థామస్‌ను మంచంపై మోసుకొస్తున్న కుటుంబసభ్యులు, (ఇన్‌సెట్‌లో) థామస్ (ఫైల్)
సాక్షి, చాగలమర్రి(కర్నూలు): గ్రామాన్ని చుట్టుముట్టిన వరదలు ఓ కుటుంబంలో కన్నీళ్లు మిగిల్చాయి. సకాలంలో ఆస్పత్రికి చేర్చే మార్గం లేక.. ఓ వ్యక్తి కన్నుమూశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. వివరాలు.. బ్రాహ్మణపల్లెలో నివాసముండే గాలిపోతు థామస్(65)కు ఆదివారం గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారమిచ్చారు. 108 అంబులెన్స్ కూడా వెంటనే బ్రాహ్మణపల్లెకు బయల్దేరింది. అయితే.. భారీ వర్షాలతో కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వక్కిలేరు వంక రోడ్డుపైకి పొంగి ప్రవహిస్తుండడంతో.. గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో అంబులెన్స్ నిలిచిపోవాల్సి వచ్చింది.
దీంతో థామస్‌ను కుటుంబ సభ్యులే గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు ట్రాక్టర్‌పై పంట పొలాల వెంబడి తీసుకెళ్లారు. ఆ తర్వాత ట్రాక్టర్ కూడా వెళ్లలేని పరిస్థితి ఎదురైంది. దీంతో మంచంపై మోసుకుంటూ సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో నిలిచి ఉన్న 108 అంబులెన్స్ వద్దకు అతికష్టమ్మీద చేరుకున్నారు.అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు అంబులెన్స్ సిబ్బంది నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వక్కిలేరుపై వంతెన నిర్మించాలని 40 ఏళ్లుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment