మహారాష్ట్రలోని ముంబైలో గల బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ప్రధాన కార్యాలయంతోపాటు నగరంలోని 50 ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు ఈ మెయిల్స్ పంపారు. ఈ నేపధ్యంలో బీఎంసీ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బీఎంసీ కార్యాలయంతో పాటు బాంబు బెదిరింపులు అందిన అన్ని ఆసుపత్రులలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులకు ఎటువంటి అనుమానాస్పద వస్తువు లభ్యం కాలేదు.
వీపీఎన్ నెట్‌వర్క్ ద్వారా ఈ బెదిరింపు ఈమెయిల్స్ పంపినట్లు ముంబై పోలీసులు ధృవీకరించారు. బెదిరింపులకు పాల్పడిన వారు ఎవరనేది ఇంకా తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు. ముంబైలోని బీఎంసీ ప్రధాన కార్యాలయం, జస్లోక్ హాస్పిటల్, రహేజా హాస్పిటల్, సెవెన్ హిల్స్ హాస్పిటల్, కోహినూర్ హాస్పిటల్, కేఈఎం హాస్పిటల్, జేజే హాస్పిటల్, సెయింట్ జార్జ్ హాస్పిటల్ సహా 50కి పైగా ఆస్పత్రులకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
గతంలో దేశంలోని 41 విమానాశ్రయాలకు కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. 'కేఎన్‌ఆర్’ అనే ఆన్‌లైన్ గ్రూప్ ఈ నకిలీ బెదిరింపు ఈ మెయిల్స్ పంపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ బృందం మే ఒకటిన ఢిల్లీలోని వివిధ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్స్ పంపినట్లు పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment