హైదరాబాద్: అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో తెలంగాణ పౌర సరఫరాల శాఖ అమలు చేస్తున్న ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. సరుకులు దారి మళ్లకుండా చూసేందుకు, రైతులకు మద్దతు ధర అందించేందుకు ఈ శాఖ అమలు చేస్తున్న ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్), ఈ-పీడీఎస్, ఎస్‌సిఎమ్ (సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్), ఒపీఎంఎస్ (ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్ ), ఫిర్యాదుల పరిష్కారం వంటి అయిదు ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డులకు ఎంపికయ్యాయి. దేశ వ్యాప్తంగా ఈ అవార్డుకు ఎంపికైన వంద ప్రాజెక్టుల్లో ఈ అయిదు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. హెచ్‌ఐసీసీలో గురువారం జరిగిన 45వ జాతీయ స్కోచ్ సమ్మిట్‌లో ఈ అవార్డులను శాఖల తరపున జాయింట్ డెరైక్టర్ ఏసురత్నం స్వీకరించారు.
సాంకేతికతతో అక్రమాలకు అడ్డుకట్ట
ఈ-పాస్ విధానం గ్రేటర్ హైదరాబాద్‌లోని 1545 రేషన్ షాపుల్లో అమలవుతుండగా, సరుకుల్లో 30శాతం మిగులు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపులకు ప్రతినెలా పంపే సరుకుల వివరాలు నమోదు చేయడానికి ఈ-పీడీఎస్, సరుకులు పక్కదారి పట్టకుండా ఎంఎల్‌ఎస్ పాయింట్లు, గోదాములు, రేషన్ షాపులను ఎస్‌సీఎం ద్వారా ఆన్‌లైన్‌కు అనుసంధానించారు.
ఒపిఎంఎస్ ద్వారా రైతులకు మద్దతు ధర అందించడమే కాకుండా, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే వారికి చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖలో అక్రమాలకు సాంకేతికతతోనే అడ్డుకట్ట వేస్తామని కమిషనర్ సి.వి.ఆనంద్ తెలిపారు. దీని కోసం ఐటీని మరింతగా విస్తరిస్తామని చెప్పారు. ఈ అవార్డులు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
పౌరసరఫరాల శాఖకు ‘స్కోచ్’ అవార్డులు
Published Thu, Sep 8 2016 9:18 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
Advertisement