ప్రజాస్వామ్య ప్రక్రియకు పాతరేసిన ఫలితం.. విధి నిర్వహణలో అలసత్వమే ఈసీ వేటుకు కారణం
రాజకీయ ఒత్తిళ్లతో పోలీస్ అధికారుల బదిలీ.. పురందేశ్వరి జాబితా ప్రకారం నియామకాలు
ఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య ప్రక్రియను పరిరక్షించాల్సిన పోలీసు యంత్రాంగం, ఉన్నతాధికారులు బాధ్యత మరచి హింస చెలరేగేందుకు తావిచ్చినందుకు వేటు పడింది! నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వారు రాజకీయ ఒత్తిళ్లతో చెప్పినట్లలా ఆడినందుకే ఈ పరిస్థితి వచ్చింది.
టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుట్రలకు తలొగ్గి పచ్చ ముఠాల విధ్వంసకాండకు కొమ్ముకాసిన పోలీసు అధికారులపై ఎన్నికల కమిషన్ (ఈసీ) కన్నెర్ర చేసింది. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు అధికారులను హఠాత్తుగా బదిలీ చేసిన జిల్లాల్లోనే హింసాకాండ చెలరేగిన విషయాన్ని వైఎస్సార్‌సీపీ, రాష్ట్ర ప్రభుత్వం సవివరంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని అధికారులను నియమించడంతో ఎన్నికల వేళ హింస చెలరేగేందుకు ఆస్కారం ఏర్పడింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో ఈసీ నియమించిన పోలీసు అధికారులు తోలు»ొమ్మల్లా వ్యవహరించడంతో టీడీపీ రౌడీ మూకలు బరి తెగించి భయానక వాతావరణాన్ని సృష్టించాయి.
లావు సన్నిహితుడు.. బిందు మాధవ్
ప్రజాదరణ కోల్పోవడంతో పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అక్రమాలు, హింసకు చంద్రబాబు తెర తీశారు. ఆ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పట్టున్న సమర్థులైన పోలీసు అధికారులు ఉండటం చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. దీంతో వారిపై నిరాధార ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదులు చేశారు. దగ్గుబాటి పురందేశ్వరి ద్వారా ఈ కుట్రలను అమలు చేశారు. పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు పోలీసు అధికారులను బదిలీ చేయాలని పేర్కొంటూ ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో కూడా సూచిస్తూ ఏకంగా జాబితాను సమర్పించారు.
ఈ ఒత్తిడికి తలొగ్గిన ఈసీ హడావుడిగా డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, నిఘా విభాగం ఇన్‌చార్జ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులతోపాటు గుంటూరు డీఐజీ పాలరాజు, అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాలు అత్యధికంగా ఉన్న పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం ఎస్పీలు, విజయవాడ సీపీని బదిలీ చేసింది. క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించే డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు కలిపి 14 మందిని బదిలీ చేయడం గమనార్హం.
చంద్రబాబు ఆదేశాలతో పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని పోలీసు అధికారులకు ఆ స్థానాల్లో పోస్టింగ్‌లు ఇచ్చింది. సమస్యాత్మక పల్నాడు జిల్లా ఎస్పీగా గరికిపాటి బిందు మాధవ్‌ను నియమించారు. ఆయన టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అదే రీతిలో పురందేశ్వరి సూచించిన వారినే తిరుపతి, అనంతపురం జిల్లాల్లో నియమించారు.
పూర్తిగా విఫలమైన ఈసీ నియమించిన అధికారులు
క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన, పట్టులేని అధికారులను నియమించడంతో పోలింగ్ సందర్భంగా, అనంతరం టీడీపీ రౌడీ మూకలు చెలరేగిపోయాయి. యథేచ్ఛగా విధ్వంసకాండ సృష్టించాయి. నరసరావుపేట, గురజాల, మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి నియోజకవర్గాల్లో స్వైర విహారం చేశాయి. పెట్రోల్ బాంబులతో భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ఈ జిల్లాల్లో ఈసీ నియమించిన పోలీసు అధికారులు శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమయ్యారు. టీడీపీ మూకలు విధ్వంసం సృష్టిస్తుంటే పల్నాడు ఎస్పీ గరికిపాటి బిందు మాధవ్‌తోపాటు ఆయన ఆధ్వర్యంలోని డీఎస్పీలు, సీఐలు చేష్టలుడిగి చూస్తుండిపోయారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌లపై టీడీపీ రౌడీ మూకలు దాడులకు తెగబడి బాంబులు విసిరినా సరే పోలీసులు పత్తా లేరు. తమపై దాడులు జరుగుతున్నాయని పల్నాడు ఎస్పీకి మొర పెట్టుకున్నా కనీస స్పందన లేదు. పోలింగ్ సక్రమంగా నిర్వహించడంలో పల్నాడు కలెక్టర్ లోతేటి శివ శంకర్ పూర్తిగా విఫలమయ్యారు. అనంతపురం జిల్లాల్లో శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా దిగజారినా జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ చోద్యం చూస్తూ ఉండిపోయారు.
కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనంలో రూ.2 కోట్లు లభ్యమైతే కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. పోలింగ్ సందర్భంగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు, టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి, అల్లుడు దీపక్‌రెడ్డి పోలింగ్ కేంద్రాల్లో చొరబడి అక్రమాలకు తెగించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై టీడీపీ గూండాలు రాళ్ల వర్షం కురిపించారు.
ఎస్పీ అమిత్ బర్దర్ వీటిని కట్టడి చేయలేకపోయారు. ఏకంగా పోలీసులే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంలోకి దూరి విధ్వంసం సృష్టించడం నివ్వెరపరిచింది. చంద్రగిరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిపై టీడీపీ గుండాలు దాడి చేశారు. ఆయన వాహన శ్రేణిలోని వాహనానికి నిప్పుపెట్టారు. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ అల్లరి మూకలను కట్టడి చేయడంలో విఫలమయ్యారు.
ఏఎస్పీ వల్లే తాడిపత్రిలో అల్లర్లుటీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన వైనం
తాడిపత్రి రూరల్: అడిషనల్ ఎస్పీ రామకృష్ణ తీరే తాడిపత్రిలో విధ్వంసానికి కారణమైందని పట్టణంలో చర్చ జరుగుతోంది. టీడీపీకి దన్నుగా నిలిచి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కక్ష సాధింపు ధోరణితో ప్రవర్తించారని స్పష్టమవుతోంది. అనంతపురంలో ‘సెబ్’ అడిషనల్ ఎస్పీగా ఉన్న రామకృష్ణను పథకం ప్రకారమే అధికారులు తాడిపత్రి ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టీడీపీకి చెందిన జేసీ ప్రభాకర్‌రెడ్డికి పోలింగ్ కేంద్రాలను పరిశీలించే అనుమతి లేదని, ఆయన రాకతో అల్లర్లు చెలరేగి శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని ఎన్నికల అధికారులు చెప్పినా, ఏఎస్పీ పెడచెవిన పెట్టారు. పైగా జేసీ ప్రభాకర్‌రెడ్డి వెంట ఉంటూ వైఎస్సార్‌సీపీ నాయకులపై చిందులు తొక్కారు. పోలింగ్ రోజు ఓంశాంతి నగర్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడికి దిగారు.
ఆ సమయంలో జేసీ, అతని అనుచరులను అదుపులోకి తీసుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఏఎస్పీ తమకు అండగా ఉన్నాడన్న ధైర్యంతోనే జేసీ వర్గీయులు అరాచకం సృష్టించారు. ఈ విషయమై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఈసీ, డీజీపీలకు ఫిర్యాదు చేయగానే.. ఏఎస్పీ పోలీసు సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి తలుపులు పగులగొట్టి పర్నీచర్, కంప్యూటర్లు ధ్యంసం చేయించడం, దొరికిన వారిని దొరికినట్లు చితక బాదడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment