ముంబై: మహారాష్ట్ర రాజధానిలో ఇటీవల కుప్పకూలిన హోర్డింగ్ ప్రమాదం మరో కుటుంబంలో విషాదాన్ని నింపింది. అకాల వర్షాలు, ఈదురు గాలులతో ఘాట్‌కోపర్ వద్ద కూలిన బిల్ బోర్డ్ ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. తాజాగా శిథిలాలను తొలగిస్తుండగా మరో రెండు మృతుదేహాలు లభ్యమయ్యాయి.
రిటైర్డ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజర్ మనోజ్ చన్సోరియా(60), ఆయన భార్య అనిత(59)గా పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఒక కారులో వీరి మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
కాగా ముంబైలోని ఘాట్‌కోపవర్ వద్ద ఈదురుగాలులతో సుమారు 250 టన్నుల బరువున్న హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ పంప్‌పై కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు 100 మంది హోర్డింగ్ శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 16 మంది మృత్యువాత పడ్డారు. వారిలో ఈ వృద్ధ దంపతులు కూడా ఉన్నారు. మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ముంబయి ఏటీసీలో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేసిన చన్సోరియా.. రెండు నెలల క్రితమే మార్చిలో పదవీ విరమణ పొందారు. తర్వాత వారు ముంబైని వీడి, జబల్‌పుర్‌కు మారారు. వీసా పనుల నిమిత్తం వారు ముంబై వచ్చారు. పని పూర్తవడంతో జబల్‌పుర్‌కు తిరిగి ప్రయాణం చేస్తుండగా కారులో పెట్రోల్ కొట్టించేందుకు బంక్ వద్ద ఆగారు. ఆ సమయంలో హోర్డింగ్ రూపంలో మృత్యువు వారిని కబళించింది.
అమెరికాలో నివసిస్తున్న వారి కుమారుడు తల్లిదండ్రులకు కాల్ చేయగా.. సమాధానం రాకపోవడంతో సాయం కోసం బంధువులను సంప్రదించాడు. వారు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతుల మొబైల్ ఫోన్‌లను ట్రేస్ చేయగా చివరి లోకేషన్ ఘాట్‌కోపర్ పెట్రోల్ పంప్ వద్ద చూపించింది.
బందువులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శిథిలాలను తొలగించగా.. దంపతుల మృతదేహాలు వెలుగుచూశాయి. శిథిలాల నుండి అన్ని మృతదేహాలను బయటకు తీయడంతో ప్రస్తుతం సహాయక చర్యలు ముగిశాయి.
బృహన్ ముంబై కార్పొరేషన్ 40x40 అడుగుల కంటే పెద్ద హోర్డింగ్‌లను అనుమతించనప్పటికీ, ఈ హోర్డింగ్ మూడు రెట్లు పెద్దది. 120x120 అడుగుల విస్తీర్ణం, 250 టన్నుల బరువు కలిగి ఉంది. బిల్‌బోర్డ్‌ను ఏర్పాటు చేసిన అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని భవేష్ భిండేపై నేరపూరిత నరహత్య కేసు నమోదైంది. భిండేపై గతంలో అత్యాచారం సహా 20కి పైగా పోలీసు కేసులు ఉన్నట్లు తేలింది.
కాగా పెట్రోల్ పంప్ మీద కూలిన హోర్డింగ్‌కు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈదురుగాలులతో పెట్రోల్ పంప్ ముందు నెమ్మదిగా వెళ్తున్న ఓ కారులోనుంచి ఈ వీడియో రికార్డ్ చేశారు. రోడ్డుపై భారీ వర్షం, గాలులు వీస్తుండగా కారులోని విండో నుంచి వీడియో తీశారు. ఇంధనం కోసం, వర్షం నుంచి తప్పించుకోవడానికి అనేక కార్లు, ట్రక్కులు, బైక్‌లు పెట్రోల్ పంపు వద్ద నిలిపి ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో బిల్‌బోర్డ్ అమాంతం పెట్రోల్ బంక్‌పై కుప్పకూలింది.
Comments
Please login to add a commentAdd a comment