సాక్షి, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థలో సబ్సిడీ బియ్యం పొందడానికి మరింత మెరుగైన విధానం అమల్లోకి రానుంది. డిసెంబర్ నుంచి బియ్యం కార్డులున్నవారికి మాత్రమే సబ్సిడీపై సరుకులు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కొందరు తీసుకోవడం లేదు. తీసుకున్న మరికొందరు పక్కదారి పట్టిస్తున్నారు. బియ్యం నాణ్యత తక్కువగా ఉండడంతో తినలేక అమ్ముకుంటున్న పరిస్థితి ఇక ఉండకూడదనే ఉద్దేశంతో జనవరి నుంచి నాణ్యమైన బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తెల్ల రేషన్ కార్డుల స్థానంలో ప్రభుత్వం బియ్యం కార్డులు తీసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం తెల్ల కార్డులు, బియ్యం కార్డులు కలిపి 1.52 కోట్లకుపైగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎనిమిది లక్షలకు పైగా తెల్ల కార్డులు అనర్హుల చేతుల్లో ఉన్నట్లు గ్రామ, వార్డు వలంటీర్ల తనిఖీలో వెల్లడైంది. వలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి అర్హతల పత్రాన్ని వారికి అందించి, వారి నుంచి వివరాలు తీసుకున్నారు. అనర్హతకు సంబంధించి ఆయా కుటుంబాలు అంగీకారం కూడా తెలిపాయి.
ఈమేరకు సిద్ధం చేసిన అర్హులు, అనర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి సోషల్ ఆడిట్ జరిపారు. ఒకవేళ అర్హత ఉండి జాబితాలో పేరు లేకపోయినా ఎవరికి దరఖాస్తు చేయాలన్న వివరాలు కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. సచివాలయాల్లో ప్రదర్శించిన జాబితాలపై దాదాపు రెండులక్షల మంది నుంచి అభ్యంతరాలు, విజ్ఞాపనలు వచ్చాయి. వాటిని పరిశీలించి అర్హత ఉన్న వారికి బియ్యం కార్డులు మంజూరు చేశారు. బియ్యం కార్డుకు అర్హత ఉన్నప్పటికీ తెల్ల కార్డులున్న మరో ఆరులక్షల కుటుంబాలకు సంబంధించి చిరునామాలు ఇప్పటికీ లభించలేదు. (చదవండి: 1.52 కోట్లు దాటిన బియ్యం కార్డులు)
బియ్యం కార్డుతో ఇతర పథకాలకు సంబంధం లేదు...
బియ్యం కార్డులతో పెన్షన్లు, ఆరోగ్యశ్రీ పథకం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలకు ముడిపెట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని జనవరి నుంచి ఇంటింటికీ పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే బియ్యం కార్డు పొందేందుకు ప్రస్తుతం అర్హతలను సడలించి మరింతమందికి ప్రయోజనం కలిగించేలా చర్యలు తీసుకున్నారు. ఇన్ని బియ్యం కార్డుల సంఖ్యకు పరిమితి విధించలేదు. అర్హులందరికీ కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు అధికారులకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బియ్యం కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ప్రస్తుతం తెల్ల కార్డులు, బియ్యం కార్డులు కలిపి 1,52,70,217 ఉన్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డులు, బియ్యం కార్డుల మొత్తం జిల్లాల వారీగా..
---------------------------------------------------------
జిల్లా రేషన్ కార్డులు
---------------------------------------------------------
తూర్పు గోదావరి 17,03,597
గుంటూరు 15,47,127
కృష్ణా 13,47,292
విశాఖపట్నం 13,20,321
పశ్చిమ గోదావరి 12,93,075
అనంతపురం 12,73,601
కర్నూలు 12,43,324
చిత్తూరు 11,88,779
ప్రకాశం 10,25,455
నెల్లూరు 9,33,193
శ్రీకాకుళం 8,41,047
వైఎస్సార్ కడప 8,37,057
విజయనగరం 7,16,349
---------------------------------------------------------
మొత్తం 1,52,70,217
---------------------------------------------------------
అర్హులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం
డిసెంబర్ కోటా నుంచి బియ్యం కార్డులున్న వారికే సబ్సిడీ సరుకులు పంపిణీ చేస్తాం. గతంలో తెల్ల రేషన్ కార్డులు తీసుకున్న వారిలో చాలామంది అనర్హులున్నారు. కరోనా కారణంగా ఉపాధి పనులు దొరకడం లేదనే ఉద్దేశంతో అందరికీ ఉచితంగా సరుకులు పంపిణీ చేశాం. అర్హత ఉండి బియ్యం కార్డు లేనివారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.- కోన శశిధర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి, పౌరసరఫరాలశాఖ
Comments
Please login to add a commentAdd a comment