సాక్షి, అమరావతి: ‘ఇంటింటికీ రేషన్’ పంపిణీ విధానం అమల్లోకి రావడంతో పేదలకు శ్రమ తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం గత నెల నుంచి నాణ్యమైన బియ్యాన్ని అందిస్తుండటంతో బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలు వెచ్చించి బియ్యాన్ని కొనుక్కోవాల్సిన అవసరం తప్పింది. దీనివల్ల కుటుంబ ఖర్చులు ఎంతో ఆదా అవుతున్నాయని లబ్ధిదారులు ఆనందంగా చెబుతున్నారు. నిత్యావసర సరుకుల కోసం గతంలో రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సర్వర్ సక్రమంగా పని చేయకపోయినా.. ఏదైనా సమస్య తలెత్తినా గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఒక్కోసారి పనులకు వెళ్లకుండా రెండు, మూడు రోజులపాటు రేషన్ షాపులకు వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. రోజూ కూలి పనులకు వెళితే గాని కడుపు నిండని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారంతా రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చినప్పుడు ఆదాయం కోల్పోయేవారు. అలాంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కించే సంకల్పంతో మొబైల్ వాహనాల పేదల ఇంటికే వెళ్లి రేషన్ సరుకుల్ని పంపించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.
తప్పిన ఇబ్బందులు
ఇంటింటికీ రేషన్ విధానం అమలు చేయడం వల్ల లబ్ధిదారులకు సరుకులు అందేవరకు మొబైల్ వాహనం అక్కడి నుంచి వెళ్లే అవకాశం లేదు. రేషన్ వాహనం ఎప్పుడు వస్తుందనే సమాచారం కూడా ముందుగానే ఇస్తుండటం వల్ల ఎంతో ప్రయోజనం కల్గుతోంది. గతంలో పంపిణీ చేసిన బియ్యంలో రాళ్లు, నూకలు ఎక్కువగా ఉండేవి. ఆ బియ్యం ముక్కిపోయిన వాసన రావడంతో చాలామంది వండుకుని తినేందుకు ఉపయోగించేవారు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో కిలో రూ.45 చొప్పున మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం రాళ్లు, నూకలు, ముక్కిపోయినవి కాకుండా ప్రభుత్వం నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తుండటంతో పేదలు వాటినే వండుకుని తింటున్నారు. దీంతో ప్రతి నెలా బియ్యం కోసం ఖర్చు చేసే మొత్తం కూడా తగ్గిపోయింది. ముఖ్యంగా ఉపాధి నిమిత్తం గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చిన లబి్ధదారులు నాణ్యమైన బియ్యం పంపిణీని వరంగా భావిస్తున్నారు.
పట్టణాల్లో రోజుకు రెండు లక్షల కుటుంబాలకు..
పట్టణాల్లో మార్చి నెల కోటా సరుకులు ఈ నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నారు. మొబైల్ వాహనాల ద్వారా రోజుకు 2 లక్షల కుటుంబాలకు సరుకులు అందుతున్నాయి. మూడు రోజుల్లో దాదాపు 6 లక్షల కుటుంబాలకు 95.24 లక్షల కిలోల బియ్యం అందాయి. గురువారం నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ఖర్చు బాగా తగ్గింది
ప్రభుత్వం నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడంతో మా కుటుంబానికి బియ్యం ఖర్చు బాగా తగ్గింది. గతంలో ఇచ్చే బియ్యం నాసిరకంగా ఉండటంతో బయట మార్కెట్లో కొనేవాళ్లం. ఇప్పుడ ఆ బాధ తప్పిపోయింది. ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్నే వండుకుని తింటున్నాం.
– ఎస్.షేక్ షావలి, ఇందిరా నగర్, కర్నూలు
బిర్యానీకీ రేషన్ బియ్యాన్నే వాడుతున్నాం
బిర్యానీ చేసినప్పుడు కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నాణ్యమైన బియ్యాన్నే వాడుతున్నాం. గతంలో రేషన్ బియ్యం వండుకునే వీలులేక తప్పని పరిస్థితుల్లో విక్రయించేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు.
– బచ్చు దాలమ్మ, ముడియా వీధి, ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా
క్యూలో నిలబడే బాధ తప్పింది
గతంలో మూడు వీధులు దాటుకుని వెళ్లి రేషన్ షాపు వద్ద గంటల కొద్దీ క్యూలో నిలబడే వాళ్లం. ఇప్పుడు ఏమాత్రం శ్రమ పడకుండానే సరుకులు ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంది.
– నేరెడుమిల్లి జయలక్ష్మి, జగన్నాథపురం, కాకినాడ
పిలిచి మరీ ఇస్తున్నారు
ఇంటి గుమ్మం వద్దకే వచ్చి అక్కా.. రేషన్ సరుకులు వచ్చాయని మరీ చెప్పి ఇస్తున్నారు. రేషన్ షాపు వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకునే బాధ తప్పింది. నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు.
– ఎన్.సువేద, కల్లూరు, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment