న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు విమానయాన సంస్థల విమానాలకు తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి కూడా 30 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం రాత్రి ఇండియన్ ఎయిర్‌లైన్‌కు చెందిన 30 దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఇండిగో ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన నాలుగు విమానాలకు సోమవారం భద్రతా హెచ్చరికలు అందాయని తెలిపారు. ఈ జాబితాలో 6ఈ 164 (మంగుళూరు నుండి ముంబై), 6ఈ 75 (అహ్మదాబాద్ నుండి జెడ్డా), 6ఈ 67 (హైదరాబాద్ నుండి జెడ్డా), 6ఈ 118 (లక్నో నుండి పూణే) ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయా విమానాల్లోని ప్రయాణికులు సురక్షితంగా అక్కడి నుండి తరలించారు.
ఇదేవిధంగా ఎయిర్ ఇండియా విమానాలకు కూడా బెదిరింపులు వచ్చినట్లు ఆ సంస్థ ప్రతినిధి ధృవీకరించారు. నిర్దేశించిన ప్రోటోకాల్‌ను అనుసరించి, సంబంధిత అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారని, భద్రతా సంస్థల మార్గదర్శకాల ప్రకారం అన్ని భద్రతా విధానాలను అమలు చేశామన్నారు.
విస్తారా ప్రతినిధి మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన కొన్ని విమానాలకు సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయని చెప్పారు. వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తమయ్యారని, అన్ని భద్రతా విధానాలను అమలు చేశారన్నారు.
గడచిన వారం రోజుల్లో 120కి పైగా భారతీయ విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే బాంబు బెదిరింపులను కేవలం వదంతులుగా తేలికగా తీసుకోలేమని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. కాగా విమానయాన సంస్థలకు వస్తున్న బాంబు బెదిరింపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చట్టబద్ధమైన చర్యలకు ఉపక్రమిస్తోంది. నేరస్తులను నో-ఫ్లై జాబితాలో ఉంచే యోచనలో ఉందని సమాచారం.
ఇది కూడా చదవండి: ఉద్యోగుల తొలగింపు అవాస్తవం: ఫోన్‌పే
Comments
Please login to add a commentAdd a comment