అనంతపురంలోని మూడో డివిజన్ పరిధిలో భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తెల్లరేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా ఇటీవల రెండు కార్డులు మంజూరయ్యాయి. అతను, అతని భార్యకు కలిపి ఒక కార్డు ఇచ్చారు. ఇద్దరు పిల్లలకు మాత్రమే మరో కార్డు జారీ చేశారు. రెండింటిలోనూ కుటుంబ పెద్ద భాస్కర్‌రెడ్డిని చూపించారు. ఉంటున్నది 3వ డివిజన్ అయితే 16వ డివిజన్ కమలానగర్‌లోని 51 నెంబరు రేషన్ షాపును నమోదు చేశారు. ఒక్క భాస్కర్‌రెడ్డి విషయంలో మాత్రమే జరిగిన తప్పదం కాదు.. జిల్లాలోని వేల సంఖ్యలోని కార్డుల్లో ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకున్నాయి.
అనంతపురం అర్బన్ : నాల్గో విడత జన్మభూమి సందర్భంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు జారీ చేసిన తెల్లకార్డుల్లో వివరాలు ఇష్టానుసారంగా నమోదయ్యాయి. కంప్యూటర్ ఆపరేటర్ల నిర్వాకంతో తప్పిదాలు చోటు చేసుకున్నాయి. ఒక కుటుంబాన్ని రెండుగా విభజించి వేర్వేరుగా రెండు కార్డులు జారీ అయ్యాయి. కొన్ని కార్డుల్లో కుటుంబ యజమానిని మాత్రమే చూపిస్తూ, మిగతా కుటుంబ సభ్యుల ఫొటోలను, పేర్లను చేర్చలేదు. కొన్ని కార్డుల్లో పేర్లు చేర్చారు తప్ప సభ్యుల ఫొటోలు ముద్రించలేదు. వేలాది కార్డుల్లో ఇలాంటి తప్పిదాలు దొర్లాయి.
99,954 కార్డుల మంజూరు
జన్మభూమి కార్యక్రమం సందర్భంగా జిల్లాకు 99,954 కార్డులను ప్రభుత్వం మంజూరు చేయగా జన్మభూమి గ్రామ సభల్లో 72,531 కార్డులను లబ్ధిదారులకు జారీ చేశారు. మిగతా కార్డులను తహసీల్దారు కార్యాలయాలకు లబ్ధిదారులు స్వయంగా వెళ్లి తీసుకున్నారు. జారీ అయిన కార్డుల్లో వివరాలు తప్పుగా నమోదయ్యాయి. దీంతో లబ్ధిదారులు చేర్పులు, మార్పుల కోసం తహసీల్దారు కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు.
కంప్యూటర్ ఆపరేటర్ల నిర్వాకం
కార్డుల్లో లబ్ధిదారుని వివరాల నమోదు విషయంలో కంప్యూటర్ ఆపరేటర్ల నిర్వాకం కనిపిస్తోంది. కార్డుకోసం దరఖాస్తు చేసుకునే సమయంలో తమ కుటుంబం గ్రూప్ ఫొటోను జతచేసి ఇచ్చారు. దీన్ని స్కాన్ చేసి కార్డులో పొందుపర్చకుండా ఇష్టానుసారంగా వివరాలు, ఫొటోలను నమోదు చేశారు. చాలా కార్డుల్లో కేవలం కుటుంబ యజమాని ఫొటో ఒక్కటే ముద్రించారు. కుటుంబ సభ్యల ఫొటోలు లేవు. కొన్ని కార్డుల్లో కుటుంబ సభ్యుల ఫొటోలు, పేర్లు కూడా నమోదు చేయలేదు. మరికొన్ని కార్డుల్లో ఆధార్‌లోని ఫొటోలను రేషన్ కార్డుల్లో ఉంచారు. ఇవి ఒక రకం తప్పదాలైతే...లబ్ధిదారుల నివాస ప్రాంతానికి సంబంధం లేని డివిజన్లలోని రేషన్ దుకాణం కేటాయించారు. చంద్రబాబు కొట్టాల్లో నివాసముంటున్న ఒకరికి పాపంపేట పంచాయతీలోని చౌక దుకాణం కేటాయించారు. తమకు కేటాయించిన చౌక దుకాణం ఎక్కడ వస్తుందో అంతుపట్టక లబ్ధిదారులు కాలనీలు పట్టుకుని తిరగాల్సి వస్తోంది. ఇలాంటి తప్పిదాలు కేవలం కంప్యూటర్ ఆపరేటర్ల నిర్లక్ష్యంగా కారణంగానే చోటు చేసుకున్నాయి.
కొరవడిన పర్యవేక్షణ
కార్డుల్లో లబ్ధిదారులు వివరాలు నమోదు ప్రక్రియ చేపట్టినప్పటి నుంచి అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కంప్యూటర్ ఆపరేటర్లు కార్డుల్లో వివరాలో ఏ విధంగా నమోదు చేస్తున్నారు. ఫొటోలను ఎలా ఉంచుతున్నారు. అనేవాటిని అధికారులు కనీసంగా కూడా పట్టించుకోలేదని తెలిసింది. దరఖాస్తులను కంప్యూటర్ ఆపరేటర్లకు అందజేసి వివరాలను నమోదు చేయాలని చెప్పి వదిలేశారు. దీంతో కంప్యూటర్ ఆపరేటర్లు ఇష్టానుసారంగా వివరాలను నమోదు చేశారు.
త్వరలో మార్పులు, చేర్పులు
రేషన్ కార్డుల్లో చోటు చేసుకున్న తప్పిదాలను సరిచేసేందుకు ఒక నెల రోజుల్లో ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుంది. కుటుంబ సభ్యుల చేర్పులు, ఫొటో అప్‌లోడ్ ప్రక్రియను మీ సేవ ద్వారా చేస్తారు. చేర్పులకు, మార్పులకు ప్రభుత్వం అనుమతించిన వెంటనే ప్రకటిస్తాం. అప్పుడు లబ్ధిదారులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. – శివశంకర్‌రెడ్డి, ఇన్‌చార్జ్ డీఎస్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment