసీలకు గాను అత్యధిక స్థానాలను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవం చేసుకోవడంతో ఎంపీపీ స్థానం కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.
కళాకు పరాభవం
రేగిడి మండలంలోని పెదసిర్లాం, అంబాడ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుకు ఘోర పరాభవం ఎదురైంది. ఆయన సొంత మండలం రేగిడి ఎంపీపీ పదవిని వైఎస్సార్‌సీపీ ఏకగీవ్రంగా దక్కించుకుంది. శనివారం ఉపసంహరణ ముగిసే సరికి ఈ మండలంలోని మొత్తం 20 ఎంపీటీసీ స్థానాల్లో 11 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలకు ముందే వైఎస్సార్‌సీపీకి సగం కన్నా ఎక్కువ స్థానాలు దక్కడంతో ఎంపీపీ పదవి చేజిక్కించుకున్నట్టే. తన సొంత మండలానికి చెందిన నాయకులు షాక్ ఇవ్వడంతో ఆయన ఖంగుతిన్నారు. మూడు చోట్ల టీడీపీ అభ్యర్థులు అసలు నామినేషన్లే వేయలేదు. ఎనిమిదిచోట్ల వేసిన నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాగా, వంగర ఎంపీపీ పీఠాన్ని కూడా వైఎస్సార్‌సీపీ వశపర్చుకుంది. రాజాం నియోజకవర్గంలో రెండు ఎంపీపీలను ఏకగ్రీవంగా దక్కించుకుంది.
మాజీ మంత్రి యనమలకు చుక్కెదురు
కాకినాడ: టీడీపీ హయాంలో చక్రం తిప్పిన అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి స్థానిక సంస్థల ఎన్నికల్లో చుక్కెదురైంది. తుని మున్సిపాలిటీలో ఆరు డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో ఐదుగురు ఎంపీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment