మార్కెట్‌లో విషతుల్య ఆహారోత్పత్తులెన్నో? | ​How Much Food Safety In India? | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో విషతుల్య ఆహారోత్పత్తులెన్నో?

Published Tue, Jan 9 2018 5:28 PM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM

​How Much Food Safety In India? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పుష్పమ్‌ ఫుడ్స్‌ కంపెనీ మార్కెట్‌లో విక్రయిస్తున్న 'రెస్ట్‌లెస్‌ జిన్‌సెంగ్‌' అనే ఎనర్జీ డ్రింక్‌లో ప్రమాదకరమైన 'కఫేన్, జిన్‌సెంగ్' మిశ్రమం ఉందని భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రమాదకరమైన మిశ్రమం కారణంగా ఈ ఎనర్జీ డ్రింక్‌ తాగినవారికి ఎంత ఎనర్జీ వస్తుందో తెలియదుగానీ గుండెపోటు, రక్తపోటు రావడం ఖాయమని వారు తేల్చిచెప్పారు. వినియోగదారుల ఫిర్యాదు మేరకే ఆహార భద్రతా సంస్థ తరఫున శాస్త్రవేత్తలు స్పందించారనడం ఇక్కడ గమనార్హం.

ఈ ఉత్పత్తిని అమ్ముతున్న కంపెనీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2015, జూన్‌లో 'నో  అబ్జెక్షన్‌ సర్టిఫికేట్' జారీ చేసింది. ఆహార భద్రతా అధికారులతోపాటు వినియోగదారుల సంఘాలు గోల చేయడంతో విష రసాయనం వెలుగులోకి వచ్చిన ఏడు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్పత్తికి ఎన్‌ఓసీని రద్దు చేసింది. ఈలోగా మార్కెట్‌లోకి విడుదల చేసిన ఎనర్జీ డ్రింక్‌ స్టాక్‌నంతా పుష్పమ్‌ ఫుడ్స్‌ కంపెనీ అమ్ముకోగలిగింది. ఈ ఏడు నెలలపాటు ఆ ఎనర్జీ డ్రింక్‌ను తాగిన వినియోగదారుడు అనారోగ్యానికి గురవుతూనే ఉన్నాడన్న మాట. అవసరమైన ముందస్తు తనిఖీలు లేకుండా 'మా ఉత్పత్తులు సురక్షితం' అంటూ కేవలం కంపెనీలు ఇచ్చే భరోసాపైనా మార్కెట్‌లోకి విడుదలైన ఇలాంటి ఆహార ఉత్పత్తులు దాదాపు 800 రకాలు ఉన్నాయి. వాటన్నింటినిపై పరిశోధనలు జరిపితే ఎన్ని జబ్బులకు దారితీస్తున్న విష మిశ్రమాలున్నాయో!

'జిన్‌సెంగ్' ఉత్పత్తిని నిలిపివేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏడు నెలలు పట్టడానికి కారణం అందులో ప్రత్యక్ష పాపం తనది కూడా కావడం. ఆహార పరిశ్రమ నుంచి వస్తున్న ఒత్తిడికి తట్టుకోలేకనో లేదా చేతులు తడుపుకోవాలనే తహతహో తెలియదుగానీ ఆహార భద్రత ప్రమాణాలను భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ 2012 నుంచి సడలిస్తూ వస్తోంది. ఇక కేంద్రంలోని ఆహార శాఖా కార్యాలయంలోని డాక్యుమెంట్ల ప్రకారం 2014, ఆగస్టు నెలలో కేంద్రంలోని ప్రధాన మంత్రి కార్యాలయం స్వయంగా జోక్యం చేసుకొని సడలింపు పేరిట నిబంధనలను నీరుగార్చింది. ఆహార భద్రతా సంస్థ అధికారులతోపాటు, కేంద్ర ఆహార శుద్ధి శాఖ, పారిశ్రామిక వర్గాలతో ప్రధాన మంత్రి ప్రిన్సిపల్‌ కార్యదర్శి సమావేశమై కొత్త ప్రమాణాలను నిర్దేశించారు. వీటిని అప్పటి ఆహార భద్రతా సంస్థ సీఈవో వైఎస్‌ మాలిక్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. అదే ఏడాది మే నెలలో ఈ ప్రమాణాలు ప్రమాదరమైనవంటూ నచ్చ చెప్పేందుకు  పారిశ్రామికవేత్తలకు ఆయన బహిరంగ లేఖ కూడా రాశారు. 'మా ఆహారోత్పత్తులు సురక్షితం' అంటూ కంపెనీలే భరోసా ఇస్తున్నప్పుడు మనకెందుకు అభ్యంతరమంటూ మాలిక్‌కు నచ్చచెప్పేందుకు ప్రధాని ప్రధాన కార్యదర్శి ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో మాలిక్‌ను ఆహార భద్రతా సంస్థ నుంచి బదిలీ చేశారు. 

ఇంతకు ఆయన వ్యతిరేకించిన అంశాలేమిటీ?
శుద్ధి చేసిన ఆహార పదార్థాలలో సాధారణంగా మూడు రకాల పదార్థాలు లేదా మిశ్రమాలు ఉంటాయి. ఒకటి ప్రొప్రైటరీ ఫుడ్స్, రెండు నావెల్‌ ఫుడ్స్, మూడు యాడింగ్స్‌. ప్రొప్రైటరీ ఫుడ్స్‌ అంటే, మనం తినే రకరకాలు దినుసులు. కెఫిన్, జిన్‌సెంగ్‌ కూడా ఈ రకం పదార్థాలే. విడివిడిగా ఈ రెండు పదార్థాలు ఆరోగ్యానికి మంచివే. కానీ వీటి మిశ్రమం వల్ల ప్రమాదరకమైన రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇక రెండోది నావెల్‌ ఫుడ్స్‌. కొత్త రుచుల ఆహారం లేదా ఆహార మిశ్రమం. ఇక యాడింగ్స్‌ అంటే ఆ ఆహార పదార్థాలను ఎక్కువ కాలంపాటు నిల్వ ఉంచేందుకు ఉపయోగించే మిశ్రమాలు, రసాయనాలు. నావెల్‌ ఫుడ్స్‌..కంపెనీ యాజమాన్యం ఇష్ట ప్రకారం ఉంటాయి. ప్రొప్రైటరీ ఫుడ్స్, యాడింగ్స్‌ మాత్రం ఆహార భద్రతా సంస్థ శాస్త్రవేత్తలు సూచించిన ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలి. ఏయే పదార్థాలు, ఏయే మిశ్రమాలు ఏ స్థాయిలో ఉండాలో ఆహార సంస్థ భద్రతా ప్రమాణాలు సూచిస్తాయి. 

పారిశ్రామిక వర్గాల ఒత్తిడి
ప్రొప్రైటరీ ఫుడ్స్, యాడింగ్స్‌ వల్ల అనవసరంగా తమకు కాలయాపన అవుతోందని, వీటిని సడలించాలని ఎప్పటి నుంచో పారిశ్రామిక వర్గాలు కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తెస్తున్నాయి. ఆ ఒత్తిళ్లకు లొంగి 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రమాణాలను కొంత సడలించగా, 2014లో అధికారంలోకి వచ్చిన బీజీపీ ప్రభుత్వం మరింతగా సడలించింది. అయితే పలు అవాంతరాలు, కోర్టు కేసుల కారణంగా సడలించిన నిబంధనలు 2016, జనవరి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆహార భద్రతకు సంబంధించి పీఎంవో ఆధ్వర్యంలో కేంద్ర ఆహార శాఖ తీసుకున్న నిర్ణయాలకు పార్లమెంట్‌ ఆమోదం లేదన్న కారణంగా ముంబై హైకోర్టు కొట్టి వేయడం, దానిపై కేంద్రం సుప్రీం కోర్టుకు వెళ్లడం తదితర కారణాల వల్ల జాప్యం జరిగింది. ఇంత జాప్యం జరిగిందన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యతా రహితంగా భద్రతా ప్రమాణాలను నోటిఫై చేయకుండానే అమల్లోకి తెచ్చింది. 
 

సడలించిన ప్రమాణాలేమిటీ?
సడలించిన ప్రమాణాల ప్రకారం ప్రొప్రైటరీ ఫుడ్స్‌ విషయంలో ఆహార సంస్థ ఆమోదించిన పదార్థాలు లేదా దినుసులు ఉపయోగించాలి. అయితే వాటిని వేటివేటితో కలుపుతారో, ఏ మోతాదులో కలుపుతారో ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఈ నిబంధన ఉండేది.  ఇక్కడ కెఫేన్, జిన్‌సెంగ్‌ భారత ఆహార సంస్థ ఆమోదించినవే. అయితే వాటి మిశ్రమానికి ఆహార సంస్థ ఆమోదం లేదు. ఈ రెండింటిని కలపడం వల్ల జిన్‌సెంగ్‌ ప్రమాదకర డ్రింక్‌గా మారింది. అలాగే ఎక్కువ కాలం ఆహార పదార్థాలను నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పదార్థాలు కూడా ఆహార సంస్థ ఆమోదించినవే ఉండాలి. అయితే అది ఏ మోతాదులో ఉండాలో యాజమాన్యం ఇష్టం. ఇంతకుముందు ప్రమాణాలు పాటించాల్సి వచ్చేది. ప్రజల ఆరోగ్యానికి అసలైన ప్రమాదకారి ఈ నిల్వ ఉంచే పదార్థమే. అయితే ఇది మోతాదు మించితే మనుషుల ప్రాణాలకే ముప్పు. వ్యాపారులు లాభాపేక్షతో తమ ఉత్పత్తులు మార్కెట్‌లో త్వరగా పాడవకుండా ఉండేందుకు ఈ పదార్థాల మోతాదును ఎక్కువ కలుపుతారనే విషయం ఎవరైనా గ్రహించగలరు. 'మ్యాగీ' నూడిల్స్‌లో మోతాదుకు మించి సీసం ఉందన్న కారణంగా కొంతకాలం వాటి ఉత్పత్తులను మార్కెట్‌లో నిలిపేసిన విషయం తెల్సిందే. ఇంకా అప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు నోటిఫై కాలేదు. 

గుడ్డిగా ప్రోత్సహించడంతోనే

భారతీయ మార్కెట్‌లో ఆహారోత్పత్తుల కంపెనీలను ప్రోత్సహించాలనే అత్యుత్సాహంతో కేంద్ర ప్రభుత్వాలు భద్రతా ప్రమాణాలను సడలిస్తూ వస్తున్నాయి. 2025 నాటికి దేశంలో ఏటా 72 లక్షల కోట్ల ఈ ఆహరపదార్థాల వ్యాపారం నడుస్తుందని, వాటిలో ఏటా 60 లక్షల కోట్ల రూపాయలు లాభాలే ఉంటాయన్నది ఓ అంచనా. ప్రజల ఆరోగ్యాన్ని, భద్రతా ప్రమాణాలను పణంగా పెట్టినప్పుడు ఇన్ని కోట్ల వ్యాపారం ఎవరి కోసం!? అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లు తమ ఆహార భద్రతా ప్రమాణాలను రోజురోజుకు కఠినం చేస్తూ వెళుతుంటే మన దేశం సడలిస్తూ రావడం విచిత్రం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement