సాక్షి, విజయనగరం : పేదలకు పౌరసరఫరాల వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ దిశగా చర్యలు మొదలు పెట్టింది. ఈ ఏడాది ధాన్యం కొనుగోలు సమయంలో నాణ్యమైన బియ్యం సేకరణపై దృష్టి పెట్టింది. ధాన్యం రకాల వారీగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని స్పాన్టెక్స్ మిల్లుల్లో మాత్రమే మరపట్టేలా చర్యలు తీసుకుంటోంది.
ఏప్రిల్ నెల నుంచి వలంటీర్ల ద్వారా ఇంటింటికి నాణ్యమైన బియ్యం సరఫరా చేయాల్సి ఉండడంతో ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోలులో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖరీఫ్‌లో పండిన వరి పంటను రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రతి ఏడాదీ నవంబర్ నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి పంట ప్రస్తుతం పొలాల్లో ఉంది. మరో నెలరోజుల్లో కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు మేరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముందస్తు కసరత్తు ప్రారంభించారు.
రకాల వారీగా ధాన్యం కొనుగోలు
ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలన్న నిర్ణయాన్ని సెప్టెంబరు నెల నుంచి శ్రీకాకుళం జిల్లాలో అమలు చేశారు. విజయనగరం జిల్లాతోపాటు రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కూడా వచ్చే ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని యోచిస్తున్నారు. అప్పటికి నాణ్యమైన బియ్యం సిద్ధం చేయాలని సర్కారు అధికారులను ఆదేశించింది. ఈ ఏడాది ఖరీఫ్, రబీలో సేకరించే ధాన్యం కొనుగోలులో క్వాలిటీపై అధికారులు దృష్టి పెట్టారు. ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు అన్ని రకాలు కలిపి కొనేసి ఒకేచోట నిల్వ చేసి మిల్లులకు పంపించేయకుండా రకాల ఆధారంగా విభజించి మిల్లులకు పంపించి మిల్లింగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే సన్న రకాలు, సాధారణ రకాల ధాన్యం వేర్వేరుగా కొనుగోలు చేయడంతోపాటు, గ్రేడ్–ఎ, సాధారణ రకాలను గుర్తిస్తారు. మంచి రకాలను రేషన్‌కార్డు లబ్ధిదారులకు సరఫరా చేస్తారు. మిగతా రకం ఎఫ్‌సీఐ, ఇతర అవసరాలకు తరలిస్తారు.
స్పాన్టెక్స్ మిల్లుల్లోనే మిల్లింగ్
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని నాణ్యమైన బియ్యంగా మార్చాలంటే స్పాన్టెక్స్ మిల్లుల్లోనే మరాడించాలి. ఇక్కడ మిల్లింగ్ చేయడం వల్ల నూకలు తక్కువగా ఉండటమే గాకుండా సన్నరకం బియ్యం సిద్ధమవుతాయి. ఈ బియ్యం తినడానికి అనుకూలంగా ఉంటుంది. జిల్లాలో ఆ స్థాయిలో స్పాన్టెక్స్ మిల్లులు లేవు. సుమారు 200 రైస్ మిల్లులుండగా ప్రస్తుతం అందులో ఆరు మాత్రమే ఉన్నాయి. మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం మరపట్టి క్వాలిటీగా ఇవ్వాలంటే యంత్రాలు మార్పు చేయడం అనివార్యం. ఎవరైనా బిగించకుంటే వారికి ధాన్యం ఇవ్వకూడదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చినా అక్కడి నుంచి వచ్చే బియ్యాన్ని ప్రజలకు సరఫరా చేయకుండా ఎఫ్‌సీఐకు ఇచ్చేలా యోచిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు శుక్రవారమే చర్చించారు.
ప్యాకింగ్ యంత్రాలకోసం టెండర్
బియ్యాన్ని అందంగా ప్యాక్ చేసేందుకు అవసరమైన యూనిట్లు నెలకొల్పుకునేవారికోసం ప్రత్యేకంగా ఈ నెల 16వ తేదీన జిల్లా అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో దీనికి సంబంధించిన విధి విధానాలను వెల్లడిస్తారు. మొత్తమ్మీద జిల్లా యంత్రాంగం వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment