Grand Victory of YSRCP Candidate in Chandra Babu Constituency - Sakshi
Sakshi News home page

నారా చంద్రబాబునాయుడు ఘోర పరాజయం 

Published Mon, Sep 20 2021 4:54 AM | Last Updated on Mon, Sep 20 2021 11:16 AM

Nara Chandrababu Naidu was defeated in Parishad Elections - Sakshi

సాక్షి ప్రతినిధి, తిరుపతి: కుప్పం నియోజకవర్గంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి సరే కానీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓడిపోవడం ఏమిటని అనుకుంటున్నారా! అయితే ఈ లెక్క చూడండి. బాబుకు ఘోర పరాభవంతో కూడిన పరాజయం దక్కిందని అందరూ ఒప్పుకుంటారు. చివరికి టీడీపీ శ్రేణులు కూడా. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కుప్పం నుంచి ఓ రకంగా చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా చంద్రబాబు గెలుపొందారు. అప్పటికి వరుసగా ఆరుసార్లు గెలిపించిన కుప్పంలో ఈ దఫా కొన్ని రౌండ్లలో వెనక్కు వెళ్లి, మరికొన్ని రౌండ్లలో ముందుకొచ్చి మొత్తంగా కుప్పం నుంచే ఏడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగోలా బయటపడ్డారు. కానీ ఆ తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చంద్రబాబుకు దారుణ పరాజయమే మిగిలింది.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీలకు గాను 74 చోట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించగా, 14 చోట్ల టీడీపీ మద్దతుదారులు, ఒక చోట కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారు విజయం సాధించారు.  తాజాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ టీడీపీ తుడిచి పెట్టుకుపోయింది. గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం, కుప్పం జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో చేజిక్కించుకున్నారు. వైఎస్సార్‌సీపీ కుప్పం జెడ్పీటీసీ అభ్యర్థి ఏడీఎస్‌ శరవణ 17,358 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, గుడుపల్లె అభ్యర్థి కృష్ణమూర్తి 11,928 ఓట్ల ఆధిక్యతతో, శాంతిపురం అభ్యర్థి శ్రీనివాసులు 16,893 ఓట్ల ఆధిక్యతతో.. రామకుప్పం అభ్యర్థి కే రాఘవరెడ్డి 16,118 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థులపై విజయం సాధించారు. 

వైఎస్సార్‌సీపీ ఏకపక్ష విజయం
నాలుగు మండలాల్లోని మొత్తం 68 ఎంపీటీసీ స్థానాలకు గాను 63 స్థానాలను (ఇందులో ఒకటి ఏకగ్రీవం) వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో గెలుచుకుంది. కేవలం మూడు ఎంపీటీసీలు మాత్రమే టీడీపీ గెలుపొందగా, రెండు ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థుల మృతితో ఎన్నిక జరగలేదు. కుప్పం మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాలకు 20 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా... వైఎస్సార్‌సీపీ 18 చోట్ల విజయం సాధించగా, టీడీపీ రెండింట మాత్రమే గెలుపొందింది. గుడుపల్లె మండలంలో 13కు గాను 12 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా, అన్నింటినీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. రామకుప్పం మండలంలో 16కు 16, శాంతిపురం మండలంలో 18కి 17 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. మొత్తంగా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు జెడ్పీటీసీల్లో వైఎస్సార్‌సీపీకి 84,160 ఓట్లు, టీడీపీకి 21,863 ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన వైఎస్సార్‌సీపీకి 62,297 ఓట్ల ఆధిక్యం లభించింది.  ఇలా అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ వైఎస్సార్‌సీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇది చంద్రబాబుకు దక్కిన ఘోర పరాభవంగానే రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 చిత్తూరులో టీడీపీ చిత్తు చిత్తు
► చంద్రబాబునాయుడి సొంత జిల్లా చిత్తూరులో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన కుప్పం మినహా మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలనూ వైఎస్సార్‌సీపీనే గెలుచుకుంది. ఇప్పుడు కుప్పంతో సహా మొత్తం 14 నియోజకవర్గాల్లోని అన్ని జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే తిరుగులేని విజయం సాధించారు. 
► జిల్లాలో మొత్తం 65 జెడ్పీటీసీ స్థానాలుండగా, 30 స్థానాలు గతంలోనే ఏకగ్రీవమయ్యాయి. రెండు స్థానాల్లో అభ్యర్థుల మృతితో ఎన్నికలు నిలిచిపోగా, మిగిలిన 33 స్థానాల్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. గెలుపొందిన ప్రతి స్థానంలోనూ టీడీపీ అభ్యర్థులపై భారీ ఓట్ల మెజారిటీ రావడం విశేషం. 
► జిల్లాలోని 886 ఎంపీటీసీ స్థానాల్లో 410 చోట్ల వైఎస్సార్‌సీపీకి, టీడీపీకి 8, సీపీఐకి 1, ఇతరులకు 14 స్థానాల్లో ఏకగ్రీవాలయ్యాయి. 34 ఎంపీటీసీ స్థానాల్లో వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన 419 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 389 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ కేవలం 25 స్థానాలతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు ఐదు చోట్ల గెలుపొందారు. 
► మొత్తంగా ఎన్నికలు జరగని 34 స్థానాలను మినహాయిస్తే, 852 ఎంపీటీసీలకు గాను799 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ, 33 స్థానాల్లో టీడీపీ, సీపీఐ 1, ఇతరులు 19 చోట్ల గెలుపొందారు. మొత్తంగా చూస్తే.. టీడీపీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో ఇంతటి దారుణమైన ఫలితాలను తొలిసారిగా చవిచూసిన బాధ కంటే, చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈ స్థాయిలో పార్టీ కుప్పకూలడం ఇప్పుడు ఆ పార్టీ నేతలకు కోలుకోలేని షాక్‌ ఇచ్చింది.

కుప్పంలో చరిత్ర తిరగరాసిన ఫ్యాన్‌
చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తొలిసారిగా చరిత్ర తిరగ రాసింది. జెడ్పీటీసీ వ్యవస్థ మొదలైన తర్వాత మొదటిసారిగా టీడీపీకి అక్కడ బోణీ లేకుండా పోయింది. 1989 నుంచి స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రతి ఎన్నికలోనూ టీడీపీ పై చేయి సాధిస్తూ వచ్చింది. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిపురం జెడ్పీటీసీ సభ్యుడిగా కాంగ్రెస్‌ అభ్యర్థి సుబ్రహ్మణ్యంరెడ్డి గెలుపొందారు. మిగిలిన మూడు చోట్ల టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. అదే ఏడాది రామకుప్పం ఎంపీపీగా కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకటమ్మ గెలుపొందారు. మిగిలిన ఎంపీపీలన్నీ టీడీపీ గెలిచింది. 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, అన్ని ఎంపీపీలనూ టీడీపీనే గెలుచుకుంది. అయితే 2021లో మొత్తం సీన్‌ రివర్స్‌ అయింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన, కుప్పంలో జరిగిన అభివృద్ధి పనుల వల్లే ఇక్కడి ప్రజలు సైకిల్‌కు పంక్చర్‌ చేసి, ఫ్యాన్‌కు పట్టం కట్టారు. 

చంద్రబాబు సొంతూరులో వైఎస్సార్‌సీపీ జెండా
ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వగ్రామం చంద్రగిరి నియోజకవర్గం నారా వారిపల్లెలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తిరుగులేని విజయం సాధించారు. నారావారిపల్లె గ్రామం ఉన్న చిన్నరామాపురం ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాజయ్య, టీడీపీ అభ్యర్థి గంగాధరంపై 1,399 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఎంపీటీసీ పరిధిలో మొత్తం 3,040 ఓట్లు ఉంటే 2,061 ఓట్లు పోలయ్యాయి. ఆదివారం జరిగిన కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీకి 1,704 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి గంగాధరంకు కేవలం 305 ఓట్లు వచ్చాయి. చంద్రబాబుకు రాజకీయ జీవితం ప్రసాదించిన చంద్రగిరి మండలంలోని 16 ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ స్థానం సైతం వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇక్కడ టీడీపీ ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా గెలవలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement