Civil Supply department
-
దళారీ వ్యవస్థ లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాం
-
67.85 లక్షల మందికి బియ్యం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 67.85 లక్షల మందికి రేషన్ పంపిణీ చేశామని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ లబ్ధిదారులకు 2 లక్షల 56 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశామని పేర్కొన్నారు. రైతుల నుంచి 39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. యాసంగిలో 58 శాతం ధాన్యం కొనుగోలు చేశామని.. మహబూబ్‌నగర్, నల్గొండలో 90 శాతం ధాన్యం కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. మూడు రోజుల్లోపు ధాన్యం కొనుగోలు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. లాక్ డౌన్ లో కూడా 8 కోట్ల 14 లక్షల గన్నీ సంచులు సమకూర్చుకున్నామని తెలిపారు. -
రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడ్డాక ఐదేళ్లలో ధాన్యం కొనుగోళ్లు 318 శాతం పెరిగాయని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఆయన బుధవారం వరి ధాన్యం విక్రయంపై రైతుల అవగాహన కోసం రూపొందించిన కరపత్రాన్ని కమిషనర్ అకున్ సబర్వాల్‌తో కలిసి విడుదల చేశారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు కోటి మెట్రిక్ టన్నులు దాటనుందని అంచనా వేశారు. ఖరీఫ్‌లో 60 లక్షలు, రబీలో 40 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అధిక విస్తీర్ణంలో వరిసాగైనందున అందకు తగ్గట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా 3327 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ కేంద్రానికి ఒక ఏఈఓను ఇన్చార్జిగా నియమించి, కొనుగోళ్లను పర్యవేక్షించేందుకు పౌరసరఫరాల శాఖలో మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక, వ్యవసాయ శాఖ భాగస్వామ్యంతో తొలిసారి సమన్వయ కమిటీని నియమించినట్లు వెల్లడించారు. రైతులకు ఏమైనా ఫిర్యాదులుంటే టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి విషయాలు తెలుసుకోవచ్చని సూచించారు. -
ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం
సాక్షి, కరీంనగర్ : ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొత్తం 170 కొనుగోలు కేంద్రాలను ఈ నెలాఖరు వరకు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. సింగిల్‌విండో ఆధ్వర్యంలో 104, ఐకేపీ 50, డీసీఎంస్ 15, మెప్మా ఆధ్వర్యంలో ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లలో గతంలో తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు ప్రస్తుత సీజన్ నుంచి కొత్త నిబంధనల అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేశారు. ధాన్యం రవాణా, పర్యవేక్షణ, కనీస మద్దతు ధర, వివిధ శాఖల సమన్వయం కోసం ఈ కమిటీ పనిచేస్తుంది. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీలో జిల్లా పోలీస్ కమిషనర్, జిల్లా లేబర్ ఆఫీసరు, లీడ్‌బ్యాంకు మేనేజరు సభ్యులుగా ఉంటారు. ధరణిపైనే భారం... ధాన్యం కొనుగోళ్లలో కీలకపాత్ర పోషించిన వీఆర్వోలను తప్పించి కొత్తగా ఏఈవోలకు బాధ్యతలు అప్పగించారు. గతంలో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లాలంటే ఆయా గ్రామాల వీఆర్వోలు సంబంధిత పంట ఎంత పండించారంటూ నిర్ధారణ చేసి ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ప్రస్తుతం ధరణి వెబ్‌సైట్‌ను సహకార సంఘాలు, ఐకేపీ సంఘాలకు లింకేజీ చేయడంతో సంబంధిత రైతుల వివరాలన్నింటిని ఏఈవోలు సమగ్రంగా పరిశీలిస్తారు. రైతులు తెచ్చిన ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేస్తారు. నెలాఖరులో ప్రారంభం.. జిల్లాలో నెలకొన్న వర్షభావ పరిస్థితుల దృష్ట్యా ఖరీఫ్ వరినాట్లు ఆలస్యమయ్యాయి. జూన్‌లో నాట్లు వేసినట్లయితే ఈ నెల మొదటివారంలో వరిపంట కోతకు వచ్చినట్లయితే ధాన్యం సేకరణ ప్రారంభించేవాళ్లు. ఆగస్టు నెలాఖరు వరకు వరినాట్లు వేయడంతో పంట దిగుబడి వచ్చేందుకు ఈ నెలాఖరు వరకు అవకాశముంది. ప్రస్తుత ఖరీఫ్‌లో హుజూరాబాద్, గన్నేరువరం, మానకొండూరు, తిమ్మాపూర్, చిగురుమామిడి, వీణవంక, సైదాపూర్, కొత్తపల్లి, కరీంనగర్ మండలాల్లో వరిపంట ఎక్కువగా సాగైంది. వరికోతలు ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో ఈ నెలాఖరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖరీఫ్‌లో 66,422 హెక్టార్లలో వరి సాగు కాగా.. 2.20 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.1835, సాధారణ రకానికి రూ.1815 చెల్లించనున్నారు. కౌలురైతులకు ఇబ్బంది.. ధాన్యం కొనుగోళ్లలోని కొత్త నిబంధనలతో కౌలురైతులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు తమకున్న కొద్దిపాటి భూమి తోపాటు ఇతర భూమిని కౌలుకు తీసుకుని పం టలు పండిస్తున్నారు. కౌలురైతులు పండించిన ధాన్యం కేంద్రాలకు తీసుకొచ్చినప్పుడు అసలైన రైతుల వివరాలే ధరణి వెబ్సైట్లో ఉంటాయి. ఈ రైతుల పేరిటనే ధాన్యం విక్రయించడంతోపాటు డబ్బులు సైతం వారి బ్యాంకు ఖాతాల్లోనే జమయ్యే అవకాశం ఉండడంతో కౌలురైతులు కేంద్రాలకు వచ్చేందుకు వెనుకంజ వేస్తారని అధికారులు పేర్కొంటున్నారు. -
ఇక నాణ్యమైన బియ్యం సరఫరా
సాక్షి, విజయనగరం : పేదలకు పౌరసరఫరాల వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ దిశగా చర్యలు మొదలు పెట్టింది. ఈ ఏడాది ధాన్యం కొనుగోలు సమయంలో నాణ్యమైన బియ్యం సేకరణపై దృష్టి పెట్టింది. ధాన్యం రకాల వారీగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని స్పాన్టెక్స్ మిల్లుల్లో మాత్రమే మరపట్టేలా చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్ నెల నుంచి వలంటీర్ల ద్వారా ఇంటింటికి నాణ్యమైన బియ్యం సరఫరా చేయాల్సి ఉండడంతో ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోలులో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖరీఫ్‌లో పండిన వరి పంటను రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రతి ఏడాదీ నవంబర్ నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి పంట ప్రస్తుతం పొలాల్లో ఉంది. మరో నెలరోజుల్లో కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు మేరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముందస్తు కసరత్తు ప్రారంభించారు. రకాల వారీగా ధాన్యం కొనుగోలు ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలన్న నిర్ణయాన్ని సెప్టెంబరు నెల నుంచి శ్రీకాకుళం జిల్లాలో అమలు చేశారు. విజయనగరం జిల్లాతోపాటు రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కూడా వచ్చే ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని యోచిస్తున్నారు. అప్పటికి నాణ్యమైన బియ్యం సిద్ధం చేయాలని సర్కారు అధికారులను ఆదేశించింది. ఈ ఏడాది ఖరీఫ్, రబీలో సేకరించే ధాన్యం కొనుగోలులో క్వాలిటీపై అధికారులు దృష్టి పెట్టారు. ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు అన్ని రకాలు కలిపి కొనేసి ఒకేచోట నిల్వ చేసి మిల్లులకు పంపించేయకుండా రకాల ఆధారంగా విభజించి మిల్లులకు పంపించి మిల్లింగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే సన్న రకాలు, సాధారణ రకాల ధాన్యం వేర్వేరుగా కొనుగోలు చేయడంతోపాటు, గ్రేడ్–ఎ, సాధారణ రకాలను గుర్తిస్తారు. మంచి రకాలను రేషన్‌కార్డు లబ్ధిదారులకు సరఫరా చేస్తారు. మిగతా రకం ఎఫ్‌సీఐ, ఇతర అవసరాలకు తరలిస్తారు. స్పాన్టెక్స్ మిల్లుల్లోనే మిల్లింగ్ కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని నాణ్యమైన బియ్యంగా మార్చాలంటే స్పాన్టెక్స్ మిల్లుల్లోనే మరాడించాలి. ఇక్కడ మిల్లింగ్ చేయడం వల్ల నూకలు తక్కువగా ఉండటమే గాకుండా సన్నరకం బియ్యం సిద్ధమవుతాయి. ఈ బియ్యం తినడానికి అనుకూలంగా ఉంటుంది. జిల్లాలో ఆ స్థాయిలో స్పాన్టెక్స్ మిల్లులు లేవు. సుమారు 200 రైస్ మిల్లులుండగా ప్రస్తుతం అందులో ఆరు మాత్రమే ఉన్నాయి. మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం మరపట్టి క్వాలిటీగా ఇవ్వాలంటే యంత్రాలు మార్పు చేయడం అనివార్యం. ఎవరైనా బిగించకుంటే వారికి ధాన్యం ఇవ్వకూడదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చినా అక్కడి నుంచి వచ్చే బియ్యాన్ని ప్రజలకు సరఫరా చేయకుండా ఎఫ్సీఐకు ఇచ్చేలా యోచిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు శుక్రవారమే చర్చించారు. ప్యాకింగ్ యంత్రాలకోసం టెండర్ బియ్యాన్ని అందంగా ప్యాక్ చేసేందుకు అవసరమైన యూనిట్లు నెలకొల్పుకునేవారికోసం ప్రత్యేకంగా ఈ నెల 16వ తేదీన జిల్లా అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో దీనికి సంబంధించిన విధి విధానాలను వెల్లడిస్తారు. మొత్తమ్మీద జిల్లా యంత్రాంగం వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. -
పక్కదారి పడుతున్న గృహావసర సిలిండర్లు
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో ‘డెమెస్టిక్’ గ్యాస్ సిలిండర్ల దందా కమర్షియల్‌గా సాగుతోంది. గృహావసరాలకు వినియోగించే(డొమెస్టిక్) సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు యథేచ్ఛగా పక్కదారి పడుతున్నాయి. ఈ వ్యాపారం ప్రధానంగా నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూర్, బోధన్ లాంటి పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా జోరుగా నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లలో, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లలో ఇంటి సిలిండర్లను దొంగచాటున వినియోగిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుండడంతో పాటు కొంత మంది ఏజెన్సీదారులకు తెరచాటున ఇదొక వ్యాపారంగా మారిపోయింది. అయితే డొమెస్టిక్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా నిరంతరంగా తనిఖీలు చేయాల్సిన సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల కాలంలో తనిఖీలు చేయడం మానేశారు. ఎప్పుడో ఒకసారి తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర వ్యాపారాలకు కమర్షియల్ సిలిండర్లు మాత్రమే వినియోగించాలని ప్రభుత్వ నిబంధనలున్నాయి. అయితే చాలామట్టుకు ఆ నిబంధనలను పాటించడం లేదు. ఎందుకంటే 19 కిలోలు గల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రసుతం రూ.1400 వరకు ఉంది. అదే గృహావసరాలకు వినియోగించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ 14.6 కిలోలు ఉండి దాని విలువ రూ.670 వరకు ఉంది. ఈ లెక్కన కమర్షియల్ సిలిండర్‌కు వెచ్చించే డబ్బులతో రెండు డొమెస్టిక్ సిలిండర్లు కొనుగోలు చేయవచ్చు. గ్యాస్ కూడా ఎక్కువగా వస్తుంది. దీంతో హోటళ్లలో, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల నిర్వాహకులు ఇది తప్పని తెలిసినా డొమెస్టిక్ గ్యాస్‌ను వినియోగించడానికి వక్ర మార్గాన్ని ఆచరిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలను మచ్చిక చేసుకుని డొమెస్టిక్ సిలిండర్లను సబ్సిడీ లేకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇటు గ్యాస్ ఏజెన్సీలకు కూడా ఒక్కో సిలిండర్‌పై రూ.200 వరకు లాభం రావడంతో ‘డొమెస్టిక్’ దందా ‘మూడు పువ్వులు, ఆరు కాయలు’గా మారింది. ఇటు సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏజెన్సీలతో మిలాఖత్ అయ్యారనే ఆరోపణలున్నాయి. అందుకే వీరి డొమెస్టిక్ దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. తనిఖీలు అంతంతే... హోటల్లో డొమెస్టిక్ సిలిండర్లను పట్టుకున్న సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు(ఫైల్) జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సింగిల్ కనెక్షన్లు సుమారు 2లక్షల 7వేల వరకున్నాయి. డబుల్ కనెక్షన్లు లక్షా 19వేల వరకు, దీపం కనెక్షన్లు 79వేల వరకు, సీఎస్ఆర్ కనెక్షన్లు 28,500 వరకు ఉన్నాయి. సిలిండర్లను సరఫరా చేసేందుకు ఇండియన్, హెచ్‌పీ, భారత్ కలిపి గ్యాస్ ఏజెన్సీలు 35 వరకు ఉన్నాయి. అయితే కమర్షియల్ సిలిండర్లు మాత్రం 3,400 వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా అంతటా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు, టిఫిన్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లు హోటళ్ల సామర్థ్యం ఆధారంగా వారం ఒకటి నుంచి రెండు, మరి కొన్నింటిలో నెలకు ఐదు వరకు వినియోగం అవుతున్నాయి. ఒక కమర్షియల్ సిలిండర్‌పై వెళ్లదీయడం సాధ్యం కాని పని. ఈ సందర్భంగా డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్నారు. కార్లు, ఇతర వాహనాల్లో కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఎక్కిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా గృహావసరాలకు వినియోగించే సిలిండర్లు పక్కదారి పడుతున్నా అధికారులు మాత్రం ‘మామూలు’గానే తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. -
ఇదో ఒప్పంద దందా!
సాక్షి,సిటీబ్యూరో: ప్రజా పంపిణీ వ్యవస్థకు కేటాయించిన పేదల బియ్యం పక్కదారి పడుతూనే ఉన్నాయి. దీన్ని అరికట్టేందుకు, పకడ్బందిగా రేషన్ సరుకులు పేదలకు చేరేందుకు ప్రభుత్వ చౌకధరల దుకాణల్లో ఈ–పాస్ (వేలిముద్ర) విధానం అమల్లోకి తెచ్చారు. సరుకులు డ్రా చేయకున్నా ‘రేషన్ కార్డు’ రద్దవదన్న వెసులు బాటుతో కొందరు లబ్ధిదారులు సరుకులకు దూరంగా ఉంటున్నారు. సరుకులు తీసుకోకుండే ఆ మేరకు స్టాక్ మిగిలినట్టు రికార్డు అవుతుంది. అయినప్పటికీ కొందరు దుకాణదారులు క్వింటాళ్ల కొద్దీ బియ్యం అక్రమంగా బయటికి తరలించేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం రూ.50కి పైగా ఉండగా.. సబ్సిడీ బియ్యం రూ.1కే దొరుకుతున్నాయి. దీంతో డీలర్లే సరుకులు తీసుకోని లబ్ధిదారుకుల కొంత మొత్తం ఆశ చూపి వారి బియ్యాన్ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మధ్య తరగతి దూరమే.. గ్రేటర్లో సగానికి పైగా మధ్య తరగతి కుటుంబాలు ఆహార భద్రత కార్డుదారులు ఉన్నా రేషన్ బియ్యం తీసుకునేందుకు పెద్దగా ఆశక్తి చూపడం లేదు. కార్డు బహుళ ప్రయోజనకారిగా మాత్రమే వినియోగిస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి ఆరు కిలోల చొప్పున ఎంత మంది ఉంటే అన్ని కిలోల బియ్యం కేటాయిస్తోంది. అయితే, వీటిని లబ్ధిదారులు తీసుకోకపోవడంతో అవి డీలర్ల వద్దే ఉండిపోతున్నాయి. ఇలాంటివి మిగులుగా స్టాక్‌లో చూపించాలి. కానీ ఆహార భద్రత లబ్ధిదారుల్లో కొందరు బియ్యానికి బదులు నగదు తీసుకుంటున్నట్టు సమాచారం. డీలర్లు కిలో రూ. 10 చొప్పున లెక్క కట్టి లబ్ధిదారులకు ఇచ్చేస్తున్నారు. ప్రతినెలా రేషన్ షాపునకు వచ్చి ఈ–పాస్‌లో వేలిముద్ర ఇస్తే నగదు ఇచ్చేస్తామని లబ్ధిదారులకు ఆఫర్ ఇవ్వడం సర్వసాధారణమైంది. ఉదాహరణకు ఓ కుటుంబంలో భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలు ఉంటే ఐదుగురికి ప్రతి నెలా 30 కిలోల బియ్యం కేటాయిస్తున్నారు. వాటిని డీలర్‌కు ఇచ్చేస్తే రూ.300 లబ్ధిదారులకు అందుతోంది. దాంతో రేషన్ బియ్యం తినని లబ్ధిదారులు ఇటువైపు మొగ్గుచూపుతున్నారు. దుకాణాలకు రాకుండానే.. ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా లెవీ కింద రైస్ మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేస్తోంది. ఎఫ్‌సీఐ నుంచి స్టేజ్–1 గుత్తేదారులు ద్వారా సివిల్ సప్లయిస్ గోదాములకు, అక్కడి నుంచి స్టేజ్–2 గుత్తేదారుల ద్వారా చౌకధరల దుకాణాలకు అందిస్తున్నారు. బియ్యం చేరవేసే క్రమంలో డీలర్లే రెగ్యులర్ ఒప్పంద లబ్ధిదారుల సంఖ్యను బట్టి ఆమేరకు బియ్యాన్ని దారి మళ్లిస్తున్నట్టు అధికారులు తేల్చారు. -
ఐరిస్ ఆరంభమెప్పుడో..
మెదక్ అర్బన్: రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు పౌర సరఫరాల శాఖ బయోమెట్రిక్ విధానాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ విధానంలో చాలా మంది వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరిస్ పద్ధతిలో రేషన్ సరుకులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ జిల్లాకు ఇప్పటి వరకు ఐరిస్ యంత్రాలు చేరకపోవడంతో ఈ వి«ధానం అమలుకు నోచుకోవడం లేదు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో మొత్తం 521 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా 2.11 లక్షలకు పైగా లబ్ధిదారులు ప్రతి నెలా రేషన్ బియ్యం, కిరోసిన్‌ను తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం బయోమెట్రిక్ విధానం ద్వా రా లబ్ధిదారుల వేలిముద్రలను తీసుకొని రేషన్ బియ్యం, కిరోసిన్, సరుకులు అందిస్తున్నారు. చాలా మంది వేలిముద్రలు పడకపోవడంతో సరుకుల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, కూలీల వేలిముద్రలు రావడం లేదు. దీంతో రెవెన్యూ సిబ్బంది వేలిముద్రల ఆధారంగా వారికి సరుకులను అందించాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఐరిస్ ద్వారా సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ విధానంపై ఆగస్టు నెలలోనే డీలర్లకు శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. కానీ శిక్షణ ఇచ్చి ఆరునెలలు గడుస్తున్నా ఐరిష్ విధానాన్ని అమలు చేయడం లేదు. అక్రమాలకు అడ్డుకట్ట.. రేషన్ దుకాణాలలో జరుగుతున్న అక్రమాలను అ రికట్టడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుం టోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ పోర్టల్ అ స్సెన్స్ సర్వీసెస్ (ఈ–పాస్)ను ప్రవేశపెట్టింది. ఈ విధానంలో లబ్ధిదారుల వేలిముద్రలను తీసుకొని సరుకులను పంపిణీ చేస్తారు. ఈ విధానం అ మలులో లేనప్పుడు రేషన్ సరుకులు తీసుకోవడానికి లబ్ధిదారులు రాకపోయినా వచ్చినట్లు చూపి రేషన్ డీలర్లు సరుకులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. ఈ–పాస్ విధానంతో అక్రమాలకు చెక్ పడింది. ఈ విధానంలో వేలిముద్రల సమస్య ఏర్పడటంతో దీన్ని అధిగమించడానికి ఈ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. తప్పని తిప్పలు.. ఐరిస్ విధానం అమలులో జరుగుతున్న జాప్యం తో వేలి ముద్రలు పడని వారికి ఇబ్బందులు తప్ప డం లేదు. వేలిముద్రలు పడని వారికి సరుకులు ఇ వ్వాలంటే వీఆర్వోల వేలిముద్రలు అవసరం. కా నీ పని ఒత్తిడి వల్ల వారు సకాలంలో రేషన్ దు కాణాలకు రాలేకపోతున్నారు. వేలిముద్రలు రాని వారు రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోం ది. ఒక్కోసారి సరుకులను కోల్పోవాల్సి వస్తోం ది. ఉన్నతాధికారులు స్పందించి ఐరిష్ విధానాన్ని అమలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. బియ్యం ఇవ్వడం లేదు మిషన్‌లో వేలిముద్ర పడకపోవడంతో మాకు అందాల్సిన రేషన్ బియ్యం, కిరోసిన్, సరుకులను ఇవ్వడం లేదు. వేలి ముద్ర ద్వారా సరుకులు అందించేందుకు వీఆర్ఓ ఎప్పుడు వస్తారో..? మాకు తెలియడం లేదు. వారు వచ్చినప్పుడు సరుకులు ఇస్తున్నారు. దీంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అర్హులమైనా రేషన్ సరుకులు అందకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. సర్కారు వెంటనే ఏదైనా కొత్త విధానం ద్వారా రేషన్ సరుకులు అందించి ఆదుకోవాలి. – శిర్న గోదావరి, వృద్ధురాలు, మెదక్ -
సమ్మర్ క్యాంపులకు బియ్యం ఇయ్యం!
సాక్షి, హైదరాబాద్ : గురుకుల సొసైటీలు సంకటంలో పడ్డాయి. సమ్మర్ క్యాంపు(వేసవి శిబి రం)లకు బియ్యం కోటా ఇవ్వలేమని పౌర సరఫరాలశాఖ తేల్చి చెప్పడంతో ఆందోళన చెందుతున్నాయి. గురుకుల విద్యాలయాల సొసైటీలు ఏటా సమ్మర్ క్యాంపుల్లో భాగంగా గురు కుల పాఠశాలల్లోని చురుకైన విద్యార్థులకు పలు కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వ హిస్తాయి. క్రీడలు, నృత్యాలతోపాటు సబ్జెక్ట్‌కు సంబంధించి అవగాహన, భావ వ్యక్తీకరణ నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటికి రోజంతా సమ యం పడుతుండడంతో విద్యార్థులకు వసతితోపాటు భోజన సదుపాయాన్ని కూడా గురుకుల సొసైటీలే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా బియ్యం కోటా ఇవ్వాలని గురుకుల సొసైటీలు కోరగా ఇవ్వలేమని పౌర సరఫరాల శాఖ తేల్చి చెప్పింది. -
ముక్కిపోయి మూడేళ్లు!
నేలకొండపల్లి : అక్రమార్కులు తరలిస్తున్న బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.. సివిల్ సప్లై గోడౌన్లో నిల్వ చేశారు.. ఆ తర్వాత కన్నెత్తి చూడలేదు.. మూడేళ్లు గడిచింది.. బియ్యం ముక్కిపోయి.. తుట్టెలుపట్టి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేలకొండపల్లి ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా.. అధికారులు మూడేళ్ల క్రితం పట్టుకున్నారు. 23 టన్నుల(232 క్వింటాళ్లు) బియ్యాన్ని స్థానిక గోడౌన్లో నిల్వ చేశారు. ఆ తర్వాత అధికారులు అటువైపు వెళ్లలేదు. బియ్యానికి పురుగులు పట్టి ముక్కిపోయాయి. ఆ పురుగులన్నీ గోడౌన్ పక్కనే ఉన్న బాలికల వసతి గృహంలోకి ప్రవేశించి విద్యార్థినులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గోడౌన్లలో పనిచేసే హమాలీలు కూడా పురుగుల వాసనతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని హమాలీలు పలుమార్లు సివిల్ సప్లై అధికారులకు తెలియజేసినా.. పట్టించుకునేవారు కరువయ్యారు. దాదాపు 232 క్వింటాళ్ల బియ్యం మట్టిపాలు కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లా.. పట్టుకున్న బియ్యాన్ని ఇక్కడి నుంచి తరలించాలని గతంలోనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. బియ్యం పురుగుపట్టి.. దుర్వాసన వస్తుందని చెప్పాను. అధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటాం. – రామచందర్‌రావు, సివిల్ సప్లై గోడౌన్ ఇన్చార్జ్, నేలకొండపల్లి చర్య తీసుకోవాలి.. పేదల బియ్యం అంటే అంత నిర్లక్ష్యమా. లక్షలాది రూపాయలు విలువ చేసే బియ్యం పనికిరాకుండా చేసిన అధికారులపై చర్య తీసుకోవాలి. వారి జీతాల నుంచి రికవరీ చేయాలి. పేదల సొమ్మంటే లెక్కలేదు. – కాశిబోయిన అయోధ్య, వ్యవసాయ కార్మికుడు -
ఏసీబీకి పట్టుబడ్డ సివిల్ సప్లై ఏజీఎమ్
సివిల్ సప్లై శాఖలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. స్టేజ్2 కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పౌరసరఫరాల శాఖకు ‘స్కోచ్’ అవార్డులు
హైదరాబాద్: అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో తెలంగాణ పౌర సరఫరాల శాఖ అమలు చేస్తున్న ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. సరుకులు దారి మళ్లకుండా చూసేందుకు, రైతులకు మద్దతు ధర అందించేందుకు ఈ శాఖ అమలు చేస్తున్న ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్), ఈ-పీడీఎస్, ఎస్సిఎమ్ (సప్లయ్ చైన్ మేనేజ్మెంట్), ఒపీఎంఎస్ (ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ), ఫిర్యాదుల పరిష్కారం వంటి అయిదు ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డులకు ఎంపికయ్యాయి. దేశ వ్యాప్తంగా ఈ అవార్డుకు ఎంపికైన వంద ప్రాజెక్టుల్లో ఈ అయిదు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. హెచ్ఐసీసీలో గురువారం జరిగిన 45వ జాతీయ స్కోచ్ సమ్మిట్‌లో ఈ అవార్డులను శాఖల తరపున జాయింట్ డెరైక్టర్ ఏసురత్నం స్వీకరించారు. సాంకేతికతతో అక్రమాలకు అడ్డుకట్ట ఈ-పాస్ విధానం గ్రేటర్ హైదరాబాద్‌లోని 1545 రేషన్ షాపుల్లో అమలవుతుండగా, సరుకుల్లో 30శాతం మిగులు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపులకు ప్రతినెలా పంపే సరుకుల వివరాలు నమోదు చేయడానికి ఈ-పీడీఎస్, సరుకులు పక్కదారి పట్టకుండా ఎంఎల్ఎస్ పాయింట్లు, గోదాములు, రేషన్ షాపులను ఎస్సీఎం ద్వారా ఆన్‌లైన్‌కు అనుసంధానించారు. ఒపిఎంఎస్ ద్వారా రైతులకు మద్దతు ధర అందించడమే కాకుండా, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే వారికి చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖలో అక్రమాలకు సాంకేతికతతోనే అడ్డుకట్ట వేస్తామని కమిషనర్ సి.వి.ఆనంద్ తెలిపారు. దీని కోసం ఐటీని మరింతగా విస్తరిస్తామని చెప్పారు. ఈ అవార్డులు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
పౌరసరఫరాల శాఖలో మితిమీరిన అవినీతి
- డీలర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవరావు అనంతపురం అర్బన్ : పౌర సరఫరాల శాఖలో అవినీతి ‘అధికార’ స్థాయిలో ఉందని, మొదట అక్కడి నుంచి ప్రక్షాళన చేపట్టాలని స్టోర్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలా మాధవరావు అన్నారు. ఆదివారం అనంతపురంలో జరిగిన డీలర్ల సంఘం రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 29 వేల మంది డీలర్లు ఉన్నారని, ఈ వ్యవస్థలో అవినీతి లేకుండా చేస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే అవినీతి రహితమనేది పై నుంచి కింది స్థాయి వరకు ఉండాలన్నారు. అలాంటి పరిస్థితి ఏపీ పౌరసరఫరాల శాకలో లేదని, అధికారుల స్థాయిలోనే మితిమీరిన అవినీతి జరుగుతోందని చెప్పారు. -
పౌర సరఫరాల శాఖ సేవలకు ఉత్తమ అవార్డు
* త్రివేండ్రంలో పురస్కారం అందుకున్న కమిషనర్ పార్థసారథి సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు గానూ తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు ఉత్తమ ‘ఈ-ఇండియా గవర్నమెంట్ టు సిటిజన్’ అవార్డు లభించింది. శనివారం కేరళలోని త్రివేండ్రంలో జరిగిన ఈ-ఇండియా గవర్నెన్స్ సదస్సులో పౌర సరఫరాల శాఖ తరఫున కమిషనర్ సి.పార్థసారథి, సీఆర్ఓ ఎం.పద్మ, ఎన్ఐసీ టెక్నికల్ డెరైక్టర్ జి.శివాజీ ఈ అవార్డును అందుకున్నారు. జాతీయ స్థాయిలో పౌర సరఫరాలశాఖ ఇలాంటి అవార్డు అందుకోవడం ఇది రెండోసారి. గతంలోనూ ఉత్తమ ఈ-పీడీఎస్ విధానానికి గానూ పౌరసరఫరాల శాఖ జాతీయ అవార్డును అందుకుంది. రాష్ట్రంలో ఆధార్‌కు ఈ-పీడీఎస్‌ను అనుసంధానించడం ద్వారా ఇప్పటికే 11.71 లక్షల బోగస్ రేషన్ కార్డులను ఏరివేశారు. దీనిద్వారా 24,093 మెట్రిక్ టన్నుల బియ్యం, 7,406 కిలో లీటర్ల కిరోసిన్‌ను ఆదా చేయగలిగారు. -
‘మాయ’దారి రిమోట్ల స్వాధీనం
* దిగొచ్చిన పెట్రోల్ బంకుల యజమానులు * గవర్నర్ తక్షణ జోక్యంతో సమ్మె విరమణ * ఫిల్లింగ్ మిషన్లు మార్చేందుకూ హామీ సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంకుల యజమానులు సమ్మె విరమించారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీల పేరుతో వేధిస్తున్నారంటూ బంకుల యజమానులు ఆదివారం ఆకస్మికంగా బంద్‌కు దిగిన సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నానికల్లా తామంతట తామే సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారులను పెట్రోల్ కొలతల్లో మోసగిస్తున్న రిమోట్లను తక్షణమే స్వాధీనం చేయడంతోపాటు ప్రభుత్వ ఆమోదం లేని డిస్పెన్సింగ్ యూనిట్లను సైతం మార్చివేస్తామని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ అధ్యక్షుడు ఎం.ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి అన్వర్ పటేల్‌లు రాష్ట్ర తూనికల కొలతల శాఖ కంట్రోలర్ గోపాల్‌రెడ్డికి లిఖితపూర్వక హామీ ఇచ్చారు. యూనిట్ల మార్పుకు కొద్దిగా గడువు కావాలని వారు కోరడంతో అధికారులు అంగీకరించారు. మోసాలకు పాల్పడుతున్న బంకులపై తూనికలు, కొలతల శాఖ దాడులు చేస్తుండటంతో యజమానులు ఆదివారం మధ్యాహ్నం నుంచి మెరుపు సమ్మెకు దిగారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా బంకులను మూసివేసి వినియోగదారులను ఇబ్బందులకు గురిచేయడాన్ని గవర్నర్ నరసింహన్ తీవ్రంగా పరిగణించారు. సోమవారం ఉదయమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి తక్షణమే వారు సమ్మె విరమించేలా చూడాలని, వారు దిగిరాకపోతే లెసైన్స్‌లు రద్దు చేసి పౌర సరఫరాలశాఖకు అప్పగించాలని మౌఖిక ఆదేశాలిచ్చారు. మరోవైపు డీలర్ల సంఘం ప్రతినిధులు తమ సమ్మెకు కారణాలు వివరించేందుకు తూనికలు, కొలతల శాఖ కార్యాలయానికొచ్చారు. ప్రభుత్వ ఆమోదం లేని రిమోట్లు, యూనిట్ల వినియోగం తక్షణమే మానుకోవాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని అధికారులు తేల్చి చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో డీలర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. అధికారుల దాడులతో మార్కెట్లో పరువుకోసం బంకులు బంద్ చేశామని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆయిల్ కంపెనీలే సరఫరా చేసినందువల్ల రిమోట్లను వినియోగించామని చెప్పారు. వినియోగదారులకు కలిగిన ఇబ్బందులకు విచారిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆమోదం లేని ఫిల్లింగ్ మిషన్, రిమోట్ వినియోగం చట్టవిరుద్ధమని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ గోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పెట్రోల్ బంకులపై దాడులు చేశామని, 86 బంకులపై కేసులు నమోదు చేసి 510 నాజిల్స్ను సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంకుల్లో పదిలీటర్ల ఆయిల్ పరిమాణాన్ని కొలిచేందుకు కొత్తగా వచ్చిన 3 ప్రత్యేక పాత్రలను ప్రదర్శించారు. కాగా సమ్మెకు దిగి వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన పెట్రోల్ బంకుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ నాయకత్వంలో పార్టీ ప్రతినిధులు సోమవారం గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు.