సాక్షి, ఒంగోలు: పేదలపై ప్రభుత్వ బాదుడు మొదలైంది. ఆహార భద్రతపై కేంద్రప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుండగా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొనసాగే పథకాలను రద్దు చేస్తూ పేదలకు మొండిచేయి చూపుతోంది. తెల్లరేషన్ కార్డులున్న పేదలకు నిత్యావసరాలను అతితక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ‘అమ్మహస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించగా, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించే బియ్యం, కిరోసిన్‌తోపాటు మరో తొమ్మిది రకాల సరుకులను రూ.185కే ప్రత్యేక ప్యాకెట్లలో పంపిణీ చేయాలని నిర్ణయించారు. కిందటేడాది ఏప్రిల్ 24 నుంచి అమలవుతున్న ఈ పథకం ప్రస్తుత టీడీపీ పాలనలో క్రమేపీ కనుమరుగవుతోంది. దీంతో పేదలకు ఉప్పు, పప్పు, చింతపండు, నూనె మార్కెట్‌లో మరింత ప్రియం కానున్నాయి. ఆర్థిక పొదుపు పేరిట తెల్లరంగు రేషన్‌కార్డుదారులకు అందించే నిత్యావసర సరుకులను సెప్టెంబర్ నెల నుంచి నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలొచ్చాయి.
నిండుకున్న నిత్యావసరాల నిల్వలు
కేంద్రప్రభుత్వం రాయితీని నిలుపుదల చేసిందనే సాకుతో పామోలిన్ పంపిణీని మే నెల నుంచి పూర్తిగా నిలిపివేశారు. మూడు నెలలుగా అమ్మహస్తం సరుకులు కార్డుదారులకు పూర్తిస్థాయిలో పంపిణీ జరగడం లేదు. రానున్న రోజుల్లో పథకం కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చేనెలలో బియ్యం, చక్కెరతో సరిపెట్టుకోవాల్సిందే. ఇప్పటిదాకా అమలైన అమ్మహస్తం పథకంలో కిలో కందిపప్పు రూ.50కు, లీటర్ పామోలిన్ ఆయిల్ రూ.40, గోధుమపిండి కిలో రూ.16.50, కిలో గోధుమలు రూ.7, అరకిలో చక్కెర రూ.6.75, కిలోఉప్పు రూ.5, పావుకిలో కారం రూ.20, అరకిలో చింతపండు రూ.30, పసుపు (100 గ్రాములు) రూ.10కు పంపిణీ చేశారు.
జిల్లాలో మొత్తం 8.90 లక్షల మంది తెల్లరంగు కార్డుదారులున్నారు. వీరందరికీ జిల్లావ్యాప్తంగా 2,085 ప్రజాపంపిణీ దుకాణాల ద్వారా నెలవారీ బియ్యం ఇతర వస్తువులు అందిస్తున్నారు. కార్డుదారులకు రూ.292 విలువ చేసే తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను రూ.185కే చౌకధరల దుకాణాల్లో పంపిణీ చేస్తున్నారు. లబ్ధిదారులకు రూ.107లు లబ్ధికలిగేది. పథకం ప్రారంభంలో కొన్ని మండలాల్లో నాసిరకం సరుకులు పంపిణీ చేసినట్లు విమర్శలు వెల్లువెత్తినప్పటికీ, ప్రభుత్వం సక్రమంగా దృష్టిసారిస్తే పేదలకు ప్రయోజనకరమైన పథకమిది.
సెప్టెంబర్ నెలకు సరుకుల్లేవ్..
జిల్లాలో 8 లక్షల 90 వేల మంది కార్డుదారులున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా జిల్లాపౌరసరఫరాల సంస్థ అధికారులు 2085 చౌకధరల దుకాణాల ద్వారా ప్రతినెలా బియ్యంతోపాటు అమ్మహస్తం సరుకులను పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 19 ఎంఎల్‌ఎస్ గోడౌన్‌లలో గోధుమపిండి 26 టన్నులు, ఉప్పు 77 టన్నులు, కందిపప్పు 121 టన్నులు, పంచదార 429 టన్నులు మాత్రమే నిల్వలున్నాయి. ఈలెక్కన సెప్టెంబర్ నెలలో కార్డుదారులు బియ్యం, చక్కెరతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
పేదలపై రూ.25.98 కోట్ల భారం:
అమ్మహస్తం సరుకుల పంపిణీ నిలిచిపోతే పేదలపై రూ.25,98,80,000 భారం పడనుంది. ఇదే తరుణంలో నిత్యావసర వస్తువుల ధరలు అదుపుతప్పే ప్రమాదముంది. సామాన్యులు నిత్యావసరాలను కొనుగోలు చేయలేని పరిస్థితికి ధరలు చేరుకున్నాయి. ప్రస్తుతం పామోలిన్, కందిపప్పు ధరలు ఆకాశాన్నంటాయి. ‘అమ్మహస్తం’ కనుమరుగు కావడంతో కార్డుదారులు నిత్యావసర సరుకులను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిందే. దీంతో కరువు జిల్లాప్రజలపై నిత్యావసర సరుకుల భారం మరింత పెరగనుంది. నూతన ప్రభుత్వం అమ్మహస్తం సరుకులు పంపిణీ చేసి పేదలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
‘అమ్మ హస్తా’నికి ‘చంద్ర’ గ్రహణం
Published Mon, Sep 1 2014 3:34 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement