జన్మభూమిలో పంపిణీ చేసిన తెల్ల రేషన్ కార్డు ప్రాణం నిలుపలేకపోయింది.
► మృత్యువుతో పోరాడి ఓడిన మాబుబాషా
► ఆదుకోలేకపోయిన జన్మభూమి రేషన్ కార్డు
► ఆపరేషన్ ఆలస్యం కావడంతో ఇన్‌ఫెక్షన్
బండిఆత్మకూరు: జన్మభూమిలో పంపిణీ చేసిన తెల్ల రేషన్ కార్డు ప్రాణం నిలుపలేకపోయింది. ఒకప్పుడు ఎంతో మందికి ఊపిరి పోసిన ఈ కార్డు ఇప్పుడు ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న మాబుబాషా (32) మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. వివరాల్లోకి వెళితే.. చిన్నదేవళాపురం గ్రామానికి చెందిన మాబుబాషా, హుసేన్‌బీ దంపతులకు ఇద్దరు కుమారులు మస్తాన్, కరీముల్లా, కుమార్తె మోబినా సంతానం. వీరికి ప్రభుత్వం గత జనవరిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో రేషన్‌కార్డు(జేఏపీ 133301100064) మంజూరు చేసింది.
కూలీ పనులకు వెళ్తే కానీ కుటుంబం గడవని పరిస్థితి. నివాసం ఉంటున్న పూరి గుడిసె గత ఏడాది అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. వారం రోజుల క్రితం కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. క్యాన్సర్ లక్షణాలు ఉండటంతో కర్నూలు శివారులోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. పేగు క్యాన్సర్ ఉన్నట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు.
తెల్లరేషన్ కార్డుతో ఆపరేషన్ చేయించేందుకు అవకాశం ఉండటంతో ఆ నిరుపేద కుటుంబం కాస్త ఊరట చెందింది. అయితే రేషన్ కార్డు ఆన్‌లైన్‌తో అనుసంధానం కాకపోవడంతో ఆసుపత్రిలో ఆపరేషన్‌కు నిరాకరించారు. స్నేహితులు రూ.1.50 లక్షల వరకు సహాయం చేయడంతో ఎట్టకేలకు ఈనెల 18న ఆపరేషన్ పూర్తయింది. అయితే ఆపరేషన్ ఆలస్యం కావడంతో ఇన్‌ఫెక్షన్ సోకి గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.