సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో సన్న బియ్యం అన్న మాటే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పని పనులను కూడా ప్రభుత్వం చేస్తోందని గుర్తుచేశారు. మంగళవారం అసెంబ్లీలో నాణ్యమైన బియ్యం సరఫరాపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. తొలుత బియ్యం గురించి నాలెడ్జ్ పెంచుకొవాలని టీడీపీ సభ్యులకు సూచించారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలు కొడతారేమోనని టీడీపీ ఆన్‌లైన్‌లో పెట్టిన మేనిఫెస్టోను తీసివేసిందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకం ప్రారంభించామని.. నాణ్యమైన బియ్యం ప్రజలకు అందజేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు హయాంతో పోలిస్తే ప్రస్తుతం అందజేస్తున్న బియ్యానికి చాలా తేడా ఉందన్నారు. ప్రజలు బియ్యాన్ని అమ్ముకోకుండా.. తినాలనే ఆలోచన ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉందాన్నారు. ఇదే విధంగా ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ బియ్యం సరఫరా చేస్తామని చెప్పారు.
చంద్రబాబు హయాంతో పొల్చితే రూ. 1400 కోట్లు అదనంగా ఖర్చు చేసి ప్రజలకు స్వర్ణ బియ్యం అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బియ్యం సరఫరాలో నూకలు 25 శాతం ఉండేదని.. ప్రస్తుతం నాణ్యమైన బియ్యంలో నూకలు 15 శాతం మాత్రమే ఉంటుందని అన్నారు. పాదయాత్రలో ప్రజల నుంచి అనేక సూచనలు తీసుకున్నానని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు. పాదయాత్ర తర్వాత మేనిఫెస్టోను రూపొందిచామని.. అందులో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తామని ఎన్నికలకు వెళ్లామని చెప్పారు. ప్రజలకు మేలు చేస్తుంటే ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. గతంలో బియ్యం విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సీఎం వైఎస్ జగన్ సభలో ప్రదర్శించారు.
కిలో రూ. 37 బియ్యాన్ని రూపాయికే అందిస్తున్నాం : శ్రీరంగనాథ్
అంతకు ముందు మంత్రి శ్రీరంగనాథ్ మాట్లాడుతూ.. ప్రజలకు స్వర్ణ రకం బియ్యాన్ని అందజేస్తున్నామని తెలిపారు. రేషన్ బియ్యం రీ సైక్లింగ్ కాకుండా ప్యాక్ చేసి ఇస్తున్నామని తెలిపారు. కిలో రూ. 37 బియ్యాన్ని రూపాయికే అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఏపీలో అందరికి కిలో రూపాయికే బియ్యం అందిస్తామని స్పష్టం చేశారు. 25లక్షల టన్నుల బియ్యం ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్టు వెల్లడించారు.
ఆ ఘనత చంద్రబాబుదే : అప్పలరాజు
కిలో 2 రూపాయల బియ్యాన్ని రూ. 5.25 చేసిన ఘనత చంద్రబాబుదేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు విమర్శించారు. నాణ్యమైన బియ్యం పంపిణీని పలాస నుంచి మొదలు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇస్తే తప్పరని గుర్తుచేశారు. ఎన్ని వేల కోట్లు రూపాయలు ఖర్చు అయిన ప్రభుత్వం పేదలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తుందన్నారు. వాహనం వెళ్లలేని ఊరికి సైతం వాలంటీర్లు ఇంటికి తీసుకెళ్లి బియ్యం తీసుకెళ్లి సరఫరా చేస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment