- బందరు మున్సిపాలిటీలో ఫోర్జరీ కేసు విచారణలో జాప్యం
- తప్పించుకునేందుకు పైరవీలు చేస్తున్న అక్రమార్కులు
- ఎన్నికల వ్యయంలోనూ మతలబు
- పట్టించుకోని ఉన్నతాధికారులు
మచిలీపట్నం : ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేరంటారు. కానీ, ఉన్నతాధికారి సంతకం ఫోర్జరీ చేసి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చిన ఇంటిదొంగ ఎవరనేది తెలిసినా కఠిన చర్యలు తీసుకునేందుకు బందరు మున్సిపల్ అధికారులు, పోలీసులు రెండు నెలలుగా మీనమేషాలు లెక్కించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫోర్జరీ ఎవరు చేశారనే విషయం తెలిసినా మున్సిపల్ అధికారులు కేవలం పోలీసు ఫిర్యాదుకే పరిమితం కావడంపై ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు అధికారులంతా ఏకమై ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్కబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది.
తప్పు ఒకరు చేస్తే.. శిక్ష మరొకరికి!
పట్టణంలో చేపట్టాల్సిన రూ.20లక్షల విలువైన పనులను కొందరు కాంట్రాక్టర్లకు కేటాయించేందుకు ఆమోదం తెలిపే ఫైలుపై మార్చి నెలకు ముందు ప్రత్యేకాధికారి, ఏజేసీ బీఎల్ చెన్నకేశవరావు సంతకాన్ని ఇంజినీరింగ్ విభాగ అధికారులు ఫోర్జరీ చేశారు. ఈ విషయం ఆగ స్టులో బయటపడింది. ప్రత్యేకాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేయటంలో నైపుణ్యం చూపిన సదరు అధికారి సంతకం కింద తేదీ వేసే సమయంలో తన అలవాటు ప్రకారమే వ్యవహరించారు. దీంతో ఫోర్జరీ ఎవరు చేశారనే విషయం బహిరంగ రహస్యమేనని మున్సిపల్ సిబ్బంది, అధికారులు చెబుతున్నారు.
అయితే, ఫోర్జరీ చేసిన అధికారిని వదిలేసి కేవలం ఇంజినీరింగ్ విభాగంలో పని చేసే చిరు ఉద్యోగిని మాత్రమే సస్పెండ్ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేకాధికారి సంతకం ఫోర్జరీ చేసిన ఫైలును పోలీసులు రెండు నెలల క్రితం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అప్పటి నుంచి ఈ కేసు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ కేసును త్వరగా తేల్చాలని ఏజేసీ చెన్నకేశవరావు పలుమార్లు పోలీసులను, పురపాలక శాఖ ఉన్నతాధికారులను కోరినా ఫలితం లేకపోవడం గమనార్హం. పురపాలక శాఖలోని ఇంజినీరింగ్, ఇతర విభాగాల అధికారులు కలిసి హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేస్తూ ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల ఖర్చు సంగతేమిటీ..!
ఈ ఏడాది మార్చిలో జరిగిన పురపాలక సంఘం ఎన్నికలకు బందరు మున్సిపాల్టీలో రూ.64 లక్షల ఖర్చు చూపారు. ఈ ఖర్చులకు సంబంధించి బిల్లులు మంజూరైనా ఓచర్లు సమర్పించకపోవటం వివాదాస్పదమవుతోంది. పురపాలక సంఘంలోని టౌన్‌ప్లానింగ్ క్లర్క్‌ను అడ్డుపెట్టి రూ.40 లక్షల వరకు నిధులు డ్రా చేశారు. మరో ఇద్దరు ఉద్యోగుల పేరుతో రూ.24 లక్షలు డ్రా చేశారు. వీటిలో అధిక శాతం బిల్లులు మంజూరైనా ఓచర్లు లేవు. దీంతో ఈ వ్యవహారం నుంచి ఎలా బయటపడాలనే విషయమై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
ఇందుకు సంబంధించి నకిలీ ఓచర్లు సృష్టించే పనిలో కొందరు అధికారులు బిజీగా ఉన్నట్లు సమాచారం. టౌన్‌ప్లానింగ్ విభాగం ఉద్యోగి పేరుతో నిధులు డ్రా చేసే అవకాశం లేకపోయినా, అధికారులు ఓ అడుగు ముందుకు వేసి గుట్టుచప్పుడు కాకుండా తమ పని పూర్తి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని బిల్లుల ఫైళ్లపై అనుమానాలు ఉన్నాయని సంతకం చేసేందుకు ప్రత్యేకాధికారి చెన్నకేశవరావు తిప్పిపంపారు.
మున్సిపాలిటీకి పాలకవర్గం ఏర్పడిన తర్వాత అధికారుల అక్రమాలు బయటకు వస్తాయని పలువురు భావించినా ఫలితం లేకపోయింది. పాలకవర్గం కూడా అధికారులు చెప్పినట్లే నడుస్తోంది. పురపాలక సంఘ తొలి సమావేశంలోనే 17వ అంశంలో ఎన్నికల వ్యయం నిమిత్తం చేసిన రూ.16,60,805 బిల్లును ఆమోదించటం ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మున్సిపాలిటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.