Quality Rice
-
ఇంటింటికీ 'ఆనందం'
సాక్షి, అమరావతి: ‘ఇంటింటికీ రేషన్’ పంపిణీ విధానం అమల్లోకి రావడంతో పేదలకు శ్రమ తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం గత నెల నుంచి నాణ్యమైన బియ్యాన్ని అందిస్తుండటంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలు వెచ్చించి బియ్యాన్ని కొనుక్కోవాల్సిన అవసరం తప్పింది. దీనివల్ల కుటుంబ ఖర్చులు ఎంతో ఆదా అవుతున్నాయని లబ్ధిదారులు ఆనందంగా చెబుతున్నారు. నిత్యావసర సరుకుల కోసం గతంలో రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సర్వర్ సక్రమంగా పని చేయకపోయినా.. ఏదైనా సమస్య తలెత్తినా గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఒక్కోసారి పనులకు వెళ్లకుండా రెండు, మూడు రోజులపాటు రేషన్ షాపులకు వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. రోజూ కూలి పనులకు వెళితే గాని కడుపు నిండని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారంతా రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చినప్పుడు ఆదాయం కోల్పోయేవారు. అలాంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కించే సంకల్పంతో మొబైల్ వాహనాల పేదల ఇంటికే వెళ్లి రేషన్ సరుకుల్ని పంపించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. తప్పిన ఇబ్బందులు ఇంటింటికీ రేషన్ విధానం అమలు చేయడం వల్ల లబ్ధిదారులకు సరుకులు అందేవరకు మొబైల్ వాహనం అక్కడి నుంచి వెళ్లే అవకాశం లేదు. రేషన్ వాహనం ఎప్పుడు వస్తుందనే సమాచారం కూడా ముందుగానే ఇస్తుండటం వల్ల ఎంతో ప్రయోజనం కల్గుతోంది. గతంలో పంపిణీ చేసిన బియ్యంలో రాళ్లు, నూకలు ఎక్కువగా ఉండేవి. ఆ బియ్యం ముక్కిపోయిన వాసన రావడంతో చాలామంది వండుకుని తినేందుకు ఉపయోగించేవారు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో కిలో రూ.45 చొప్పున మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం రాళ్లు, నూకలు, ముక్కిపోయినవి కాకుండా ప్రభుత్వం నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తుండటంతో పేదలు వాటినే వండుకుని తింటున్నారు. దీంతో ప్రతి నెలా బియ్యం కోసం ఖర్చు చేసే మొత్తం కూడా తగ్గిపోయింది. ముఖ్యంగా ఉపాధి నిమిత్తం గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చిన లబి్ధదారులు నాణ్యమైన బియ్యం పంపిణీని వరంగా భావిస్తున్నారు. పట్టణాల్లో రోజుకు రెండు లక్షల కుటుంబాలకు.. పట్టణాల్లో మార్చి నెల కోటా సరుకులు ఈ నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నారు. మొబైల్ వాహనాల ద్వారా రోజుకు 2 లక్షల కుటుంబాలకు సరుకులు అందుతున్నాయి. మూడు రోజుల్లో దాదాపు 6 లక్షల కుటుంబాలకు 95.24 లక్షల కిలోల బియ్యం అందాయి. గురువారం నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఖర్చు బాగా తగ్గింది ప్రభుత్వం నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడంతో మా కుటుంబానికి బియ్యం ఖర్చు బాగా తగ్గింది. గతంలో ఇచ్చే బియ్యం నాసిరకంగా ఉండటంతో బయట మార్కెట్లో కొనేవాళ్లం. ఇప్పుడ ఆ బాధ తప్పిపోయింది. ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్నే వండుకుని తింటున్నాం. – ఎస్.షేక్ షావలి, ఇందిరా నగర్, కర్నూలు బిర్యానీకీ రేషన్ బియ్యాన్నే వాడుతున్నాం బిర్యానీ చేసినప్పుడు కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నాణ్యమైన బియ్యాన్నే వాడుతున్నాం. గతంలో రేషన్ బియ్యం వండుకునే వీలులేక తప్పని పరిస్థితుల్లో విక్రయించేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. – బచ్చు దాలమ్మ, ముడియా వీధి, ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా క్యూలో నిలబడే బాధ తప్పింది గతంలో మూడు వీధులు దాటుకుని వెళ్లి రేషన్ షాపు వద్ద గంటల కొద్దీ క్యూలో నిలబడే వాళ్లం. ఇప్పుడు ఏమాత్రం శ్రమ పడకుండానే సరుకులు ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. – నేరెడుమిల్లి జయలక్ష్మి, జగన్నాథపురం, కాకినాడ పిలిచి మరీ ఇస్తున్నారు ఇంటి గుమ్మం వద్దకే వచ్చి అక్కా.. రేషన్ సరుకులు వచ్చాయని మరీ చెప్పి ఇస్తున్నారు. రేషన్ షాపు వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకునే బాధ తప్పింది. నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. – ఎన్.సువేద, కల్లూరు, కర్నూలు -
కదిలిన సంక్షేమ రథ చక్రాలు
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో : ప్రజా పంపిణీ వ్యవçస్థలో కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ.. పేదల గడప వద్దకే వెళ్లి సరుకులు చేరవేసేలా నూతన ఒరవడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాంది పలికారు. రేషన్ సరుకుల కోసం రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు రేషన్ షాపుల వద్ద గంటల తరబడి వేచి చూడకుండా వచ్చే నెల నుండి వారి ఇంటికే చేరనున్నాయి. ఇందులో భాగంగా విజయవాడ బెంజిసర్కిల్‌లో గురువారం ఉదయం 10.45 గంటలకు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,503 వాహనాలకు సీఎం వైఎస్ జగన్ జెండా ఊపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 9,260 జగన్నాథ రథాల చక్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి ముందుకు కదిలాయి. ప్రతి నెలా నాణ్యమైన బియ్యం తీసుకునేందుకు వీలుగా, తిరిగి వినియోగించుకునేలా ఒకసారి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనున్న నార సంచులను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. వాహనదారులందరికీ సీఎం నమస్కరిస్తూ.. విజయవాడలో జెండా ఊపి ప్రారంభించిన 2,503 వాహనదారులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులు జోడించి నమస్కరిస్తూ అభినందనలు తెలిపారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆయన వేదికపై ఉండి కుయ్.. కుయ్.. మంటూ హారన్ వినిపిస్తూ ముందుకెళ్లిన తొలి వాహనం నుండి చివరి వాహనం వరకు సీఎం నమస్కరించడం అందరినీ ఆకట్టుకుంది. వాహనదారులు రెట్టింపు ఉత్సాహంతో ఈ సన్నివేశాన్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ ముందుకు కదలడం కన్పించింది. నాణ్యమైన బియ్యం పంపిణీతో ఏటా రూ.830 కోట్ల అదనపు భారం నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా రూ.830 కోట్లు అదనపు భారం పడనుంది. అదేవిధంగా ఇంటింటా సరుకుల పంపిణీకి కొనుగోలు చేసిన 9,260 వాహనాలకు రూ.539 కోట్లు ఖర్చు చేసి పేద వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించినట్లైంది. ఈ వాహనాలను నిరుద్యోగులకు ప్రభుత్వం 60 శాతం సబ్సిడీతో ఇవ్వడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. వాహనదారులకు ప్రతి నెలా 18 రోజుల పని దినాలు కల్పిస్తూ ఆరేళ్ల పాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాహనాల కేటాయింపులో పారదర్శకత వాహనాల కేటాయింపులో ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించింది. ఇందులో భాగంగా వర్గాల వారీగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,300, ఎస్టీ కార్పొరేషన్ నుండి 700, బీసీ కార్పొరేషన్ ద్వారా 3,800, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 660, ఈబీ (ఎకనామికల్లీ బ్యాక్వార్డ్) కార్పొరేషన్ ద్వారా 1,800 మందికి వాహనాలను అందజేశారు. యూనిట్ ధర రూ.5,81,000 కాగా అందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.3,48,600 అందించింది. బ్యాంకు లింకేజి ద్వారా రూ.1,74,357 మంజూరు చేయగా, లబ్ధిదారుని వాటాగా కేవలం రూ.58 వేలు చెల్లించాల్సి ఉంది. బ్యాంకు లింకేజీ రుణం చెల్లించేందుకు సౌలభ్యం కల్పించేలా పౌర సరఫరాల శాఖ ప్రతి నెలా అద్దె చెల్లించే విధానంలో ఈ వాహనాలను సమకూర్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి వెంకటేశ్వరరావు, పేర్ని వెంకట్రామయ్య, వెలంపల్లి శ్రీనివాసరావు, చెరుకూరి శ్రీరంగనాథరాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పలువులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో నవ శకం జిల్లాల్లో వాహనాలు ప్రారంభించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు సాక్షి నెట్వర్క్: ప్రజా పంపిణీ వ్యవçస్థలో నవ శకం దిశగా అడుగులు పడ్డాయి. పేదల గడప వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందించే మినీ ట్రక్కులను గురువారం విజయవాడలో సీఎం వైఎస్ జగన్, వివిధ జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం వందలాది మినీ ట్రక్కులు ఆయా జిల్లా కేంద్రాల్లో ఒక్కసారిగా రోడ్లపై వరుసగా పరుగు పెట్టడం కనువిందు చేసింది. బారులు తీరిన వాహనాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. పలువురు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ట్రక్కుల మంజూరు ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుంది. జగనన్నకు కోటి వందనాలు నాకు భర్త, ఇద్దరు పిల్లలు. అత్తమామలతో కలసి ఉంటున్నాము. నా భర్త ఆటో నడుపుతుంటాడు. నాకు కూడా ఆటో నడపడం నేర్పించాడు. ఆ తర్వాత నేను కారు నడపడం కూడా నేర్చుకున్నాను. నా భర్త పోడు వ్యవసాయానికి వెళ్లినప్పుడు నేను ఉదయమే ఇంటి పనులు ముగించుకుని ఆటో నడిపేందుకు వెళుతుంటాను. ఇప్పుడు నాకు ఉచిత రేషన్ సరుకుల వాహనం మంజూరైంది. శ్రీకాకుళంలో ఇవాళ ఈ వాహనాన్ని నడుపుకుంటూ వెళుతుండటం ఆనందంగా ఉంది. బతుకుపై మరింత భరోసా కలిగింది. ఇందుకు కారణమైన సీఎం జగనన్నకు కోటి వందనాలు. – సవర సుహాసిని, ఎస్.బాణాపురం, మెలియాపుట్టి మండలం, శ్రీకాకుళం జిల్లా రేషన్ పంపిణీ వాహనంలో తూకాన్ని పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ రేషన్ çసరుకుల పంపిణీ వాహనాల తాళాన్ని డ్రైవర్లకు అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఉచితంగా ఇవ్వనున్న నార సంచులను ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు తదితరులు. -
సన్నబియ్యం ధరలకు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సన్నరకం బియ్యం ధరలు పెరుగుతున్నాయి. డిమాండ్‌కు తగ్గట్లుగా సన్నరకం బియ్యం లభ్యత లేకపోవడంతో ధరలు పైకి ఎగబాకుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో మేలురకం సన్నాల ధరలు క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.500 వరకు పెరిగాయి. రాష్ట్రంలో సన్నాల సాగు అధికంగా జరిగినా.. వానాకాలంలో కురిసిన కుండపోత వర్షాలతో దిగుబడి తగ్గడం, పొరుగు రాష్ట్రాలకు భారీగా ధాన్యం తరలి వెళ్లిపోవడంతో ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. సన్నాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, సెప్టెంబర్ తర్వాత కానీ మళ్లీ ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. రైతులు అమ్ముకున్నాక పెరిగిన ధరలు.. రాష్ట్రంలో గత వానాకాలంలో 53 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగ్గా, 39.66 లక్షల ఎకరాల్లో సన్నరకం సాగు చేశారు. దీనికి అనుగుణంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల మేర సన్నరకం ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసినా లెక్క తప్పింది. ఆగస్టు నుంచి మూడు నెలల పాటు భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో సన్నరకం ధాన్యం పంట భారీగా దెబ్బతిన్నది. దీంతో ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 10 నుంచి 15 క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో అనుకున్నంత మేర సన్నధాన్యం మార్కెట్లకు రాలేదు. దీనికి తోడు ధాన్యం తడవడం. తాలు ఎక్కువగా ఉండటంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేకరణ సరిగ్గా జరగకపోవడంతో రైతులు క్వింటాలు ధాన్యాన్ని మద్దతు ధరకన్నా తక్కువకు రూ.1,500–1,600కే అమ్మేసుకున్నారు. ప్రభుత్వం కేవలం 19.55 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని మాత్రమే సేకరించగలిగింది. మద్దతు ధర రాకపోవడంతో కొన్ని చోట్ల రైతులే ధాన్యాన్ని మిల్లుకు పట్టించి క్వింటాల్ బియ్యాన్ని రకాన్ని బట్టి రూ.3,200–4,000 వరకు అమ్ముకున్నారు. డిసెంబర్ నెల వరకు సైతం మేలురకాలైన బీపీటీకీ బహిరంగ మార్కెట్లో రూ.3,150 ఉండగా రైతులు ధాన్యం మొత్తం అమ్మేసుకున్నాక ప్రస్తుతం రూ.3,500కు చేరింది. హెచ్ఎంటీ బియ్యానికి రూ.3,300 నుంచి రూ.3,700, జైశ్రీరామ్ రూ.3,850 నుంచి రూ.4,100, తెలంగాణ సోనా రూ.3,450 నుంచి రూ.3,800 వరకు ధర పెరిగింది. పాత బియ్యమైతే అన్నింటిలోనూ సరాసరిగా క్వింటాలుకు 400 వరకు అధిక ధర ఉంది. పాతబియ్యం జైశ్రీరామ్, 1008 రకాలైతే ఖమ్మం, వరంగల్ వంటి జిల్లాల్లో క్వింటాలుకు ఏకంగా రూ.5,000–5,200 వరకు ధర పలుకుతోంది. పౌరసరఫరాల శాఖ అధికారిక లెక్కల ప్రకారమే మేలురకం బియ్యం క్వింటాల్‌కు సరాసరి రేటు రూ.4,800 వరకు ఉండగా, కొద్దిగా తక్కువ రకం సన్నాల ధర రూ.4,200 వరకు ఉంది. గత ఏడాది ధరలతో పోల్చినా, కనీసంగా క్వింటాల్‌పై రూ.300 మేర పెరిగినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. పొరుగు నుంచి ఎసరు.. రాష్ట్రంలో వర్షాలతో తగ్గిన దిగుబడులకు తోడు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడి నుంచి సన్నరకం ధాన్యం కొనుగోళ్లకు మొగ్గు చూపడం సైతం బియ్యం ధరల పెరుగుదలకు కారణమవుతోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో సన్నరకం పంటల సాగు ఎక్కువగా లేకపోవడం, దిగుబడి పూర్తిగా దెబ్బతినడంతో వారంతా తెలంగాణ నుంచే సన్నరకం ధాన్యాన్ని సేకరించారు. అనధికారిక లెక్కల ప్రకారం పొరుగు రాష్ట్రాలకు 20 లక్షల మెట్రిక్ టన్నుల మేర సన్నధాన్యం తరలిందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యం కన్నా ఇది లక్ష మెట్రిక్ టన్నుల మేర అధికం. దీంతో రాష్ట్రంలో సన్నాలకు కొరత ఏర్పడి బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ధరలు సెప్టెంబర్ వరకు క్రమంగా పెరిగే అవకాశాలే ఎక్కువని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. యాసంగి పంట బయటకి వస్తేనే ఈ ధరలు తగ్గుతాయని అంటున్నాయి. దీనికి తోడు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు సైతం బియ్యం ధరల పెరుగుదలకు పరోక్షంగా కారణమవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రవాణా చార్జీలు పెరుగుతుండటంతో బియ్యం ధరలు కూడా పెరుగుతున్నాయని అంటున్నారు. -
బియ్యం కార్డులకే సరుకులు
సాక్షి, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థలో సబ్సిడీ బియ్యం పొందడానికి మరింత మెరుగైన విధానం అమల్లోకి రానుంది. డిసెంబర్ నుంచి బియ్యం కార్డులున్నవారికి మాత్రమే సబ్సిడీపై సరుకులు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కొందరు తీసుకోవడం లేదు. తీసుకున్న మరికొందరు పక్కదారి పట్టిస్తున్నారు. బియ్యం నాణ్యత తక్కువగా ఉండడంతో తినలేక అమ్ముకుంటున్న పరిస్థితి ఇక ఉండకూడదనే ఉద్దేశంతో జనవరి నుంచి నాణ్యమైన బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తెల్ల రేషన్ కార్డుల స్థానంలో ప్రభుత్వం బియ్యం కార్డులు తీసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం తెల్ల కార్డులు, బియ్యం కార్డులు కలిపి 1.52 కోట్లకుపైగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎనిమిది లక్షలకు పైగా తెల్ల కార్డులు అనర్హుల చేతుల్లో ఉన్నట్లు గ్రామ, వార్డు వలంటీర్ల తనిఖీలో వెల్లడైంది. వలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి అర్హతల పత్రాన్ని వారికి అందించి, వారి నుంచి వివరాలు తీసుకున్నారు. అనర్హతకు సంబంధించి ఆయా కుటుంబాలు అంగీకారం కూడా తెలిపాయి. ఈమేరకు సిద్ధం చేసిన అర్హులు, అనర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి సోషల్ ఆడిట్ జరిపారు. ఒకవేళ అర్హత ఉండి జాబితాలో పేరు లేకపోయినా ఎవరికి దరఖాస్తు చేయాలన్న వివరాలు కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. సచివాలయాల్లో ప్రదర్శించిన జాబితాలపై దాదాపు రెండులక్షల మంది నుంచి అభ్యంతరాలు, విజ్ఞాపనలు వచ్చాయి. వాటిని పరిశీలించి అర్హత ఉన్న వారికి బియ్యం కార్డులు మంజూరు చేశారు. బియ్యం కార్డుకు అర్హత ఉన్నప్పటికీ తెల్ల కార్డులున్న మరో ఆరులక్షల కుటుంబాలకు సంబంధించి చిరునామాలు ఇప్పటికీ లభించలేదు. (చదవండి: 1.52 కోట్లు దాటిన బియ్యం కార్డులు) బియ్యం కార్డుతో ఇతర పథకాలకు సంబంధం లేదు... బియ్యం కార్డులతో పెన్షన్లు, ఆరోగ్యశ్రీ పథకం, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలకు ముడిపెట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని జనవరి నుంచి ఇంటింటికీ పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే బియ్యం కార్డు పొందేందుకు ప్రస్తుతం అర్హతలను సడలించి మరింతమందికి ప్రయోజనం కలిగించేలా చర్యలు తీసుకున్నారు. ఇన్ని బియ్యం కార్డుల సంఖ్యకు పరిమితి విధించలేదు. అర్హులందరికీ కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుమార్లు అధికారులకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బియ్యం కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ప్రస్తుతం తెల్ల కార్డులు, బియ్యం కార్డులు కలిపి 1,52,70,217 ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డులు, బియ్యం కార్డుల మొత్తం జిల్లాల వారీగా.. --------------------------------------------------------- జిల్లా రేషన్ కార్డులు --------------------------------------------------------- తూర్పు గోదావరి 17,03,597 గుంటూరు 15,47,127 కృష్ణా 13,47,292 విశాఖపట్నం 13,20,321 పశ్చిమ గోదావరి 12,93,075 అనంతపురం 12,73,601 కర్నూలు 12,43,324 చిత్తూరు 11,88,779 ప్రకాశం 10,25,455 నెల్లూరు 9,33,193 శ్రీకాకుళం 8,41,047 వైఎస్సార్ కడప 8,37,057 విజయనగరం 7,16,349 --------------------------------------------------------- మొత్తం 1,52,70,217 --------------------------------------------------------- అర్హులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం డిసెంబర్ కోటా నుంచి బియ్యం కార్డులున్న వారికే సబ్సిడీ సరుకులు పంపిణీ చేస్తాం. గతంలో తెల్ల రేషన్ కార్డులు తీసుకున్న వారిలో చాలామంది అనర్హులున్నారు. కరోనా కారణంగా ఉపాధి పనులు దొరకడం లేదనే ఉద్దేశంతో అందరికీ ఉచితంగా సరుకులు పంపిణీ చేశాం. అర్హత ఉండి బియ్యం కార్డు లేనివారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.- కోన శశిధర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి, పౌరసరఫరాలశాఖ -
జనవరి 1 నుంచి ఇళ్ల వద్దకే నాణ్యమైన బియ్యం
సాక్షి, అమరావతి: పేదలకు జనవరి 1 నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇళ్ల వద్దే నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం పౌరసరఫరాల సంస్థ 9,260 మొబైల్ వాహనాలు (మినీ ట్రక్కులు) కొనుగోలు చేసేందుకు టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఈ నెలాఖరులోగా వాహనాలు సిద్ధం కానున్నాయి. ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నా.. అధికారంలోకి వస్తే పేదలకు నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తామని వైఎస్ జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. దీనివల్ల ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడుతున్నా ఇచ్చిన హామీ అమలుకు సీఎం గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కొంతమంది లబ్ధిదారులు దళారులకు విక్రయిస్తున్నారు. వీరు ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తిరిగి మార్కెట్లోకి తెస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం లబ్ధిదారుల ఇళ్లకే నాణ్యమైన బియ్యం పంపిణీ చేయనుంది. ఏజెన్సీ ప్రాంతాలకు ఎంతో లబ్ధి ప్రతి ఇంటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. సరుకుల కోసం రేషన్ షాపుల వరకు వెళ్లకుండా లబ్ధిదారులు తమ ఇళ్ల వద్దే తీసుకుంటున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, కొండ గుట్టల్లో నివాసం ఉంటున్న వారికి ఎంతో ప్రయోజనం కలుగుతోంది. గతంలో వీరు సరైన రవాణా సౌకర్యం లేక సబ్సిడీ బియ్యం తీసుకోలేకపోయేవారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ బియ్యం పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన బియ్యం పేదలకు వరం నాణ్యమైన బియ్యం పేదల ఇంటికే డోర్ డెలివరీ చేయడం వారికి ఒక వరం. ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నా పేదల ఇబ్బందుల దృష్ట్యా సరుకుల పంపిణీ కోసం 9,260 మొబైల్ వాహనాలను కొనుగోలు చేస్తున్నాం. జనవరి 1 నుంచి ప్రతి బియ్యం కార్డుదారుడికి ఇంటి వద్దే సరుకులు పంపిణీ చేస్తాం. ప్రతినెలా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యమైన బియ్యం అవసరమవుతాయని అంచనా వేశాం. – కోన శశిధర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ జిల్లాల వారీగా మొబైల్ వాహనాలు ఇలా.. జిల్లా మొబైల్ వాహనాలు శ్రీకాకుళం 526 విజయనగరం 456 విశాఖపట్నం 766 తూర్పుగోదావరి 1,040 పశ్చిమ గోదావరి 795 కృష్ణా 805 గుంటూరు 920 ప్రకాశం 634 నెల్లూరు 566 వైఎస్సార్ 515 కర్నూలు 754 అనంతపురం 761 చిత్తూరు 722 మొత్తం 9,260 -
డిసెంబరు 1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ
సాక్షి, అమరావతి: నాణ్యమైన బియ్యం పంపిణీపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రైస్ కార్డు ఉన్న పేదలకు నాణ్యమైన సోర్టెక్స్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను 9,260 ప్రత్యేక వాహనాల ద్వారా బియ్యాన్ని ఇంటింటికీ డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. బియ్యం సరఫరాకు గాను ప్రభుత్వం రీయూజబుల్ సంచులను పంపిణీ చేయనుంది. -
పేదలందరికీ నాణ్యమైన బియ్యం
సాక్షి, అమరావతి: వివిధ సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో బియ్యం కేటాయిస్తోంది. 1982–83లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ప్రభుత్వం 2.55 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే కేటాయించగా ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి ఈ ఏడాది 28.50 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించింది. రాష్ట్రంలో ఎవరూ ఆకలి, పోషకాహార లోపంతో బాధపడకూడదనే ఉద్దేశంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ బియ్యం కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. గతంలో కార్డు కావాలంటే పేదలు ఎంతో ఇబ్బందులకు గురయ్యేవారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికింది. బియ్యం కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే అర్హతలు ఉంటే గ్రామ వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ ఇస్తున్నారు. ► రాష్ట్రంలో 1.49 కోట్ల కుటుంబాలకు పైగా బియ్యం కార్డులు ఉన్నాయి. ► కార్డుదారులతోపాటు మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ వసతి గృహాలు, ఇతర పాఠశాలల్లో చదివే విద్యార్థుల భోజనం కోసం ప్రభుత్వం బియ్యం కేటాయిస్తోంది. ► దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా అక్టోబర్ నుంచి లబ్ధిదారుల ఇళ్లకే నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద గతేడాది సెప్టెంబర్ నుంచి శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తోంది. ► ఈ ఏడాది రాష్ట్రం అంతటా నాణ్యమైన బియ్యాన్ని ఇళ్లకే పంపిణీ చేయడం వల్ల ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో వారికి కష్టాలు పూర్తిగా తప్పనున్నాయి. ► నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా దాదాపు రూ.1,500 కోట్లు భారం పడుతుందని అంచనా. ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. -
అక్టోబర్ 2 నుంచి నాణ్యమైన బియ్యం
గుడివాడ: అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి నాడు నాణ్యమైన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. ► రేషన్ బియ్యాన్ని గతంలో ప్యాకింగ్‌చేసి అందించాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే ప్యాకింగ్‌కి అయ్యే ఖర్చు, పర్యావరణ సమస్య వంటి కారణాలతో ఆ విధానాన్ని విరమించుకున్నాం. ► ప్యాకింగ్ కోసం ఏడాదికి రూ.400 కోట్లు ఖర్చవుతుంది. ఆ ఖర్చును తగ్గించి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చేలా ఉండాలనే ఆ నిర్ణయాన్ని మార్పుచేశాం. దీనికి తోడు ప్లాస్టిక్ బ్యాగుల వాడకం వల్ల పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశమూ ఉంది. ► బియ్యం పంపిణీకి తయారు చేయించిన ట్రాలీల నమూనాలను ఇటీవల పరిశీలించి కాకినాడ జేఎన్టీయూకి పంపాం. అక్కడ పరిశీలించాక ఇంకా ఏమైనా మార్పులు అవసరమో కాదో తుది నిర్ణయం తీసుకుంటాం. ► రాష్ట్రవ్యాప్తంగా 13 వేల ట్రాలీలు అవసరమవుతాయి. సరఫరా చేసేందుకు ఇప్పటికే రెండు కంపెనీలు ముందుకొచ్చాయి. -
నాణ్యమైన బియ్యమే ఇస్తాం
పేదలకు నాణ్యమైన బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించాం. ఈ బియ్యాన్ని పేదలు అమ్ముకోకుండా తినగలిగేలా ఇస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలోనే కాకుండా రాష్ట్రమంతటా ఎందుకు అమలు చేయడం లేదని టీడీపీ వాళ్లే అడుగుతున్నారు. దీన్నిబట్టి అక్కడ నాణ్యమైన బియ్యం ఇస్తున్నామని వారు కూడా ఒప్పుకుంటున్నట్లే కదా! ఏప్రిల్ నుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంతటా విస్తరింప చేసేందుకు అన్ని రకాలుగా సన్నద్ధమవుతున్నాం. –సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్ర మంతటా పేదలకు నాణ్యమైన స్వర్ణ తరహా బియ్యాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శాసనసభలో తెలిపారు. తమ మేనిఫెస్టోలో లేని ఈ పథకం కోసం అదనంగా రూ.1,400 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. సన్నబియ్యం ఇస్తామని చెప్పి మాట మార్చారంటూ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై సీఎం సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. ఇదీ మా చిత్తశుద్ధి.. ‘అధ్యక్షా.. ఇదీ మా మేనిఫెస్టో. పాదయాత్రలో ప్రజల దగ్గర నుంచి రకరకాల సూచనలు తీసుకున్నాం. ఎన్నికలకు వెళ్లే ముందు దీన్ని విడుదల చేశాం. టీడీపీ వాళ్లకు మేనిఫెస్టో మీద గౌరవం లేదు. దాన్ని చెత్తబుట్టలో వేశారు. ప్రజలు కొడతారని ఆన్లైన్ నుంచి కూడా తీసేసిన చరిత్ర వాళ్లది. కానీ మా మేనిఫెస్టో మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత. ఇందులో ప్రతిదీ చేస్తామని చెప్పి ఓట్లడిగాం. ఈ రకమైన బియ్యం ఇస్తామని మేనిఫెస్టోలో ఎక్కడా పెట్టలేదు. కావాలంటే అద్దాలు సరిచేసుకుని చూసుకోండి. అసలు మేనిఫెస్టోలో చెప్పని కార్యక్రమాన్ని చేసి చూపించాలని, ప్రజలకు మంచి చెయ్యాలనే తపన, తాపత్రయంతో ఉన్నామనేది ముందుగా అర్థం చేసుకోవాలి. గర్వంగా చెబుతున్నాం చంద్రబాబు హయాంలో పంపిణీ చేసిన బియ్యాన్ని ప్రజలు తినలేక అమ్ముకున్నారు. ప్రజలు రూపాయికి తీసుకున్న బియ్యాన్ని డీలర్ రూ.7కు కొనుగోలు చేస్తే, వీరి నుంచి రైస్ మిల్లర్లు ఇంకో రెండు రూపాయలు ఎక్కువకు కొనుగోలు చేసి.. అదే బియ్యాన్ని రీ పాలిష్ చేసి వాటిని తిరిగి ప్రజా పంపిణీ వ్యవస్థలోకి తీసుకొచ్చిన పరిస్థితి. ప్రజలు ఏమాత్రం తినలేని బియ్యం ఇచ్చే ఈ పథకాన్ని పూర్తిగా మార్పు చేసి, నాణ్యమైన బియ్యాన్ని అందించాలనుకుంటున్నాం. పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో మేం ప్యాకెట్లు కట్టి.. సార్టెక్స్ చేసి ఇస్తున్నాం. ఈ బియ్యాన్ని, గతంలో చంద్రబాబు హయాంలో ఇచ్చిన బియ్యం నాణ్యతను పోల్చి చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆనందంగా తింటున్నారని ఈ సభలో గర్వంగా చెబుతున్నాను. ఆరు నెలలు పైలెట్ ప్రాజెక్టు ఇక్కడ నడుస్తుంది. 80 శాతం స్వర్ణలాంటి క్వాలిటీ పెంచిన బియ్యం ఇక్కడ పంపిణీ చేస్తున్నాం. ఇందులోనూ 20 శాతం వేరే బియ్యం ఉన్నాయి. వచ్చే ఏప్రిల్ నాటికి ఈ 20 శాతం కూడా పోయి, వంద శాతం స్వర్ణలాంటి నాణ్యమైన బియ్యాన్ని ప్రతి జిల్లాలోనూ ఇస్తాం. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన బియ్యాన్ని (ప్రస్తుతం గోడౌన్లలో ఉన్నాయి) డిసెంబర్ నాటికి పూర్తిగా పంపిణీ చేస్తాం. నేనేమన్నా.. మీరేమంటున్నారు? నేనేం చెప్పానో ఓసారి వీడియో చూద్దాం. (సీఎం సభలో మాట్లాడిన క్లిప్పింగ్ చూపించారు.) మేనిఫెస్టోలో లేని పనులు కూడా ఈ ప్రభుత్వం చేస్తుంటే, అది కూడా జీర్ణించుకోలేని వీళ్ల ఈర్ష, దురద చూస్తుంటే పిచ్చాసుపత్రిలో తప్ప వీళ్లను నయం చేసే వాళ్లు ఎవరూ ఉండరు. నూకలు, రంగు ఉన్న గింజ శాతం తగ్గిస్తాం ఖరీఫ్, రబీ సీజన్లో మేం స్వర్ణ లేదా అలాంటి నాణ్యమైన రకాలకు చెందిన ధాన్యాన్నే ఈ పథకం కోసం సేకరించండని ఆదేశాలిచ్చాం. ఆరు నెలలు నిల్వబెట్టి మరీ ఇస్తాం. ఇంతకు ముందు పంపిణీ చేసిన బియ్యంలో నూకలు 25 శాతం ఉండేవి. మేం అందించే బియ్యంలో దీన్ని 15 శాతానికి తగ్గిస్తాం. 3 శాతం ఉండే డ్యామేజి, రంగు మారిన (డిస్కలర్) బియ్యాన్ని 0.75 శాతానికి పరిమితం చేయాలని ఆదేశించాం. గతంలో 5 శాతం ఉన్న షాకీగ్రేన్ ఒక్కశాతంకు మించి ఉండకూడదని చెప్పాం’ అని సీఎం స్పష్టం చేశారు. -
మేనిఫెస్టోలో ఇవ్వని వాగ్ధానాలను కూడా అమలు చేస్తున్నాం
-
సన్న బియ్యం అన్న మాటే లేదు
-
మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చేశాం
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో సన్న బియ్యం అన్న మాటే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పని పనులను కూడా ప్రభుత్వం చేస్తోందని గుర్తుచేశారు. మంగళవారం అసెంబ్లీలో నాణ్యమైన బియ్యం సరఫరాపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. తొలుత బియ్యం గురించి నాలెడ్జ్ పెంచుకొవాలని టీడీపీ సభ్యులకు సూచించారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలు కొడతారేమోనని టీడీపీ ఆన్లైన్లో పెట్టిన మేనిఫెస్టోను తీసివేసిందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకం ప్రారంభించామని.. నాణ్యమైన బియ్యం ప్రజలకు అందజేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు హయాంతో పోలిస్తే ప్రస్తుతం అందజేస్తున్న బియ్యానికి చాలా తేడా ఉందన్నారు. ప్రజలు బియ్యాన్ని అమ్ముకోకుండా.. తినాలనే ఆలోచన ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉందాన్నారు. ఇదే విధంగా ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ బియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. చంద్రబాబు హయాంతో పొల్చితే రూ. 1400 కోట్లు అదనంగా ఖర్చు చేసి ప్రజలకు స్వర్ణ బియ్యం అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బియ్యం సరఫరాలో నూకలు 25 శాతం ఉండేదని.. ప్రస్తుతం నాణ్యమైన బియ్యంలో నూకలు 15 శాతం మాత్రమే ఉంటుందని అన్నారు. పాదయాత్రలో ప్రజల నుంచి అనేక సూచనలు తీసుకున్నానని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు. పాదయాత్ర తర్వాత మేనిఫెస్టోను రూపొందిచామని.. అందులో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తామని ఎన్నికలకు వెళ్లామని చెప్పారు. ప్రజలకు మేలు చేస్తుంటే ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. గతంలో బియ్యం విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సీఎం వైఎస్ జగన్ సభలో ప్రదర్శించారు. కిలో రూ. 37 బియ్యాన్ని రూపాయికే అందిస్తున్నాం : శ్రీరంగనాథ్ అంతకు ముందు మంత్రి శ్రీరంగనాథ్ మాట్లాడుతూ.. ప్రజలకు స్వర్ణ రకం బియ్యాన్ని అందజేస్తున్నామని తెలిపారు. రేషన్ బియ్యం రీ సైక్లింగ్ కాకుండా ప్యాక్ చేసి ఇస్తున్నామని తెలిపారు. కిలో రూ. 37 బియ్యాన్ని రూపాయికే అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఏపీలో అందరికి కిలో రూపాయికే బియ్యం అందిస్తామని స్పష్టం చేశారు. 25లక్షల టన్నుల బియ్యం ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్టు వెల్లడించారు. ఆ ఘనత చంద్రబాబుదే : అప్పలరాజు కిలో 2 రూపాయల బియ్యాన్ని రూ. 5.25 చేసిన ఘనత చంద్రబాబుదేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు విమర్శించారు. నాణ్యమైన బియ్యం పంపిణీని పలాస నుంచి మొదలు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇస్తే తప్పరని గుర్తుచేశారు. ఎన్ని వేల కోట్లు రూపాయలు ఖర్చు అయిన ప్రభుత్వం పేదలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తుందన్నారు. వాహనం వెళ్లలేని ఊరికి సైతం వాలంటీర్లు ఇంటికి తీసుకెళ్లి బియ్యం తీసుకెళ్లి సరఫరా చేస్తున్నారని చెప్పారు. -
ప్రతి అంశాన్ని అమలు చేస్తామని చెప్పాం
-
ఇక నాణ్యమైన బియ్యం సరఫరా
సాక్షి, విజయనగరం : పేదలకు పౌరసరఫరాల వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ దిశగా చర్యలు మొదలు పెట్టింది. ఈ ఏడాది ధాన్యం కొనుగోలు సమయంలో నాణ్యమైన బియ్యం సేకరణపై దృష్టి పెట్టింది. ధాన్యం రకాల వారీగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని స్పాన్టెక్స్ మిల్లుల్లో మాత్రమే మరపట్టేలా చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్ నెల నుంచి వలంటీర్ల ద్వారా ఇంటింటికి నాణ్యమైన బియ్యం సరఫరా చేయాల్సి ఉండడంతో ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోలులో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖరీఫ్‌లో పండిన వరి పంటను రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రతి ఏడాదీ నవంబర్ నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి పంట ప్రస్తుతం పొలాల్లో ఉంది. మరో నెలరోజుల్లో కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు మేరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముందస్తు కసరత్తు ప్రారంభించారు. రకాల వారీగా ధాన్యం కొనుగోలు ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలన్న నిర్ణయాన్ని సెప్టెంబరు నెల నుంచి శ్రీకాకుళం జిల్లాలో అమలు చేశారు. విజయనగరం జిల్లాతోపాటు రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కూడా వచ్చే ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని యోచిస్తున్నారు. అప్పటికి నాణ్యమైన బియ్యం సిద్ధం చేయాలని సర్కారు అధికారులను ఆదేశించింది. ఈ ఏడాది ఖరీఫ్, రబీలో సేకరించే ధాన్యం కొనుగోలులో క్వాలిటీపై అధికారులు దృష్టి పెట్టారు. ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు అన్ని రకాలు కలిపి కొనేసి ఒకేచోట నిల్వ చేసి మిల్లులకు పంపించేయకుండా రకాల ఆధారంగా విభజించి మిల్లులకు పంపించి మిల్లింగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే సన్న రకాలు, సాధారణ రకాల ధాన్యం వేర్వేరుగా కొనుగోలు చేయడంతోపాటు, గ్రేడ్–ఎ, సాధారణ రకాలను గుర్తిస్తారు. మంచి రకాలను రేషన్‌కార్డు లబ్ధిదారులకు సరఫరా చేస్తారు. మిగతా రకం ఎఫ్‌సీఐ, ఇతర అవసరాలకు తరలిస్తారు. స్పాన్టెక్స్ మిల్లుల్లోనే మిల్లింగ్ కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని నాణ్యమైన బియ్యంగా మార్చాలంటే స్పాన్టెక్స్ మిల్లుల్లోనే మరాడించాలి. ఇక్కడ మిల్లింగ్ చేయడం వల్ల నూకలు తక్కువగా ఉండటమే గాకుండా సన్నరకం బియ్యం సిద్ధమవుతాయి. ఈ బియ్యం తినడానికి అనుకూలంగా ఉంటుంది. జిల్లాలో ఆ స్థాయిలో స్పాన్టెక్స్ మిల్లులు లేవు. సుమారు 200 రైస్ మిల్లులుండగా ప్రస్తుతం అందులో ఆరు మాత్రమే ఉన్నాయి. మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం మరపట్టి క్వాలిటీగా ఇవ్వాలంటే యంత్రాలు మార్పు చేయడం అనివార్యం. ఎవరైనా బిగించకుంటే వారికి ధాన్యం ఇవ్వకూడదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చినా అక్కడి నుంచి వచ్చే బియ్యాన్ని ప్రజలకు సరఫరా చేయకుండా ఎఫ్సీఐకు ఇచ్చేలా యోచిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు శుక్రవారమే చర్చించారు. ప్యాకింగ్ యంత్రాలకోసం టెండర్ బియ్యాన్ని అందంగా ప్యాక్ చేసేందుకు అవసరమైన యూనిట్లు నెలకొల్పుకునేవారికోసం ప్రత్యేకంగా ఈ నెల 16వ తేదీన జిల్లా అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో దీనికి సంబంధించిన విధి విధానాలను వెల్లడిస్తారు. మొత్తమ్మీద జిల్లా యంత్రాంగం వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. -
నూకలు చెల్లాయ్..
సాక్షి, ఒంగోలు సిటీ: ప్రజా పంపిణీలో నాణ్యమైన బియ్యం ఇవ్వడానికి కసరత్తు జరుగుతోంది. తెల్లకార్డు కలిగిన వారికి ఇచ్చే బియ్యంలో నూక శాతం తగ్గాలి. తేమకు పరిమితి ఉంది. తౌడు మోతాదు తగ్గాలి. తుక్కు, రద్దు జాడే ఉండకూడదు. ముక్కి వాసన రాకుండా నాణ్యతా ప్రమాణాలు అందుబాటులో ఉండాలి. ఇలా మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ కానుంది. ఇందుకు సంబంధించి గోదాము స్థాయిలో నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉంచుకోవడానికి తగిన సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీ నాణ్యమైన బియ్యం ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది. కార్డుదారుడు తీసుకున్న బియ్యం ఇంటిల్లపాది వినియోగించుకొనే విధంగా బియ్యం నాణ్యతా ప్రమాణాలు ఉండితీరాలి. ఇందు కోసం గోదాముల్లో ఉన్న బియ్యం నమూనాలను సేకరించే పనిలో పడ్డారు. జిల్లాలో ప్రజా పంపిణీ కింద నెలకు 15,117.120 టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. 2151 చౌక ధరల దుకాణాల ద్వారా 9,90,501 తెల్లకార్డు కలిగిన వారికి బియ్యం పంపిణీ జరుగుతోంది. 2018–19 ఏడాదిలో బియ్యం 1,28,685 టన్నులు కేటాయిస్తే అందులో 1,27,692 టన్నులు బియ్యం కార్డుదారులకు పంపిణీ చేశారు. ఏటా కార్డుదారులకు వినియోగమవుతున్న బియ్యం లెక్కలను తీశారు. వీటి ప్రకారం ఇక జిల్లాలోని కార్డుదారులకు నాణ్యమైన బియ్యం ఇవ్వడానికి కార్యాచరణకు పూనుకున్నారు. వలంటీర్ల ద్వారా నాణ్యమైన బియ్యం పంపిణీ జరగనుంది. ఇక డీలర్లు స్టాకిస్ట్‌లుగా ఉంటారని సంకేతాలను సంబంధిత మంత్రి ఇచ్చారు. స్టాకిస్ట్‌ల విధివిధానాలు ఇంకా రాకపోయినా నాణ్యమైన బియ్యం ప్యాకెట్లు వలంటీర్ల ఆధ్వర్యంలో కార్డుదారుని ఇంటికే నేరుగా తెచ్చి ఇవ్వనున్నారు. బియ్యం ప్యాకెట్లు 5,10,25 కిలోల లెక్కన ఉంటాయి. ఈ ప్యాకెట్లను తయారు చేయడానికి ప్రాథమికంగా కేంద్రాల గుర్తింపు ప్రక్రియ జరిగింది. నూకలకు కాలం చెల్లింది.. ఇక నాణ్యమైన బియ్యంలో నూకల శాతం పరిమితంగానే ఉండాలి. దీని కోసం పరిశీలనకు జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటయింది. జిల్లా సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి, పౌరసరఫరాల సంస్ధ జిల్లా మేనేజర్, ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఇద్దరు సాంకేతిక అసిస్టెంట్ మేనేజర్లు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ కమిటీలో ఉన్నారు. ► ఇప్పటి వరకు ప్రజా పంపిణీకి ఇస్తున్న కస్టమ్ మిల్లింగ్ రైస్‌లో నూకలు ఇతర వ్యర్థాలు 25 శాతం వరకు అనుమతిస్తున్నారు. ఈ ప్రమాణాల కన్నా అదనంగా మరో 5–10 శాతం కూడా నాణ్యత లోపిస్తోంది. ఇక నూకల శాతం బాగా తగ్గించారు. దీనితో పాటు బియ్యం నాణ్యతకు ప్రమాణాలను సవరించారు. ఇక నుంచి ప్రజాపంపిణీలో ఇచ్చే బియ్యంలో నూకలు, ఇతర వ్యర్ధాలు కలిపి మొత్తంగా 15 శాతంలోపే ఉండాలి. దీని కోసంగా జిల్లా కమిటీ నుంచి ప్రభుత్వం నివేదిక కోరింది. 107 నమూనాల సేకరణ.. జిల్లా కమిటీ ప్రస్తుతం పౌరసరఫరాల గోదాముల్లో ఉన్న సీఎంఆర్ రైస్‌లో ఉన్న నూకలు, ఇతర వ్యర్థాలు కలిపి ఎంత మోతాదులో ఉన్నాయో వివరాలను సేకరించి నివేదిక ఒకటి రెండు రోజుల్లో ఇవ్వమని పౌరసరఫరాల సంస్థ ఎండీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ నమూనాల సేకరణకు ఉపక్రమించింది. జిల్లాలోని గుండ్లాపల్లి, దొడ్డవరప్పాడు గోదాముల్లో నమూనాలను సేకరించారు. చీరాల గోదాముల్లో శుక్ర,శనివారాలు నమూనాలను సేకరించనున్నారు. వీటితో పాటు సెంట్రల్ వేర్ హౌస్ గోదాముల నుంచి నమూనాలను సేకరించనున్నారు. కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన.. గోదాముల నుంచి సేకరించిన బియ్యం నమూనాలను జిల్లా పౌరసరఫరాల సంస్ధ కార్యాలయంలో కమిటీ పరిశీ లిస్తోంది. వివిధ గోదాముల నుంచి 107 శాంపిల్స్‌ను తీశారు. 3,240 బస్తాలకు ఒక శాంపిల్ లెక్కన తీశారు. ► నమూనాలను పరిశీలించి ప్రాథమికంగా నివేదిక తయారు చేశారు. జిల్లాలోని వివిధ గోదాముల్లో సీఎంఆర్ ద్వారా సేకరించిన బియ్యం బస్తాల నుంచి సేకరించిన నమూనాల్లో నూకల శాతం 20–28 శాతం వరకు ఉన్నాయి. అథమంగా 17 శాతంగా కొన్ని శాంపుల్స్‌లో ఉన్నాయి. సరాసరిన 10 శాతంగా నూకలు ఇతర వ్యర్థాలను తగ్గించి 15 శాతంగా నూకలు ఉన్న బియ్యాన్ని ప్రస్తుతం ఉన్న లాట్ల నుంచి అనుమతిస్తారు. బియ్యం బస్తాల నుంచి తీసిన నమూనాలపై నివేదిక ఒకటి రెండు రోజుల్లో పౌరసరఫరాల సంస్థ ఎండీ కార్యాలయానికి పంపనున్నారు. ప్రస్తుతం ఉన్న నాణ్యతా ప్రమాణాల ఆధారంగా ఏ విధంగా పంపిణీకి నిర్ణయాన్ని తీసుకుంటారో ప్రభుత్వ పెద్దల చేతిలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ జిల్లాలోని కార్డుదారులకు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడానికి రంగం సిద్ధమైంది. వలంటీర్ల ద్వారా కార్డుదారులకు పంపి ణీ చేస్తారు. జనవరి నుంచి రేషన్‌కార్డు లేని కుటుంబాలకు 72 గంటల వ్యవధిలోనే కొత్త కార్డులను ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యం లోనే తగినంత మోతాదులో నాణ్యమైన బియ్యం సీఎంఆర్ ద్వారా తీసుకోవడానికి కార్యాచరణకు పూనుకుంది. జిల్లాలో పండిస్తున్న ధాన్యం రకాలు, ఇతర జిల్లా ల నుంచి వస్తున్న సీఎంఆర్ బియ్యం రకాలలో ఇక నుంచి నూకలు ఇతర వ్యర్ధాలన్నీ కలిపి 15 శాతంలోపే ఉండే విధంగా కార్యాచరణకు పూనుకున్నారు. ఇప్పుడున్న బియ్యం పంపిణీకి త్వరలో మార్గదర్శకాలు విడుదలకానున్నాయి. -
‘ఛీ’ప్ ట్రిక్స్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ పథకం ఒక బృహత్తర కార్యక్రమం. జిల్లాలో 8.31 లక్షల కార్డుదారులకు నేరుగా సరఫరా చేసే టాస్క్ ఇది. అధికారులు ప్రణాళికబద్ధంగా రాత్రింబవళ్లు కష్టపడి ఆచరణలో పెట్టిన పైలెట్ ప్రాజెక్టు ఇది. చరిత్రలో ఎక్కడా లేని విధంగా తలపెట్టిన వినూత్న సంక్షేమ కార్యక్రమమిది. అనుకున్నట్టుగానే శనివారం ఇంటి ముంగిటకే నాణ్యమైన బియ్యం బ్యాగులు చేరాయి. తొలిరోజే 92 శాతం మేర పంపిణీ పూర్తయింది. లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం కనిపించిది. జిల్లా అంతటా సంతోషం వ్యక్తమవుతోంది. కానీ ఇది టీడీపీ నేతలకు మాత్రం కంటగింపుగా మారింది. ఇంటింటికీ నాణ్యమైన బియ్యం బ్యాగులు చేరుకునేసరికి ఆ పార్టీ నేతలకు వణుకుపుట్టింది. పునాదులు కదులుతాయేమోనన్న భయం పట్టుకుంది. ఇంకేముంది తమకు అలవాటైన చీప్ పబ్లిసిటీని నమ్ముకున్నారు. ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పంపిణీ చేస్తున్న నాణ్యమైన బియ్యంపై బురద చల్లే కార్యక్రమానికి ఒడిగట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు రవాణా సమయంలో తడిసిన బ్యాగులను పట్టుకుని రాద్ధాంతం చేశారు. వాస్తవమేంటో తెలుసుకోకుండా నాణ్యత లేని బియ్యమంటూ దుష్ప్రచారానికి దిగారు. జిల్లాలో శనివారం ఒక్కరోజే శతశాతం పంపిణీ చేసేందుకు కలెక్టర్ జె.నివాస్ నేతృత్వంలో జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసుల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శనివా రం సాయంత్రానికి జిల్లావ్యాప్తంగా 92 శాతం మేర పంపిణీ జరిగింది. సీతంపేట ప్రాంతంలో వర్షం కురిసిన కారణంగా, కొంతమంది ఇళ్ల వద్ద లేని కారణంగా పంపిణీలో కొంతమేర జాప్యం చోటు చేసుకుంది. మిగతా అన్నిచోట్ల ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో ఇళ్ల వద్దకే నాణ్యమైన బియ్యం చేరాయి. బూర్జ మండలం లాబాం గ్రామంలో జరిగిన బియ్యం పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. నరసన్నపేలో మంత్రి ధర్మాన కృష్ణదాస్, రేగిడి మండలంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, మెళియాపుట్టిలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, లావేరు మండలంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, వీరఘట్టంలో ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమం సందడిగా సాగింది. తడిసిన బియ్యాన్ని పట్టుకుని టీడీపీ రాద్ధాంతం.. జిల్లావ్యాప్తంగా 9 లక్షల 36 వేల 941 బ్యాగులను పంపిణీ చేస్తుండగా వాటిలో 30 బ్యాగుల వరకు తడిసినవి బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా నుంచి రవాణా సమయంలోనూ, చౌక ధరల దుకాణాలు, గిడ్డంగులలో వసతి వలన ఇ టీవల కురిసిన భారీ వర్షాలకు కొన్ని బస్తాలు తడవడం వలన బియ్యంలో తేడా వచ్చింది. లబ్ధిదారులు తెలియజేయగానే వాటిని అధికారులు రీప్లేస్ చేశారు. కానీ టీడీపీ నాయకులు వాటిని పట్టుకుని ముక్కిపోయిన బియ్యంగా చూపిస్తూ ప్రచారం చేయడం ప్రారంభించారు. అధికారులు తక్షణమే మార్చినప్పటికీ వాటి ని చూపించి నానా యాగీ చేశారు. నిజానికి గతంలో బియ్యంలో ఊక, బొత్తు, మ ట్టి రాళ్లు కలిసి ఉండేవి. 25శాతం నూకలు ఉండేవి. ఇప్పుడు నాణ్యమైన బియ్యం లో ఊక, బొత్తు, మట్టి రాళ్లు లేవు సరికదా.. నూకలు 10 శాతానికి తగ్గాయి. టీడీపీ వ్యూహాత్మక కుట్ర.. నాణ్యమైన బియ్యం పథకంపై బురద జల్లేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా కుట్ర పన్నింది. కొత్త విధానంతో తమకెక్కడ ఇబ్బంది వస్తుందోనని గత ప్రభుత్వంలో నియమితులైన దాదాపు 250 డీలర్లను చేతిలో పెట్టుకుని అసత్య ప్రచారం కోసం లీకులు ఇప్పించడం ప్రారంభించారు. ఇప్పటికే మీరేం చేయలేరని... ఎలా చేస్తారో చూస్తామని... వలంటీర్ బాధ్యతలు కష్టమని... వలంటీర్లను బెదిరించే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే, కార్డుదారులు కూడా తప్పనిసరిగా రూ.300 చేతిలో ఉంచుకోవాలని, ప్రభుత్వమిచ్చిన అన్ని సరుకులు విడిపించుకోవాలని భయపెడుతున్నారు. వాస్తవానికైతే, ఎవరికి ఏ సరుకులు కావాలో వాటిని విడిపించుకునే అవకాశం ఉంది. కానీ, ఏదో ఒకటి చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని అదే పనిగా పథక రచన చేస్తున్నారు. అందులో భాగంగానే నాణ్యమైన బియ్యం పంపిణీ తొలి రోజున ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన బియ్యాన్ని పట్టుకుని దుష్ప్రచారానికి ఒడిగట్టారు. తగిన సమాధానం ఇచ్చేలా అధికారులు వెంటనే తడిసిన బియ్యం అందిన చోట రీప్లేస్ కూడా చేశారు. కానీ టీడీపీ నాయకులు అదే పనిగా అసత్యాలతో పబ్బం గడుపుకోవడానికి యత్నించారు. -
‘బియ్యం బాగున్నాయంటూ ప్రశంసలు’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన ‘నాణ్యమైన బియ్యం పంపిణీ’ పథకానికి మంచి స్పందన వస్తుందన్నారు మంత్రి కొడాలి నాని. జిల్లా వ్యాప్తంగా 8,60,727 మంది తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. రెండు రోజుల్లో 70 శాతానికి పైగా లబ్దిదారులకు గ్రామ వాలంటీర్లు 9,48,105 సంచుల బియ్యం సంచులను పంపిణీ చేశారన్నారు. గత నాలుగైదు రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నప్పటికి.. ఇబ్బందులను అధిగమించి బియ్య రవాణా చేస్తున్నామన్నారు. వర్షాల కారణంగా 25 బియ్యం సంచులు తడిసిపోయాయని వాటి స్థానంలో కొత్తవాటిని తిరిగి పంపిణీ చేశామని మంత్రి నాని తెలిపారు. -
పేదలకు సంతృప్తిగా భోజనం
సాక్షి, శ్రీకాకుళం/అమరావతి: ‘రేషన్ డిపోల ద్వారా ఇస్తున్న బియ్యం ప్రజలు తినే పరిస్థితి లేదు. ఏ బియ్యం అయితే మనం తినగలుతామో వాటినే పేదలకు పంపిణీ చేస్తాం. పూర్తిగా ఫిల్టరింగ్ చేసి.. 5, 10, 15, 20 కేజీలుగా ప్యాక్ చేసి సెప్టెంబర్ నుంచి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే సరఫరా చేస్తాం’ అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. అందుకు అనుగుణంగానే తొలుత శ్రీకాకుళం జిల్లాలో నాణ్యమైన బియ్యాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద వలంటీర్ల ద్వారా పేదల ఇంటికే పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కాశీబుగ్గలో ప్రారంభించనున్నారు. అనంతరం ఈ నెల 7, 8 తేదీల్లో జిల్లావ్యాప్తంగా బియ్యం పంపిణీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం రెండో విడతలో విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపడతారు. పంపిణీ ఏర్పాట్లు ఇలా.. జిల్లాను 15,344 క్లస్టర్లుగా విభజించారు. జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, ఐదు పురపాలక సంఘాలు, 1,141 గ్రామ పంచాయితీల పరిధిలో 1,865 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటికి మొత్తం 11,924 మంది వలంటీర్లను నియమించారు. ఒక్కొక్క క్లస్టర్లో 50 నుంచి 60 వరకు కుటుంబాలను చేర్చారు. వలంటీర్ల ద్వారా పేదలకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే 9,48,105 బియ్యం బ్యాగ్‌లను 2,015 రేషన్ డిపోల్లో సిద్ధంగా ఉంచారు. వీటిలో 5 కిలోల బ్యాగ్‌లు 1,24,049, 10 కిలోల బ్యాగ్‌లు 2,42,035, 15 కిలోల బ్యాగ్‌లు 2,73,764, 20 కిలోల బ్యాగులు 3,08,257 ఉన్నాయి. పంపిణీ కార్యక్రమంలో ఏవైనా లోటుపాట్లు తలెత్తితే తెలుసుకుని పరిష్కరించేందుకు వీలుగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కార్డుదారుల మ్యాపింగ్‌లో సమస్యలు, పోర్టబులిటీ, డీలర్ లేదా వలంటీర్ అందుబాటు, యూనిట్లో తేడాలు రావడం వంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తితే లబ్ధిదారులు నేరుగా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ ద్వారా తెలియజేస్తే అక్కడికక్కడే పరిష్కరిస్తారు. మరోవైపు నూతన విధానం వల్ల పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ దందాకు, తూకంలో మోసాలకు అడ్డుకట్ట పడనుంది. 20 ఏళ్లుగా పరిశోధనలకే పరిమితం ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఆనవాళ్లు 1990 దశకంలోనే కనిపించాయి. 2000లో సోంపేటకు చెందిన ఐఎంఏ వైద్యులు వై.కృష్ణమూర్తి, పి.శివాజీ బృందం కవిటి ప్రాంతంలో ఈ కేసులను అధికారికంగా గుర్తించారు. 2004లో కేజీహెచ్ వైద్యులు 2005లో పరిశోధన వైద్య శిబిరాలు చేపట్టగా.. 2008 మే 24న నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గంగాధర్, హైదరాబాద్ నిమ్స్ ఆర్ఎంఓ శేషాద్రి పర్యటించారు. అదే ఏడాది రాష్ట్ర నీటి విశ్లేషణ పరిశోధనా సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.కృష్ణమూర్తి , చీఫ్ కెమిస్ట్ ఎ.సతీష్, 2009లో న్యూయార్క్‌కు చెందిన కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ శివప్రసాద్ ఇక్కడ పర్యటించారు. 2011లో డాక్టర్ రవిరాజ్, డాక్టర్ వెలగల శ్రీనివాస్, డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, ఎ.వేణుగోపాల్ బృందం, న్యూయార్క్‌కు చెందిన స్టోనీబ్రూక్స్ యూనివర్సిటీ బృందం, హైదరాబాద్‌కు చెందిన పరిశోధకురాలు సీఐఎస్ఆర్ సుజాత, 2012లో జపాన్, అమెరికన్ బృందాలతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికల్ డిసీజెస్ బృందం అధ్యయనం జరిపాయి. 2013లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం, బాబా అటామిక్ రీసెర్చ్ బృందాలు పరిశోధనలు చేశాయి. 2017 నుంచి భారతీయ వైద్యపరిశోధనా మండలి పరిశోధన సాగుతోంది. కిడ్నీ బాధితులకు కొండంత అండ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పాదయాత్రలోనూ.. అంతకుముందు ఉద్దాన ప్రాంత పర్యటనలో కిడ్నీ బాధితుల కష్టాలను కళ్లారా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే చర్యలకు ఉపక్రమించారు. ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనిని 100 రోజుల పాలనలో చేసి చూపించారు. కిడ్నీ రోగులకు నెలకు రూ.10 వేల పింఛను అందజేస్తున్నారు. వైద్య సేవలందించేందుకు వీలుగా 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, దానికి అనుగుణంగా రీసెర్చ్ సెంటర్, అతి పెద్ద డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు రూ.50 కోట్లు మంజూరు చేశారు. దీంతో సరిపెట్టకుండా వ్యాధికి మూలమైన తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఇంటింటికీ కుళాయిల ద్వారా శుద్ధ జలాలను సరఫరా చేసేందుకు ఉపక్రమించారు. ఇందుకోసం రూ.600 కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. వీటన్నిటికీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. -
నాణ్యమైన బియ్యం రెడీ
సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్: తెల్ల రేషన్ కార్డులపై నాణ్యమైన బియ్యం పంపిణీకి సీఎం వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో అందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సన్న బియ్యం ప్యాకెట్లు తొలి విడత చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లో జిల్లాకు కావాల్సిన సరుకంతా వచ్చే అవకాశముంది. జిల్లాకు 13.243 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా, బఫర్ స్టాక్‌తో కలిసి 15,000 మెట్రిక్ టన్నులు తీసుకువస్తున్నారు. ఈ బియ్యం ప్యాకెట్లను ఈనెల 28 నాటికి అన్ని ఎఫ్‌పి షాపులకు చేరవేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 8,32,636 కార్డుదారులకు ప్రయోజనం.. జిల్లాలో 8,32,636 బీపీఎల్ కార్డులు ఉన్నాయి. మొత్తం 26.48 లక్షలమంది లబ్ధిదారులున్నారు. ఈ కార్డుదారులకు నెలకు 13.243 మెట్రిక్ టన్నులు బియ్యం అవసరం ఉంటుంది. ప్రతి వ్యక్తికి (యూనిట్‌కి) అయిదు కేజీలు వంతున అందజేస్తున్నారు. ఈ లెక్కన లబ్ధిదారులకు అయిదు, పది, కేజీలు, 20 కేజీల బ్యాగులను సిద్ధం చేశారు. కుటుంబ సభ్యుల ఆధారంగా ప్యాకెట్లు పంపిణీ వివరాలు... -ఒక సభ్యుడు గల కార్డులు 124049. వీరికి 5 కిలోల ప్యాక్ -ఇద్దరు సభ్యులు ఉండే కార్డులు 176505. వీరికి 10 కిలోల ప్యాక్ -ముగ్గురు సభ్యులున్న కార్డులు 166530. వీరికి 15 కిలోల ప్యాక్ -నలుగురు సభ్యులున్న కార్డులు 248234. వీరికి 20 కిలోల బ్యాగ్ -అయిదు సభ్యులున్న కార్డులు 56105. వీరికి 10 కిలోలు, 15 కిలోల ప్యాక్‌లు -ఆరుగురు సభ్యులున్న కార్డులు 8405. వీరికి 10 కిలోలు, 20 కిలోల ప్యాక్‌లు -ఏడుగురున్న కార్డులు 1284. వీరికి 15 కిలోలు, 20 కిలోలు బ్యాగులు -ఎనిమిది మంది సభ్యులున్న కార్డులు 223. వీరికి 20 కిలోలు గల బ్యాగులు రెండు -9 మంది సభ్యులు గల కార్డులు 44. వీరికి10 కిలోలు, 15 కిలోలు, 20 కిలోల బ్యాగులు -10 మంది ఉన్న కార్డులు 20. వీరికి పది కేజీల ప్యాక్, 20 కేజీల బ్యాగులు రెండు -11 మంది ఉన్న కార్డులు 3. వీరికి 15 కిలోల ప్యాక్‌వై 3, 20 కిలోల బ్యాగ్ -ఏఏవై కార్డులు 49,798. వీరికి 15 కిలోలు, 20 కిలోల బ్యాగులు -ఏపీ కార్డులు 956. వీరికి 10 కిలోల బ్యాగులు ఒకటి నుంచి పంపిణీ: జేసీ శ్రీనివాసులు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇంటివద్దకే నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ ఒకటిన జిల్లాలో ప్రారంభం కానుందని జేసీ శ్రీనివాసులు తెలిపారు. నాణ్యమైన బియ్యం తొలి లారీ తూర్పుగోదా వరి నుంచి శ్రీకాకుళం ఎంఎల్ఎస్ పాయింట్‌కి శుక్రవారం చేరిందని జేసీ తెలిపారు. ఈ లారీలో 25 మెట్రిక్ టన్నుల బియ్యం, వివిధ పరిమాణాల్లో ఉన్నాయి. ఈ లారీతో వచ్చిన బియ్యాన్ని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు పరిశీలించారు. కొన్ని ప్యాకెట్లను మచ్చుకి పరిశీలించారు. ముందుగా చెప్పిన విధంగా ఈ ప్యాకెట్లలో నాణ్యమైన బియ్యం రావడంతో ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. వచ్చిన లారీలో చాలా వరకు బియ్యాన్ని శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం ఎఫ్‌పి షాపుల డిపోకు పంపించేందుకు జెండా ఊపి పంపించారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ బియ్యాన్ని అందజేస్తామని అన్నారు. జిల్లాలో ఉన్న 8.32 లక్షల తెలుపు రంగు రేషన్ కార్డుదారులు ఉన్నారని, వారికి 13,312 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 5, 10, 15, 20 కేజీల ప్యాకట్ల రూపంలో సిద్ధం చేశామని ఆయన తెలిపారు. 18 మండల స్థాయి స్టాక్ పాయింట్లకు సరఫరా చేస్తామని తెలిపారు. అక్కడ నుంచి ఎఫ్‌పి షాపులకు వెళతాయని తెలిపారు. శనివారం నాటికి మరో పది లారీల వరకు సుమారుగా 250 మెట్రిక్ టన్నుల బియ్యం రానున్నట్టు ఆయన తెలిపారు. సీతంపేట, ఐటిడిఎ గ్రామాలకు సరఫరా చేయనున్నామని తెలిపారు. జిల్లాలో ఈకేవైసీతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెల రేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. వచ్చిన బియ్యాన్ని సకాలంలో అన్ని ఎఫ్‌పి షాపులకు అందజేస్తామని జేసీ తెలిపారు. జేసీతోపాటుగా సివిల్ సప్లయిస జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు, జిల్లా సరఫరాల అధికారి జి నాగేశ్వరరావు, గోదాం ఇన్చార్జీ బి గోపాల్ తదితరులు ఉన్నారు. -
38 మండలాలు.. 15,344 క్లస్టర్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: పేదల విందు పరి పూర్ణం కానుంది. తెలుపు రంగు రేషన్‌కార్డు గల పేదలకు పౌర సరఫరాల విభాగం ద్వారా నా ణ్యమైన బియ్యాన్ని ఇంటికే తీసుకువచ్చే ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ బృహత్తర కార్యక్రమం తొలి విడత లబ్ధిదారుల జాబితా లో మన జిల్లా కూడా ఉంది. రెండో విడతలో విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో తొలి దశ పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వలంటీర్లకు క్లస్టర్ల ఏర్పాటు, వారి రేషన్ కార్డుల అనుసంధానం, బియ్యం సరఫ రా చేసేందుకు వాహనాలు సిద్ధం చేసుకోవడం, వాటికి రవాణా ఖర్చులు అంచనా వేయడం వంటి చర్యలతో అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో ఈ నాణ్యమైన బియ్యం పంపిణీకి సంబంధించిన పనులు సుమారుగా 90 శాతం వరకు పూర్తి చేశారు. అక్కడక్కడా ట్రయల్ రన్ కూడా చేస్తున్నారు. లోపాలను ఎప్పటికప్పుడు సవరిస్తూ ఒకటో తేదీ నాటికి సజావుగా పంపిణీ జరిగేలా కలెక్టర్ నివాస్, జేసీ శ్రీనివాస్, సివిల్ సప్లై, డీఎస్ఓ విభాగం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 15,344 క్లస్టర్ల ఏర్పాటు.. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 38 మండలాలు, ఇతర గ్రామ పంచాయతీలు, నగర పాలక, పురపాలక సంస్థలను కలిపి 15,344 క్లస్టర్లుగా విడదీశారు. ఒక్కో క్లస్టర్‌కి 50 నుంచి 60 కుటుంబాలను చేర్చారు. ఒక్కో క్లస్టర్లో ఒక్కో వలంటీర్ సేవలు అందిస్తారు. ఇప్పటికే నియమితులైన వలంటీర్లు ఆయా క్లస్టర్లలో కుటుంబాలను పరిచయం చేసుకునే కార్యక్రమం పూర్తి చేశారు. అలాగే వారి కార్డులు, క్లస్టర్ వలంటీర్ లాగిన్‌కి మ్యాపింగ్ కూడా చేస్తున్నారు. ఈ పనిలో ఇప్పటికే 96 శాతం పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. మిగిలిన శాతాన్ని ఈ గడువులో పూర్తి చేయనున్నారు. పంపిణీ వ్యయం సగటున రూ.383: ప్రభుత్వం పేదలకు అందజేసే నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకు చేర్చాలం టే గతంలో కంటే కొంత ఖర్చు పెరుగుతుంది. అయినా ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని పేదలకు అందించేందుకు ఆర్థిక భారాన్ని లెక్క చేయడం లేదు. ఈ సరుకులు అందించేందుకు సగటున రూ.383 ఖర్చవుతుంది. ఇప్పటి వరకు చేస్తున్న హమాలీలు బియ్యంను గోదాముల్లో లోడ్ చేయ డం, అన్లోడ్ చేయడం, ఎఫ్‌పి షాపులకు తరలించడం కోసం ఒక్కో ప్రక్రియకు రూ.9లు వంతున ఖర్చు చేసేవారు. అయితే ఈ ప్రకియతోపాటుగా అదనంగా క్లస్టర్లలో వాహనాలకి ఇచ్చే ఖర్చు పెరిగింది. గిరిజన ప్రాంతాల్లో కొండకోనల్లో ఉన్న గూడేలకు ఈ నాణ్యమైన బియ్యాన్ని సరఫరాలకు మరికాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా ప్రతి నెల ఈ వాహనాల ఖర్చు సుమారుగా రూ. 58,76,980గా ఉండబోతోంది. నాణ్యమైన బియ్యం.. ఇప్పటివరకు పౌర సరఫరాల ద్వారా ఎఫ్పీ షాపులకు, అక్కడ నుంచి తెల్లకార్డుల లబ్ధిదా రులకు అందజేసే బియ్యం అధికంగా 25 శాతం కంటే ఎక్కువగా నూకలు, తవుడు చెత్తతో కూడి ఉండేది. వీటిలో నాణ్యత తక్కువగా ఉండేది. అక్టోబర్ ఒకటి నుంచి కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అందజేసే నాణ్యమైనబి య్యంలో ఈ నూకల శాతం చాలా తక్కువగా ఉంటుంది. బి య్యం కంప్యూటర్ మెజర్ ప్రకారం సార్ట్ చేసిన బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. తూర్పు గోదావరి నుంచి బియ్యం దిగుమతి.. నాణ్యమైన బియ్యం మనకు కావాల్సిన స్థాయిలో స్థానికంగా లభ్యం లేనందున, తొలి విడతలో మన జిల్లాకు కావల్సిన 13,242 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు, కాకినాడ, రామచంద్రాపురం, మండలపేట తదితర ప్రాంతాల్లోని సుమారుగా 300 రైస్ మిల్లులను నుంచి ఈ నాణ్యమైన బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ బియ్యం అక్కడ సిద్ధంగా తూనికలు, ప్యాకింగ్ ను పూర్తి చేసుకొని ఉంది. ఈ నెల 28వ తేదీ నాటికి జిల్లాకు చేర్చడానికి జిల్లా యంత్రాగం అన్ని చర్యలు సిద్ధం చేసింది. నేరుగా ఎఫ్పీ షాపులకే బియ్యం.. సెప్టెంబర్ ఒకటి నుంచి నాణ్యమైన బియ్యాన్ని తెలుపు రంగు కార్డుదారులకు అందజేయనున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకున్నాం. ఈ నెల 28 నాటికి తూర్పు గోదావరి జిల్లా నుంచి నాణ్యమైన బియ్యం జిల్లాకు చేరుతోంది. ఈ బియ్యం ప్యాకెట్ నేరుగా గ్రామాల్లోని ఎఫ్పీ షాపుల డీలర్లు గోదాములకు చేర్చుతున్నారు. అక్కడ నుంచి వలం టీర్లు డోర్ టు డోర్గా లబ్ధిదారులకు అందజేస్తారు. – జి.నాగేశ్వరరావు, డీఎస్ఓ, శ్రీకాకుళం -
‘అందుకే ప్యాక్ చేసిన సన్నబియ్యం’
సాక్షి, అమరావతి : గత టీడీపీ ప్రభుత్వం సేకరించిన బియ్యంలో నాణ్యత లేదని, 40శాతం బియ్యం తినడానికే వీలులేకుండా చేశారని పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని ఆరోపించారు. తమ ప్రభుత్వం సెప్టెంబర్ 1నుంచి ప్రతి పేదవాడికి నాణ్యమైన సన్నబియ్యం అందిస్తుందని చెప్పారు. సన్నబియ్యం పథకాన్ని తొలివిడతగా శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రాష్ట్రం మొత్తం సన్నబియ్యం పంపణీ చేస్తామన్నారు. అవినీతికి, రిసైక్లింగ్‌కి తావు లేకుండా చేసేందుకే ప్యాక్ చేసిన బియ్యం ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. ప్యాకింగ్‌కు రూ.250 కోట్లు ఖర్చు పెడుతుందని టీడీపీ ఆరోపిస్తుంది.. రూ.12వేల కోట్ల బియ్యం పంపిణీ చేసినప్పుడు రూ.250 కోట్లు ఖర్చు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. బియ్యం పంపిణీలో అవినీతి లేకుండా పేదలకు సరఫరా చేస్తామన్నారు. అక్టోబర్ 2నుంచి కొత్త రేషన్‌కార్టుల జారీ ప్రక్రియ చేపడతామని తెలిపారు. గతంలో టీడీపీ 15 లక్షల రేషన్ కార్డులను అనర్హులకు ఇచ్చిందని, వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామ సచివాలయాల ద్వారా కొత్త కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. -
సన్నబియ్యం చేరేనా?
సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సన్నబియ్యం వండిపెట్టడంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. జనవరి ఒకటినుంచి ఈ పథకాన్ని అమలుచేయాలి. అంటే మరో ఐదు రోజులే గడువుంది. కానీ ఇప్పటి వరకు జనవరి కోటాను కొనుగోలు చేయకపోవడం.. బస్తా బియ్యం కూడా హాస్టల్స్‌కు చేరకపోవడంతో పథకం అమలుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ : సంక్షేమ వసతి గృహాలకు సన్నబియ్యాన్ని అందించేందుకు జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. పేద విద్యార్థులు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్న ఉద్దేశంతో రాష్ర్ట ప్రభుత్వం జనవరి 1 తేదీ నుంచి హాస్టళ్లకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భాగంగా బియ్యం పంపిణీకి సంబంధించి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోంది. హాస్టల్స్‌కు బియ్యం చేరవేసేందుకు గడువు మరో ఐదు రోజులు మాత్రమే ఉంది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా బస్తా బియ్యం హాస్టల్స్‌కు చేరలేదు. జనవరి నెలకు కావాల్సిన బియ్యం కోటాను మిల్లర్ల నుంచి కొనుగోలు చేసే ప్రక్రియ కూడా ఇప్పటి వరకు పూర్తికాలేదు. మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసిన బియ్యాన్ని ఎంఎల్ఎస్ (మండల్ లెవల్ స్టాక్ పాయింట్లు) తరలించాలి. అక్కడి నుంచి రవాణా వాహనాల ద్వారా హాస్టల్స్‌కు చేరవేయాలి. కా నీ ఇప్పటి వరకు బియ్యం కొనుగోలు చేయడమే ఇంకా పూర్తికాలేదు. జిల్లాలో పరిస్థితి ఇదీ... జిల్లాలో 68 బీసీ వసతి గృహాల్లో 6,800 మంది విద్యార్థులు, కాలేజీ హాస్టల్స్ 26 ఉండగా అందులో 2,050 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరికి రోజుకు 400 నుంచి 500 గ్రాముల బియ్యాన్ని వండిపెట్టాలి. ఇందుకోసం నెలకు 750 క్వింటాళ్ల బియ్యం అవసరమని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. ఎస్సీ వసతి గృహాలు 121కు గాను 10, 500 మంది విద్యార్థులు, కాలేజీ హాస్టల్స్ 17 కుగాను 1650 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఈ విద్యార్థులకు రోజుకు 500 గ్రాముల నుంచి 600 గ్రామల బియ్యాన్ని వండిపెట్టాలి. ఇందుకు గాను నెలకు 1500 క్వింటాళ్ల బియ్యం అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇక ఎస్టీ వసతి గృహాలు 39 ఉన్నాయి. దీంట్లో 10 వేల మంది విద్యార్థులు, 10 కాలేజీ హాస్టల్స్‌లో 600 మంది, ఆశ్రమ పాఠశాలలు 11 ఉండగా 3 వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వారందరికీ రోజుకు 500 గ్రామలు చొప్పున బియ్యాన్ని వండిపెట్టాలి. దీనికిగాను నెలకు రెండు వేల క్వింటాళ్ల బియ్యం అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇవిగాక రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఉన్నాయి. అరొకర బియ్యం సేకరణ జనవరి నెలకు గాను సంక్షేమ వసతి గృహలకు మొత్తం 18 వందల టన్నుల బియ్యం సేకరించాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకు కేవలం 2 వందల టన్నుల బియ్యం మాత్రమే సేకరించారు. ప్రభుత్వం కిలో రూ.32ల చొప్పున రైస్ మిల్లర్లకు చెల్లించి కొనుగోలు చేస్తుంది. మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసే బాధ్యత జిల్లా పౌరసరఫరాల శాఖ పైనే ఉంది. ఆ బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించి అక్కడి నుంచి హాస్టల్స్‌కు పంపిణీ చేసే బాధ్యత డీఎం సివిల్ సప్లయ్నే ఉంది. కానీ ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో బియ్యం కొనుగోలు చేయకపోవడంతో సంక్షేమ అధికారులు ఏటూ తేల్చుకోలే కపోతున్నారు. ఇక్కడ మరో విషయమేమంటే సన్న బియ్యాన్ని తరలించడానికి కంటే ముందే హాస్టల్స్‌లో ఉన్న దొడ్డు బియ్యాన్ని సమీ పంలోఉన్న ఎంఎల్ఎస్ పాయింట్లకు అప్పగించాలని వార్డెన్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేయడం గ మనార్హం. పక్కదారి పట్టకుండా... దొడ్డు బియ్యాన్నే పక్కదారి పట్టించిన ఘనులు సంక్షేమ శాఖల్లో ఉన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చిన బియ్యాన్ని వార్డెన్లు మొత్తం తీసుకెళ్లకుండా కొంత బియ్యాన్ని గోదాముల్లోనే నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్‌కు తరలించిన సంఘటనలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సన్నబియ్యం విషయంలో పకడ్బందీ నిఘా లేకపోతే వార్డెన్లు మరింత రెచ్చిపోయే అస్కారం ఉందని సివిల్ సప్లయ్ అధికారులే పేర్కొంటున్నారు. అలా కాకుండా ఆర్డీఓలు, తహసీల్దార్లు, బియ్యం రవాణాపై నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించిన బియ్యాన్ని హాస్టల్స్ వరకు చేరేవే సేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇది ఏమేరకు సత్ఫలితాలు సాధిస్తుందో వేచిచూడాల్సిందే.