కార్డు మారుతోంది...
- రేషన్ కార్డుల స్థానంలో ఆహారభద్రత కార్డులు
- నేటి నుంచి రేషన్‌షాపుల్లో దరఖాస్తుల స్వీకరణ
- కార్డుదారులు సైతం దరఖాస్తుచేసుకోవాల్సిందే
- విచారణ ఆధారంగానే కొత్త కార్డుల జారీ
సాక్షి, సిటీబ్యూరో: పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్న తెల్ల రేషన్ కార్డు రూపు మారుతోంది. ఎన్నో ఏళ్లుగా అమలులో ఉన్న ఈ కార్డుల స్థానంలో కొత్తగా ఆహార భద్రత కార్డులు ప్రవేశపెడుతున్నారు. ఈమేరకు నగరంలో తెల్లరేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డుల జారీ కోసం సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రేషన్‌కార్డులు కలిగి ఉన్నవారితోపాటు కొత్త వారుసైతం ఆహారభద్రత కార్డుల కోసం నివాసాలకు సమీపంలోని రేషన్ షాపుల్లో ధరఖాస్తులు ఇవ్వాల్సి ఉంటుంది.
దారిద్య్రరేఖకు దిగువనగల నిరుపేదకుటుంబాలు తెల్లకాగితంపై సమగ్ర వివరాలు తెలియజేస్తూ దరఖాస్తు అందజేయాల్సి ఉంటుంది. వీటి పరిశీలన, సమగ్ర విచారణ అనంతరం అర్హులైన కుటుంబాలకు మాత్రమే ఆహార భద్రత కార్డులు జారీ కానున్నాయి. నిత్యవసర సరుకులకు మాత్రమే ఈ కార్డులు ఉపయోగపనున్నాయి. సివిల్ సప్లై అధికారుల పర్యవేక్షణలో డీలర్ షాపుల్లో ఈ నెల 20 వరకు ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు.
8 లక్షల వరకు దరఖాస్తులు
హైదరాబాద్ నగరంలో ఆహార భద్రత కార్డుల కోసం సుమారు 8 లక్షల వరకు దరఖాస్తులు అందవచ్చని పౌరసరఫరాల శాఖ అధికారులలు అంచనా వేస్తున్నారు. నగరానికి పెరుగుతున్న వలసలతో అధికారుల అంచనాలకు మించి మరో లక్ష వరకు దరఖాస్తులు పెరిగే అవకాశాలూ లేకపోలేదు. ప్రస్తుతం బోగస్‌కార్డుల ఏరివేత అనంతరం అర్హులైన 6.23 లక్షల తెల్లరేషన్ కార్డులు ఉండగా, రచ్చబండ సందర్భంగా సుమారు 77 వేల కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి.
ఇన్‌స్పెక్టర్లదే పర్యవేక్షణ బాధ్యత...
ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపై పర్యవేక్షణ బాధ్యత సివిల్‌సప్లై ఇన్‌స్పెక్టర్లకు అప్పగించారు. రేషన్ షాపులో దరఖాస్తులు స్వీకరించనున్నప్పటికీ సివిల్‌సప్లై ఇన్స్‌పెక్టర్ పర్యవేక్షణలోనే ప్రక్రియ కొనసాగనుంది. ప్రభుత్వ చౌకధర దుకాణాల పనివేళల్లో మాత్రమే దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని పౌరసరఫరాల అధికారి రాజశేఖర్ తెలిపారు.