
ఆధార్‌తో పరేషన్..
ఆధార్.. గుర్తింపు, వివిధ ప్రయోజన పథకాలకు ఇదే ఆధారం. అయితే ఇదే కొన్నిసార్లు జీవనాధారాన్ని కూడా తెంచుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో నిరుపేదల పాలిట ‘ఆధార్’ శాపంగా మారింది.
సాక్షి,సిటీబ్యూరో/ మెహిదీపట్నం: ఆధార్.. గుర్తింపు, వివిధ ప్రయోజన పథకాలకు ఇదే ఆధారం. అయితే ఇదే కొన్నిసార్లు జీవనాధారాన్ని కూడా తెంచుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో నిరుపేదల పాలిట ‘ఆధార్’ శాపంగా మారింది. ఆధార్‌తో తెల్లరేషన్ కార్డుల అనుసంధాన ప్రక్రియ పేదల్ని నాలుగు మెతుకులకు దూరం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఒకవైపు 50 వేల లబ్ధిదారుల యూనిట్లు రద్దు కాగా, మరోవైపు దాదాపు లక్ష కుటుంబాలకుపైగా నిత్యావసర సరుకుల పంపిణీ నిలిచిపోయింది. రేషన్‌కార్డుకు ‘ఆధార్’ను అనుసంధానిస్తూ ముందస్తు ప్రయోగానికి సిద్ధపడిన హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల పౌరసరఫరాల శాఖ ఈపీడీఎస్ విధానంతో తెల్లకార్డుదారుల ఏరివేత పనిలో పడినట్లు కనిపిస్తోంది.
ఒకవైపు ఆధార్ నంబర్లు సమర్పించని లబ్ధిదారులకు సరుకుల్ని ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేసి ఈ నెల లక్షకు పైగా కుటుంబాలకు మొండిచేయి చూపారు. మరోవైపు ఆధార్ సమర్పించిన వారి రేషన్‌కార్డుల్లోని లబ్ధిదారుల యూఐడీ నంబర్ ఆధారంగా ‘డబుల్’ యూనిట్లను రద్దు చేస్తున్నారు. దీనిని సాకుగా తీసుకున్న కొందరు రేషన్ డీలర్లు చేతి వాటం చూపుతూ అసలు యూనిట్లకు సైతం ఎసరు పెడుతున్నారు.
డబుల్ యూనిట్లంటే...
రేషన్‌కార్డులో ఒక లబ్ధిదారుడిని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. కాగా, ఒక కార్డులోని లబ్ధిదారుల్లో కొందరు పెళ్లి, వేరుపడటం వంటి కారణాలతో కొత్త కార్డులు పొందుతున్నారు. వీరి పేర్లు పాత కార్డుల్లోనూ కొనసాగుతున్నాయి. ఆధార్ అనుసంధానం ద్వారా ఈ ‘డబుల్ యూనిట్ల’ను అధికారులు గుర్తించి ఏరివేస్తున్నారు. ఇదే ఇప్పుడు పేదల పొట్టకొడుతోంది. ఒక రేషన్ కార్డులో గల కుటుంబసభ్యుల పేర్లలో ఎవరో ఒకరు మరో తెల్లరేషన్ కార్డులో లబ్ధిదారుడై ఉంటే ఆధార్ యూఐడీ నంబర్ అనుసంధానం వల్ల రెండు కార్డులకు చిక్కువస్తోంది.
ఈ ఏరివేతలో రెండుచోట్లా యూనిట్లు రద్దు కావడంతో లబోదిబోమంటున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలో 3 నెలలుగా రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం ఈపీడీఎస్ విధానం ద్వారా కొత్త సాఫ్ట్‌వేర్‌లో కొనసాగుతోంది. దీంతో ఒకే ఆధార్ నంబరు రెండు కార్డుల్లో అనుసంధానమైతే దాని ఆధారంగా రెండు కార్డుల్లోని యూనిట్లు రద్దవుతున్నాయి. ఫలితంగా వారికి డీలర్లు సరుకులు ఇవ్వట్లేదు. అసలు విషయం తెలియక పేదలు రేషన్ సరుకుల కోసం తంటాలు పడుతున్నారు.
ఆధార్ ఉంటేనే సరుకులు..
పౌరసరఫరా శాఖ ఈ నెల నుంచి సరుకుల పంపిణీ నమోదుకు ఆధార్ సీడింగ్‌తో పాటు ఆధార్ అన్ సీడింగ్ అనే రెండు కీ పుస్తకాలను డీలర్లకు అందించింది. దీని ఆధారంగా సరుకుల పంపిణీ జరుగుతోంది. వీటి ఆధారంగా- ఆధార్ అనుసంధానంతో రద్దయిన యూనిట్ల లబ్ధిదారులతో పాటు ఆధార్ నంబర్లు అనుసంధానం కాని వారికీ సరుకులు అందట్లేదు. ఒకవేళ కొత్తగా ఆధార్ కార్డు సమర్పిస్తే యూఐడీ నంబర్ నమోదు చేసి సంబంధిత లబ్ధిదారుడి యూనిట్లకు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. దీంతో ఆధార్ లేని వారు సర్కిల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఆధార్ తప్పనిసరి
తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులు ఆధార్ నంబర్ సమర్పించాల్సిందే. ప్రతి యూనిట్‌కు ఆధార్ అనుసంధానిస్తున్నాం. ఒకవేళ డబుల్ యూనిట్ బయటపడితే ఒకటి రద్దు చేస్తున్నాం. ఈపీడీఎస్‌లో ఆధార్ ఆనుసంధాన ప్రక్రియ కొనసాగుతుంది. లబ్ధిదారులు సహకరించాలి.
- డాక్టర్ పద్మ, సీఆర్‌వో, హైదరాబాద్
రేషన్ నిలిపివేశారు
ప్రతిసారీ ఆధార్ నెంబర్ అడుగుతున్నారు. అదిచ్చినా సరుకులు మాత్రం ఇవ్వట్లేదు. డీలర్లను అడిగినా సరిగా సమాధానం చెప్పటం లేదు.
- ఉమర్, మల్లేపల్లి
ఆధార్ ఇచ్చినా..
మాకు రేషన్ సరుకులు రావడం లేదు. అడిగితే డీలర్లు సమాధానం చెప్పటం లేదు. ఆధార్ కార్డు సమర్పించాం. అయినా సరుకులు మాత్రం ఇవ్వడం లేదు.
- బిల్‌కిస్ బేగం, గోల్కొండ
ఆన్‌లైనా.. ఆఫ్‌లైనా..
రేషన్ కార్డుకు ఆధార్ నంబర్ తప్పనిసరన్నారు.. ఇచ్చాం. అయినా రేషన్ సరుకులు మాత్రం రావట్లేదు. అధికారుల చుట్టూ తిరిగినా ఆన్‌లైన్‌లో చూడాలని తప్పించుకుంటున్నారు తప్ప సమస్య పరిష్కరించట్లేదు.
- నూర్జహా, గోల్కొండ ఖిల్లా