పౌర సరఫరాల శాఖ సేవలకు ఉత్తమ అవార్డు
* త్రివేండ్రంలో పురస్కారం అందుకున్న కమిషనర్ పార్థసారథి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు గానూ తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు ఉత్తమ ‘ఈ-ఇండియా గవర్నమెంట్ టు సిటిజన్’ అవార్డు లభించింది. శనివారం కేరళలోని త్రివేండ్రంలో జరిగిన ఈ-ఇండియా గవర్నెన్స్ సదస్సులో పౌర సరఫరాల శాఖ తరఫున కమిషనర్ సి.పార్థసారథి, సీఆర్‌ఓ ఎం.పద్మ, ఎన్‌ఐసీ టెక్నికల్ డెరైక్టర్ జి.శివాజీ ఈ అవార్డును అందుకున్నారు.
జాతీయ స్థాయిలో పౌర సరఫరాలశాఖ ఇలాంటి అవార్డు అందుకోవడం ఇది రెండోసారి. గతంలోనూ ఉత్తమ ఈ-పీడీఎస్ విధానానికి గానూ పౌరసరఫరాల శాఖ జాతీయ అవార్డును అందుకుంది. రాష్ట్రంలో ఆధార్‌కు ఈ-పీడీఎస్‌ను అనుసంధానించడం ద్వారా ఇప్పటికే 11.71 లక్షల బోగస్ రేషన్ కార్డులను ఏరివేశారు. దీనిద్వారా 24,093 మెట్రిక్ టన్నుల బియ్యం, 7,406 కిలో లీటర్ల కిరోసిన్‌ను ఆదా చేయగలిగారు.