
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడ్డాక ఐదేళ్లలో ధాన్యం కొనుగోళ్లు 318 శాతం పెరిగాయని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఆయన బుధవారం వరి ధాన్యం విక్రయంపై రైతుల అవగాహన కోసం రూపొందించిన కరపత్రాన్ని కమిషనర్ అకున్ సబర్వాల్‌తో కలిసి విడుదల చేశారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు కోటి మెట్రిక్ టన్నులు దాటనుందని అంచనా వేశారు. ఖరీఫ్‌లో 60 లక్షలు, రబీలో 40 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో అధిక విస్తీర్ణంలో వరిసాగైనందున అందకు తగ్గట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా 3327 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ కేంద్రానికి ఒక ఏఈఓను ఇన్‌చార్జిగా నియమించి, కొనుగోళ్లను పర్యవేక్షించేందుకు పౌరసరఫరాల శాఖలో మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక, వ్యవసాయ శాఖ భాగస్వామ్యంతో తొలిసారి సమన్వయ కమిటీని నియమించినట్లు వెల్లడించారు. రైతులకు ఏమైనా ఫిర్యాదులుంటే టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి విషయాలు తెలుసుకోవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment