అదనపు బియ్యానికి కేంద్రం ఓకే !
♦ రాష్ట్రానికి గోధుమలకు బదులు బియ్యం
♦ కేంద్ర పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కమిటీ సిఫార్సు
♦ 4వేల టన్నుల అదనపు బియ్యం ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం
♦ రాష్ట్రంపై దాదాపు రూ.400 కోట్ల భారం తగ్గే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆహార భద్రతా పథకానికి అదనపు బియ్యం సమకూర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపంపై కేంద్రం ఎట్టకేలకు కరుణ చూపింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న రూపాయికి కిలో బియ్యం, సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం పథకాలను దృష్టిలో పెట్టుకొని బియ్యం అవసరాలకు సహకారం అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఆహార భద్రతా పథకం కింద సరఫరా చేస్తున్న గోధుమల స్థానంలో బియ్యం ఇచ్చేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సంయుక్త కార్యదర్శి స్థాయిలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించింది.
ఆహార భద్రతా చట్టం కింద తెలంగాణలో మొత్తంగా 1.91కోట్ల మందిని అర్హులుగా తేల్చిన కేంద్రం వీరి అవసరాల మేరకు బియ్యాన్ని సరఫరా చేస్తోంది. నిజానికి రాష్ట్రంలో ఆహార భద్రతా చట్టం కింద అర్హత సాధించిన వారి సంఖ్య 2.80 కోట్ల పైచిలుకుగా ఉంది. అదీగాక ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం తలా 4 కేజీల బియ్యాన్ని మాత్రమే సరఫరా చేస్తుండగా రాష్ట్రం దానికి అదనంగా మరో రెండు కిలోలను కలిపి పంపిణీ చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఏటా 18 లక్షల మెట్రిక్ టన్నుల మేర బియ్యం అవసరమవుతోంది.
అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం 13.36 లక్షల మెట్రిక్ టన్నుల మేర మాత్రమే సరఫరా చేస్తుండటంతో రాష్ట్రంపై 5 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు భారం పడుతోంది. దీనికి తోడు రాష్ట్రంలోని 2,757 సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న 4,80,926 మంది, 34,319 ప్రభుత్వ పాఠశాలల్లోని 29,86,010 మంది విద్యార్థుల భోజనంకోసం ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తోంది. దీనికోసం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నెలకు 14వే ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. దీంతో బియ్యం సబ్సిడీ భారం అధికమవుతోంది.
ఎట్టకేలకు సానుకూలత..
భారాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కేం ద్రానికి పలుమార్లు విన్నవించినా పెద్దగా చలనం కనిపించలేదు. కాగా ఈ ఏడాది జనవరి నుంచి కేంద్రం ఆహార భద్రతా చట్టం అమలు చేస్తున్న రాష్ట్రాలకు గోధుమలను సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి ప్రతి నెలా 8,268 మెట్రిక్ టన్నుల గోధుమలను సరఫరా చేస్తోంది. అయితే రాష్ట్రంలో గోధుమలకు పెద్దగా డిమాండ్ లేని దృష్ట్యా వాటికి బదులు బియ్యాన్ని ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా ఎట్టకేలకు ఉన్నతాధికారుల కమిటీని నియమించింది. రాష్ట్రానికి గోధుమలకు బదులు 4 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చేందుకు కమిటీ సానుకూలత తెలిపింది. ఈ బియ్యాన్ని ఎప్పటి నుంచి సరఫరా చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రాష్ట్రంపై దాదాపు రూ.400 కోట్ల మేర భారం తగ్గే అవకాశాలున్నాయని పౌర సరఫరాల శాఖ అంచనా వేస్తోంది.