=ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కావడం లేదని ఆవేదన
=ఖిన్నులైన మేయర్, కమిషనర్
= ‘ ఫేస్ టూ ఫేస్’లో ఆగ్రహావేశాలు
90 చదరపు గజాల్లో ఇంటి నిర్మాణ అనుమతి కోసం నెలల తరబడి తిరుగుతున్నా. తిరిగి తిరిగి వేసారి పోతున్నాం. వివిధ సందర్భాల్లో ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు
-బాగ్‌లింగంపల్లికి చెందిన నారాయణరెడ్డి ఆవేదన
బోరబండలోని సారథి హౌసింగ్ సొసైటీలోని నా ఫ్లాట్‌ను దొంగ దస్తావేజులతో ఆక్రమించుకున్న వారి కి కరెంటు, మంచినీటి కనెక్షన్లు ఇచ్చారు. తగిన దస్తావేజులతో విన్నవించినా అధికారుల నుంచి స్పందన లేదు. స్వయంగా మేయర్ దృష్టికి తెచ్చినా పట్టించుకోవడం లేదు. ఇకనైనా పట్టించుకుంటారా.. లేదా
- సీహెచ్ కృష్ణ ఆగ్రహం
నాలుగేళ్లుగా తిరుగుతున్నా నల్లా కనెక్షన్ ఇవ్వరు. చెల్లించాల్సిన ఫీజులన్నీ చెల్లించినా..వాణిజ్య కేటగిరీ కింద కనెక్షన్ ఇవ్వమన్నా ఇవ్వడం లేదు.
- ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ నిర్వాహకుడి ఆక్రోశం
ఇదీ శనివారం జరిగిన ‘ఫేస్ టూ ఫేస్’లో ప్రజాగ్రహం. కార్యాలయాలు చుట్టూ రోజులు..నెలలు తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజావాణి’లలో మొరపెట్టుకున్నా పరిస్థితిలో మార్పు ఉండటం లేదంటూ పలువురు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘ఫేస్ టూ ఫేస్’లో మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించని వేదికల వల్ల ప్రజలకు సమయం, ధనం వ్యయం తప్ప మిగిలేదేమిటంటూ రగిలిపోయారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మేయర్ మాజిద్, కమిషనర్ సోమేశ్‌కుమార్‌లు నచ్చజెప్పేందుకు యత్నించారు.
90 చ.గజాల్లో ఇంటి నిర్మాణ అనుమతికి సంబంధించిన దస్త్రాలన్నీ ఉంటే..వెంటనే అనుమతిప్పిస్తామని కమిషనర్ హామీఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం 12గంటల్లోగా అనుమతి పత్రం ఇవ్వని పక్షంలో సంబంధిత అధికారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. శివరాంపల్లి, టాటానగర్, హసన్‌న గర్‌లలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేతలకు చర్యలు తీసుకుంటున్నామని మేయర్ మాజిద్ మీడియా ప్రతినిధి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికే నోటీసులు జారీచేశామని..పాటించాల్సిన విధివిధానాలు పాటిస్తూ కూల్చివేతలు చేపడుతున్నామన్నారు. ఎంతోకాలంగా తామెదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు.
చర్యలు తీసుకోండి : తమ స్థాయిలోనే పరిష్కారమయ్యే సమస్యలను పరిష్కరించని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేయర్ మాజిద్ కమిషనర్ సోమేశ్‌కుమార్‌కు సూచించారు. ‘ఫేస్ టు ఫేస్’లో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో..మ్యాన్‌హోల్ కవర్ మూత వేయాలన్నా కమిషనరే చేయాలనుకోవడం తగదని..సంబంధిత సర్కిల్, జోనల్ స్థాయి అధికారులు ఎవరి పరిధిలోని సమస్యల్ని వారే పరిష్కరించాలన్నారు. వారు పరిష్కరించనందునే ప్రజలు జీహెచ్‌ఎంసీ ప్రధానకార్యాలయం దాకా వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫేస్ టూ ఫైర్
Published Sun, Dec 8 2013 5:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement
Advertisement