పేదలకు సంతృప్తిగా భోజనం | CM YS Jagan quality rice distribution | Sakshi
Sakshi News home page

పేదలకు సంతృప్తిగా భోజనం

Published Fri, Sep 6 2019 5:17 AM | Last Updated on Fri, Sep 6 2019 9:04 AM

CM YS Jagan quality rice distribution - Sakshi

పంపిణీకి సిద్ధంగా ఉన్న నాణ్యమైన బియ్యం బ్యాగ్‌లు

సాక్షి, శ్రీకాకుళం/అమరావతి: ‘రేషన్‌ డిపోల ద్వారా ఇస్తున్న బియ్యం ప్రజలు తినే పరిస్థితి లేదు. ఏ బియ్యం అయితే మనం తినగలుతామో వాటినే పేదలకు పంపిణీ చేస్తాం. పూర్తిగా ఫిల్టరింగ్‌ చేసి.. 5, 10, 15, 20 కేజీలుగా ప్యాక్‌ చేసి సెప్టెంబర్‌ నుంచి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే సరఫరా చేస్తాం’ అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. అందుకు అనుగుణంగానే తొలుత శ్రీకాకుళం జిల్లాలో నాణ్యమైన బియ్యాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద వలంటీర్ల ద్వారా పేదల ఇంటికే పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కాశీబుగ్గలో ప్రారంభించనున్నారు. అనంతరం ఈ నెల 7, 8 తేదీల్లో  జిల్లావ్యాప్తంగా బియ్యం పంపిణీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం రెండో విడతలో విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపడతారు.

పంపిణీ ఏర్పాట్లు ఇలా..
జిల్లాను 15,344 క్లస్టర్లుగా విభజించారు. జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, ఐదు పురపాలక సంఘాలు, 1,141 గ్రామ పంచాయితీల పరిధిలో 1,865 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటికి మొత్తం 11,924 మంది వలంటీర్లను నియమించారు. ఒక్కొక్క క్లస్టర్‌లో 50 నుంచి 60 వరకు కుటుంబాలను చేర్చారు. వలంటీర్ల ద్వారా పేదలకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే 9,48,105 బియ్యం బ్యాగ్‌లను 2,015 రేషన్‌ డిపోల్లో సిద్ధంగా ఉంచారు.

వీటిలో 5 కిలోల బ్యాగ్‌లు 1,24,049, 10 కిలోల బ్యాగ్‌లు 2,42,035, 15 కిలోల బ్యాగ్‌లు 2,73,764, 20 కిలోల బ్యాగులు 3,08,257 ఉన్నాయి. పంపిణీ కార్యక్రమంలో ఏవైనా లోటుపాట్లు తలెత్తితే తెలుసుకుని పరిష్కరించేందుకు వీలుగా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. కార్డుదారుల మ్యాపింగ్‌లో సమస్యలు, పోర్టబులిటీ, డీలర్‌ లేదా వలంటీర్‌ అందుబాటు, యూనిట్‌లో తేడాలు రావడం వంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తితే లబ్ధిదారులు నేరుగా కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ ద్వారా తెలియజేస్తే అక్కడికక్కడే పరిష్కరిస్తారు. మరోవైపు నూతన విధానం వల్ల పీడీఎస్‌ బియ్యం రీసైక్లింగ్‌ దందాకు, తూకంలో మోసాలకు అడ్డుకట్ట పడనుంది.

20 ఏళ్లుగా పరిశోధనలకే పరిమితం
ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఆనవాళ్లు 1990 దశకంలోనే కనిపించాయి. 2000లో సోంపేటకు చెందిన ఐఎంఏ వైద్యులు వై.కృష్ణమూర్తి, పి.శివాజీ బృందం కవిటి ప్రాంతంలో ఈ కేసులను అధికారికంగా గుర్తించారు. 2004లో కేజీహెచ్‌ వైద్యులు 2005లో పరిశోధన వైద్య శిబిరాలు చేపట్టగా.. 2008 మే 24న నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ గంగాధర్, హైదరాబాద్‌ నిమ్స్‌ ఆర్‌ఎంఓ శేషాద్రి పర్యటించారు. అదే ఏడాది రాష్ట్ర నీటి విశ్లేషణ పరిశోధనా సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎం.కృష్ణమూర్తి , చీఫ్‌ కెమిస్ట్‌ ఎ.సతీష్, 2009లో న్యూయార్క్‌కు చెందిన కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ శివప్రసాద్‌ ఇక్కడ పర్యటించారు.

2011లో డాక్టర్‌ రవిరాజ్, డాక్టర్‌ వెలగల శ్రీనివాస్, డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి, ఎ.వేణుగోపాల్‌ బృందం, న్యూయార్క్‌కు చెందిన స్టోనీబ్రూక్స్‌ యూనివర్సిటీ బృందం, హైదరాబాద్‌కు చెందిన పరిశోధకురాలు సీఐఎస్‌ఆర్‌ సుజాత, 2012లో జపాన్, అమెరికన్‌ బృందాలతోపాటు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికల్‌ డిసీజెస్‌ బృందం అధ్యయనం జరిపాయి. 2013లో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, బాబా అటామిక్‌ రీసెర్చ్‌ బృందాలు పరిశోధనలు చేశాయి. 2017 నుంచి భారతీయ వైద్యపరిశోధనా మండలి పరిశోధన సాగుతోంది.

కిడ్నీ బాధితులకు కొండంత అండ
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పాదయాత్రలోనూ.. అంతకుముందు ఉద్దాన ప్రాంత పర్యటనలో కిడ్నీ బాధితుల కష్టాలను కళ్లారా చూసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే చర్యలకు ఉపక్రమించారు. ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనిని 100 రోజుల పాలనలో చేసి చూపించారు. కిడ్నీ రోగులకు నెలకు రూ.10 వేల పింఛను అందజేస్తున్నారు. వైద్య సేవలందించేందుకు వీలుగా 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, దానికి అనుగుణంగా రీసెర్చ్‌ సెంటర్, అతి పెద్ద డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు రూ.50 కోట్లు మంజూరు చేశారు. దీంతో సరిపెట్టకుండా వ్యాధికి మూలమైన తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఇంటింటికీ కుళాయిల ద్వారా శుద్ధ జలాలను సరఫరా చేసేందుకు ఉపక్రమించారు. ఇందుకోసం రూ.600 కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. వీటన్నిటికీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement