వైఎస్‌ జగన్‌: నాణ్యమైన బియ్యమే ఇస్తాం | YS Jagan Explaines in Assembly Over the Quality of Rice Distribution in the State - Sakshi
Sakshi News home page

నాణ్యమైన బియ్యమే ఇస్తాం

Published Wed, Dec 11 2019 4:41 AM | Last Updated on Wed, Dec 11 2019 11:09 AM

CM YS Jagan Mohan Reddy clarification in Assembly About Quality rice for the poor - Sakshi

పేదలకు నాణ్యమైన బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించాం. ఈ బియ్యాన్ని పేదలు అమ్ముకోకుండా తినగలిగేలా ఇస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలోనే కాకుండా రాష్ట్రమంతటా ఎందుకు అమలు చేయడం లేదని టీడీపీ వాళ్లే అడుగుతున్నారు. దీన్నిబట్టి అక్కడ నాణ్యమైన బియ్యం ఇస్తున్నామని వారు కూడా ఒప్పుకుంటున్నట్లే కదా! ఏప్రిల్‌ నుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంతటా విస్తరింప చేసేందుకు అన్ని రకాలుగా సన్నద్ధమవుతున్నాం.   –సీఎం వైఎస్‌ జగన్‌
సాక్షి, అమరావతి:
వచ్చే ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర మంతటా పేదలకు నాణ్యమైన స్వర్ణ తరహా బియ్యాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శాసనసభలో తెలిపారు. తమ మేనిఫెస్టోలో లేని ఈ పథకం కోసం అదనంగా రూ.1,400 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. సన్నబియ్యం ఇస్తామని చెప్పి మాట మార్చారంటూ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు  చేసిన ఆరోపణలపై సీఎం సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..

ఇదీ మా చిత్తశుద్ధి..
‘అధ్యక్షా.. ఇదీ మా మేనిఫెస్టో. పాదయాత్రలో ప్రజల దగ్గర నుంచి రకరకాల సూచనలు తీసుకున్నాం. ఎన్నికలకు వెళ్లే ముందు దీన్ని విడుదల చేశాం. టీడీపీ వాళ్లకు మేనిఫెస్టో మీద గౌరవం లేదు. దాన్ని చెత్తబుట్టలో వేశారు. ప్రజలు కొడతారని ఆన్‌లైన్‌ నుంచి కూడా తీసేసిన చరిత్ర వాళ్లది. కానీ మా మేనిఫెస్టో మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత. ఇందులో ప్రతిదీ చేస్తామని చెప్పి ఓట్లడిగాం. ఈ రకమైన బియ్యం ఇస్తామని మేనిఫెస్టోలో ఎక్కడా పెట్టలేదు. కావాలంటే అద్దాలు సరిచేసుకుని చూసుకోండి. అసలు మేనిఫెస్టోలో చెప్పని కార్యక్రమాన్ని చేసి చూపించాలని, ప్రజలకు మంచి చెయ్యాలనే తపన, తాపత్రయంతో ఉన్నామనేది ముందుగా అర్థం చేసుకోవాలి.

గర్వంగా చెబుతున్నాం
చంద్రబాబు హయాంలో పంపిణీ చేసిన బియ్యాన్ని ప్రజలు తినలేక అమ్ముకున్నారు. ప్రజలు రూపాయికి తీసుకున్న బియ్యాన్ని డీలర్‌ రూ.7కు కొనుగోలు చేస్తే, వీరి నుంచి రైస్‌ మిల్లర్లు ఇంకో రెండు రూపాయలు ఎక్కువకు కొనుగోలు చేసి.. అదే బియ్యాన్ని రీ పాలిష్‌ చేసి వాటిని తిరిగి ప్రజా పంపిణీ వ్యవస్థలోకి తీసుకొచ్చిన పరిస్థితి. ప్రజలు ఏమాత్రం తినలేని బియ్యం ఇచ్చే ఈ పథకాన్ని పూర్తిగా మార్పు చేసి, నాణ్యమైన బియ్యాన్ని అందించాలనుకుంటున్నాం. పైలెట్‌ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో మేం ప్యాకెట్లు కట్టి.. సార్టెక్స్‌ చేసి ఇస్తున్నాం. ఈ బియ్యాన్ని, గతంలో చంద్రబాబు హయాంలో ఇచ్చిన బియ్యం నాణ్యతను పోల్చి చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆనందంగా తింటున్నారని ఈ సభలో గర్వంగా చెబుతున్నాను. ఆరు నెలలు పైలెట్‌ ప్రాజెక్టు ఇక్కడ నడుస్తుంది.

80 శాతం స్వర్ణలాంటి క్వాలిటీ పెంచిన బియ్యం ఇక్కడ పంపిణీ చేస్తున్నాం. ఇందులోనూ 20 శాతం వేరే బియ్యం ఉన్నాయి. వచ్చే ఏప్రిల్‌ నాటికి ఈ 20 శాతం కూడా పోయి, వంద శాతం స్వర్ణలాంటి నాణ్యమైన బియ్యాన్ని ప్రతి జిల్లాలోనూ ఇస్తాం. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన బియ్యాన్ని (ప్రస్తుతం గోడౌన్లలో ఉన్నాయి) డిసెంబర్‌ నాటికి పూర్తిగా పంపిణీ చేస్తాం. నేనేమన్నా.. మీరేమంటున్నారు? నేనేం చెప్పానో ఓసారి వీడియో చూద్దాం. (సీఎం సభలో మాట్లాడిన క్లిప్పింగ్‌ చూపించారు.) మేనిఫెస్టోలో లేని పనులు కూడా ఈ ప్రభుత్వం చేస్తుంటే, అది కూడా జీర్ణించుకోలేని వీళ్ల ఈర్ష, దురద చూస్తుంటే పిచ్చాసుపత్రిలో తప్ప వీళ్లను నయం చేసే వాళ్లు ఎవరూ ఉండరు. 

నూకలు, రంగు ఉన్న గింజ శాతం తగ్గిస్తాం
ఖరీఫ్, రబీ సీజన్‌లో మేం స్వర్ణ లేదా అలాంటి నాణ్యమైన రకాలకు చెందిన ధాన్యాన్నే ఈ పథకం కోసం సేకరించండని ఆదేశాలిచ్చాం. ఆరు నెలలు నిల్వబెట్టి మరీ ఇస్తాం. ఇంతకు ముందు పంపిణీ చేసిన బియ్యంలో నూకలు 25 శాతం ఉండేవి. మేం అందించే బియ్యంలో దీన్ని 15 శాతానికి తగ్గిస్తాం. 3 శాతం ఉండే డ్యామేజి, రంగు మారిన (డిస్కలర్‌) బియ్యాన్ని 0.75 శాతానికి పరిమితం చేయాలని ఆదేశించాం. గతంలో 5 శాతం ఉన్న షాకీగ్రేన్‌ ఒక్కశాతంకు మించి ఉండకూడదని చెప్పాం’ అని సీఎం స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement