మహనీయుల స్ఫూర్తితో ముందడుగు | inspired by the initiative | Sakshi
Sakshi News home page

మహనీయుల స్ఫూర్తితో ముందడుగు

Published Sat, Aug 16 2014 1:45 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

మహనీయుల స్ఫూర్తితో ముందడుగు - Sakshi

మహనీయుల స్ఫూర్తితో ముందడుగు

  •   జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి
  •   బందరు పోర్టు నిర్మిస్తాం
  •   స్వాతంత్య్ర దిన వేడుకల్లో మంత్రి ఉమా
  • మచిలీపట్నం : జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సంఘటితంగా కృషి చేద్దామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ముందడుగు వేద్దామని ఆయన పిలుపునిచ్చారు. 68వ స్వాతంత్ర దిన వేడుకలను జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను మంత్రి ఉమా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

    అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం, స్వేచ్ఛా వాయువుల కోసం ఎందరో త్యాగమూర్తులు ప్రాణాలర్పించారని కొనియాడారు. జిల్లాలో కొండా వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, తోట నరసయ్య, త్రిపురనేని రామస్వామిచౌదరి, గొట్టిపాటి బ్రహ్మయ్య, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య తదితరులు స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేశారన్నారు.

    తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన నందమూరి తారకరామారావు మన జిల్లా వాసే కావటం గర్వకారణమన్నారు. శాస్త్రీయ పద్ధతిలో పునర్విభజన జరగకపోవడంతో నూతన ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణబద్ధులై ఉన్నారన్నారు. స్థానిక సంస్థలు, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, గెలుపొందిన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గ్రామ, మండల, జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
     
    మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు

    బందరు పోర్టు పనులను ప్రారంభించి, ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తాం. జిల్లాను ప్రగతి బాటలో పయనింపజేస్తాం.
     
    పులిచింతల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చి దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతుల కలలను సాకారం చేస్తాం.

    పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి     కృష్ణాడెల్టాను స్థిరీకరించి మెట్ట ప్రాంత భూములను వ్యవసాయ యోగ్యంగా మారుస్తాం.

    గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తాం

    కొల్లేరు సరస్సును అభివృద్ధి చేస్తాం.

    విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఫ్లై ఓవర్ నిర్మిస్తాం.

    కృష్ణా యూనివర్సిటీని అన్ని వసతులతో అభివృద్ధి చేయటంతోపాటు వైద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తాం.

    కృష్ణా కరకట్టలు, డెల్టా ఆధునికీకరణ పనులు, బుడమేరు ముంపు నివారణ, తారకరామ ఎత్తిపోతల పథకం, కొండపల్లి-ఇబ్రహీంపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, విజయవాడ మెట్రో సిటీ, మెట్రో రైలు, విజయవాడ అవుటర్ రింగ్ రోడ్, కొండపల్లి ఖిల్లా అభివృద్ధి, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాలపై దృష్టిసారిస్తాం.

    అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలతోపాటు గృహాలు నిర్మించి ఇస్తాం. రేషన్‌కార్డులు, వితంతు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు అందజేస్తాం. చేనేత కార్మికులకు చేయూతనివ్వటంతోపాటు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పిస్తాం. మామడి, మిర్చి, పత్తి, టమోటా తదితర పంటల కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేస్తాం. పంటలను నిల్వ ఉంచుకునేందుకు గిడ్డంగులను నిర్మిస్తాం.

    ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తాం. వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తాం.

    జిల్లాలో రుణమాఫీ ద్వారా 4.50 లక్షల మంది రైతులకు రూ.1,600 కోట్ల రుణమాఫీ చేస్తాం. 65 వేల డ్వాక్రా గ్రూపులకు రూ. 650 కోట్లు రుణమాఫీ చేస్తాం.

    అక్టోబరు 2వ తేదీ నుంచి పరిశ్రమలకు, గృహ వినియోగానికి 24 గంటలూ విద్యుత్ ఇస్తాం. వ్యవసాయ కనెక్షన్లకు 9 గంటల పాటు కరెంటు ఇస్తాం. రూ.200 ఉన్న పింఛను రూ.1,000 చేస్తాం. వికలాంగులకు రూ.1,500లు పింఛను ఇస్తాం.

    ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అక్టోబరు నుంచి 20 లీటర్ల మినరల్ వాటర్‌ను రూ.2కే అందిస్తాం.

    విద్యా, క్రీడారంగాలను అభివృద్ధి చేస్తాం. విద్యార్థుల్లో నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం, విలువలు పెంపొందింపజేసేలా విద్యాబోధన చేయిస్తాం.

    క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. 2017 నేషనల్ గేమ్స్‌ను రాష్ట్రంలోనే నిర్వహించేందుకు ఇప్పటికే మంత్రి మండలి తీర్మానం చేసింది.

    ముఖ్యమంత్రి ‘2029 నవ్యాంధ్ర’ విజన్‌లో ఏడు అంశాలను ప్రవేశపెట్టారు. ప్రాథమిక రంగ మిషన్‌లో వర్షాభావం, కరువు పరిస్థితుల తీవ్రతను తగ్గిస్తాం.

    సామాజిక సాధికారిత మిషన్‌లో విద్య, ఆరోగ్యం, సేవల నాణ్యత, ప్రమాణాలను పెంపొందింప జేస్తాం. నైపుణ్యవృద్ధి మిషన్‌లో ఉపాధి అవకాశాల కల్పన, పరిశ్రమల అనుసంధానం, ఉద్యోగాన్వేషణలో అన్ని వర్గాల్లో నైపుణ్యాన్ని వృద్ధి చేస్తాం.

    పట్టణాభివృద్ధి రంగ మిషన్‌లో ప్రైవేటీకరణ, అర్బన్ ప్లానింగ్, గ్రామాల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపడతాం.

    ఉత్పత్తి రంగ మిషన్‌లో రాష్ట్రస్థాయిలో జీఎస్‌డీపీని గరిష్ఠ స్థాయిలో పెంచుతాం.

    మౌలిక వసతులు రంగ మిషన్‌లో సముద్రతీర ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో వినియోగించటం ద్వారా పోర్టుల అభివృద్ధి, వాణిజ్యాన్ని సులభతరం చేయటంతోపాటు జిల్లాల మధ్య నాలుగు లేన్ల రహదారుల నిర్మాణం, ఇండస్ట్రియల్ కారిడార్‌లు ఏర్పాటు చేస్తాం. సేవా రంగ మిషన్‌లో ఉపాధి అవకాశాలను పెంపొందింపజేస్తూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తాం.
     
    జెడ్పీ కార్యాలయంలో..
    చిలకలపూడి (మచిలీపట్నం) : జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్ పర్సన్ గద్దె అనూరాధ జాతీయ జెండాను ఆవిష్కరించారు.  జెడ్పీ సీఈవో సుదర్శనం, డెప్యూటీ సీఈవో పి.కృష్ణమోహన్, ఏవో అనూరాధ, సిబ్బంది పాల్గొన్నారు.
     
    కలెక్టర్ కార్యాలయంలో..
    కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ జె.మురళి జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎ.ప్రభావతి, కలెక్టరేట్ ఏవో సీతారామయ్య, బి.సెక్షన్ సూపరింటెండెంట్ అనిల్ జెన్నీసన్ పాల్గొన్నారు.
     
    సమరయోధులకు సన్మానం
    వేడుకల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులు మేక నరసయ్య, కొండపల్లి పాండురంగారావు, సమ్మెట ఆంజనేయమ్మలను మంత్రులు ఉమా, కొల్లు రవీంద్ర, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, కలెక్టర్ రఘునందన్‌రావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ శేషగిరిరావు, ఎస్పీ జి.విజయకుమార్, జేసీ జె.మురళీ, ఏజేసీ బీఎల్, చెన్నకేవరావు, డీఆర్వో బి.ప్రభావతి, కృష్ణా వర్సిటీ వీసీ వున్నం వెంకయ్య, మునిసిపల్ చైర్మన్ మోట మర్రి బాబాప్రసాద్ పాల్గొన్నారు. మంత్రి ఉమాకు సంఘసేవకుడు నిడుమోలు వెంకటే శ్వరప్రసాద్  శాలువా కప్పి అభినందించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement