జనవరి 1 నుంచి ఇళ్ల వద్దకే నాణ్యమైన బియ్యం | Andhra Pradesh: Quality Rice At Home From 1st January | Sakshi
Sakshi News home page

జనవరి 1 నుంచి ఇళ్ల వద్దకే నాణ్యమైన బియ్యం

Published Thu, Nov 19 2020 7:39 PM | Last Updated on Thu, Nov 19 2020 7:52 PM

Andhra Pradesh: Quality Rice At Home From 1st January - Sakshi

సాక్షి, అమరావతి: పేదలకు జనవరి 1 నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇళ్ల వద్దే నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం పౌరసరఫరాల సంస్థ 9,260 మొబైల్‌ వాహనాలు (మినీ ట్రక్కులు) కొనుగోలు చేసేందుకు టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఈ నెలాఖరులోగా వాహనాలు సిద్ధం కానున్నాయి.

ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నా..
అధికారంలోకి వస్తే పేదలకు నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేస్తామని వైఎస్‌ జగన్‌ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. దీనివల్ల ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడుతున్నా ఇచ్చిన హామీ అమలుకు సీఎం గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కొంతమంది లబ్ధిదారులు దళారులకు విక్రయిస్తున్నారు. వీరు ఆ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి తిరిగి మార్కెట్‌లోకి తెస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం లబ్ధిదారుల ఇళ్లకే నాణ్యమైన బియ్యం పంపిణీ చేయనుంది.  

ఏజెన్సీ ప్రాంతాలకు ఎంతో లబ్ధి
ప్రతి ఇంటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. సరుకుల కోసం రేషన్‌ షాపుల వరకు వెళ్లకుండా లబ్ధిదారులు తమ ఇళ్ల వద్దే తీసుకుంటున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, కొండ గుట్టల్లో నివాసం ఉంటున్న వారికి ఎంతో ప్రయోజనం కలుగుతోంది. గతంలో వీరు సరైన రవాణా సౌకర్యం లేక సబ్సిడీ బియ్యం తీసుకోలేకపోయేవారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ బియ్యం పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

నాణ్యమైన బియ్యం పేదలకు వరం
నాణ్యమైన బియ్యం పేదల ఇంటికే డోర్‌ డెలివరీ చేయడం వారికి ఒక వరం. ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నా పేదల ఇబ్బందుల దృష్ట్యా సరుకుల పంపిణీ కోసం 9,260 మొబైల్‌ వాహనాలను కొనుగోలు చేస్తున్నాం. జనవరి 1 నుంచి ప్రతి బియ్యం కార్డుదారుడికి ఇంటి వద్దే సరుకులు పంపిణీ చేస్తాం. ప్రతినెలా 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల నాణ్యమైన బియ్యం అవసరమవుతాయని అంచనా వేశాం.
– కోన శశిధర్, ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ

జిల్లాల వారీగా మొబైల్‌ వాహనాలు ఇలా..   

జిల్లా మొబైల్‌ వాహనాలు
శ్రీకాకుళం 526 
విజయనగరం 456
విశాఖపట్నం              766
తూర్పుగోదావరి   1,040 
పశ్చిమ గోదావరి             795
కృష్ణా                  805
గుంటూరు 920
ప్రకాశం        634
నెల్లూరు     566
వైఎస్సార్‌    515
కర్నూలు   754
అనంతపురం  761
చిత్తూరు  722 
మొత్తం             9,260

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement