‘మాయ’దారి రిమోట్ల స్వాధీనం | Petroleum dealers in Andhra Pradesh call off strike move | Sakshi
Sakshi News home page

‘మాయ’దారి రిమోట్ల స్వాధీనం

Published Tue, Mar 4 2014 2:01 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

హైదరాబాద్‌లో సచివాలయం సమీపంలోని ప్రభుత్వ బంకు వద్ద పెట్రోలు కోసం బారులు తీరిన వాహనదారులు - Sakshi

హైదరాబాద్‌లో సచివాలయం సమీపంలోని ప్రభుత్వ బంకు వద్ద పెట్రోలు కోసం బారులు తీరిన వాహనదారులు

* దిగొచ్చిన పెట్రోల్ బంకుల యజమానులు
* గవర్నర్ తక్షణ జోక్యంతో సమ్మె విరమణ
* ఫిల్లింగ్ మిషన్లు మార్చేందుకూ హామీ
 
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంకుల యజమానులు సమ్మె విరమించారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీల పేరుతో వేధిస్తున్నారంటూ బంకుల యజమానులు ఆదివారం ఆకస్మికంగా బంద్‌కు దిగిన సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నానికల్లా తామంతట తామే సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారులను పెట్రోల్ కొలతల్లో మోసగిస్తున్న రిమోట్లను తక్షణమే స్వాధీనం చేయడంతోపాటు ప్రభుత్వ ఆమోదం లేని డిస్పెన్సింగ్ యూనిట్లను సైతం మార్చివేస్తామని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ అధ్యక్షుడు ఎం.ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి అన్వర్ పటేల్‌లు రాష్ట్ర తూనికల కొలతల శాఖ కంట్రోలర్ గోపాల్‌రెడ్డికి లిఖితపూర్వక హామీ ఇచ్చారు.

యూనిట్ల మార్పుకు కొద్దిగా గడువు కావాలని వారు కోరడంతో అధికారులు అంగీకరించారు. మోసాలకు పాల్పడుతున్న బంకులపై తూనికలు, కొలతల శాఖ దాడులు చేస్తుండటంతో యజమానులు ఆదివారం మధ్యాహ్నం నుంచి మెరుపు సమ్మెకు దిగారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా బంకులను మూసివేసి వినియోగదారులను ఇబ్బందులకు గురిచేయడాన్ని గవర్నర్ నరసింహన్ తీవ్రంగా పరిగణించారు. సోమవారం ఉదయమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి తక్షణమే వారు సమ్మె విరమించేలా చూడాలని, వారు దిగిరాకపోతే లెసైన్స్‌లు రద్దు చేసి పౌర సరఫరాలశాఖకు అప్పగించాలని మౌఖిక ఆదేశాలిచ్చారు.

మరోవైపు డీలర్ల సంఘం ప్రతినిధులు తమ సమ్మెకు కారణాలు వివరించేందుకు తూనికలు, కొలతల శాఖ కార్యాలయానికొచ్చారు. ప్రభుత్వ ఆమోదం లేని రిమోట్లు, యూనిట్ల వినియోగం తక్షణమే మానుకోవాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని అధికారులు తేల్చి చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో డీలర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. అధికారుల దాడులతో మార్కెట్‌లో పరువుకోసం బంకులు బంద్ చేశామని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆయిల్ కంపెనీలే సరఫరా చేసినందువల్ల రిమోట్లను వినియోగించామని చెప్పారు. వినియోగదారులకు కలిగిన ఇబ్బందులకు విచారిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆమోదం లేని ఫిల్లింగ్ మిషన్, రిమోట్ వినియోగం చట్టవిరుద్ధమని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ గోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పలు పెట్రోల్ బంకులపై దాడులు చేశామని, 86 బంకులపై కేసులు నమోదు చేసి 510 నాజిల్స్‌ను సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంకుల్లో పదిలీటర్ల ఆయిల్ పరిమాణాన్ని కొలిచేందుకు కొత్తగా వచ్చిన 3 ప్రత్యేక పాత్రలను ప్రదర్శించారు. కాగా  సమ్మెకు దిగి వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన పెట్రోల్ బంకుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ నాయకత్వంలో పార్టీ ప్రతినిధులు సోమవారం గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement