సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సన్నరకం బియ్యం ధరలు పెరుగుతున్నాయి. డిమాండ్‌కు తగ్గట్లుగా సన్నరకం బియ్యం లభ్యత లేకపోవడంతో ధరలు పైకి ఎగబాకుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో మేలురకం సన్నాల ధరలు క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.500 వరకు పెరిగాయి. రాష్ట్రంలో సన్నాల సాగు అధికంగా జరిగినా.. వానాకాలంలో కురిసిన కుండపోత వర్షాలతో దిగుబడి తగ్గడం, పొరుగు రాష్ట్రాలకు భారీగా ధాన్యం తరలి వెళ్లిపోవడంతో ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. సన్నాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, సెప్టెంబర్ తర్వాత కానీ మళ్లీ ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి.
రైతులు అమ్ముకున్నాక పెరిగిన ధరలు..
రాష్ట్రంలో గత వానాకాలంలో 53 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగ్గా, 39.66 లక్షల ఎకరాల్లో సన్నరకం సాగు చేశారు. దీనికి అనుగుణంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల మేర సన్నరకం ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసినా లెక్క తప్పింది. ఆగస్టు నుంచి మూడు నెలల పాటు భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో సన్నరకం ధాన్యం పంట భారీగా దెబ్బతిన్నది. దీంతో ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 10 నుంచి 15 క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో అనుకున్నంత మేర సన్నధాన్యం మార్కెట్‌లకు రాలేదు. దీనికి తోడు ధాన్యం తడవడం. తాలు ఎక్కువగా ఉండటంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేకరణ సరిగ్గా జరగకపోవడంతో రైతులు క్వింటాలు ధాన్యాన్ని మద్దతు ధరకన్నా తక్కువకు రూ.1,500–1,600కే అమ్మేసుకున్నారు.
ప్రభుత్వం కేవలం 19.55 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని మాత్రమే సేకరించగలిగింది. మద్దతు ధర రాకపోవడంతో కొన్ని చోట్ల రైతులే ధాన్యాన్ని మిల్లుకు పట్టించి క్వింటాల్ బియ్యాన్ని రకాన్ని బట్టి రూ.3,200–4,000 వరకు అమ్ముకున్నారు. డిసెంబర్ నెల వరకు సైతం మేలురకాలైన బీపీటీకీ బహిరంగ మార్కెట్‌లో రూ.3,150 ఉండగా రైతులు ధాన్యం మొత్తం అమ్మేసుకున్నాక ప్రస్తుతం రూ.3,500కు చేరింది. హెచ్‌ఎంటీ బియ్యానికి రూ.3,300 నుంచి రూ.3,700, జైశ్రీరామ్ రూ.3,850 నుంచి రూ.4,100, తెలంగాణ సోనా రూ.3,450 నుంచి రూ.3,800 వరకు ధర పెరిగింది. పాత బియ్యమైతే అన్నింటిలోనూ సరాసరిగా క్వింటాలుకు 400 వరకు అధిక ధర ఉంది. పాతబియ్యం జైశ్రీరామ్, 1008 రకాలైతే ఖమ్మం, వరంగల్ వంటి జిల్లాల్లో క్వింటాలుకు ఏకంగా రూ.5,000–5,200 వరకు ధర పలుకుతోంది. పౌరసరఫరాల శాఖ అధికారిక లెక్కల ప్రకారమే మేలురకం బియ్యం క్వింటాల్‌కు సరాసరి రేటు రూ.4,800 వరకు ఉండగా, కొద్దిగా తక్కువ రకం సన్నాల ధర రూ.4,200 వరకు ఉంది. గత ఏడాది ధరలతో పోల్చినా, కనీసంగా క్వింటాల్‌పై రూ.300 మేర పెరిగినట్లుగా లెక్కలు చెబుతున్నాయి.
పొరుగు నుంచి ఎసరు..
రాష్ట్రంలో వర్షాలతో తగ్గిన దిగుబడులకు తోడు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడి నుంచి సన్నరకం ధాన్యం కొనుగోళ్లకు మొగ్గు చూపడం సైతం బియ్యం ధరల పెరుగుదలకు కారణమవుతోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో సన్నరకం పంటల సాగు ఎక్కువగా లేకపోవడం, దిగుబడి పూర్తిగా దెబ్బతినడంతో వారంతా తెలంగాణ నుంచే సన్నరకం ధాన్యాన్ని సేకరించారు. అనధికారిక లెక్కల ప్రకారం పొరుగు రాష్ట్రాలకు 20 లక్షల మెట్రిక్ టన్నుల మేర సన్నధాన్యం తరలిందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యం కన్నా ఇది లక్ష మెట్రిక్ టన్నుల మేర అధికం. దీంతో రాష్ట్రంలో సన్నాలకు కొరత ఏర్పడి బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ధరలు సెప్టెంబర్ వరకు క్రమంగా పెరిగే అవకాశాలే ఎక్కువని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. యాసంగి పంట బయటకి వస్తేనే ఈ ధరలు తగ్గుతాయని అంటున్నాయి. దీనికి తోడు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు సైతం బియ్యం ధరల పెరుగుదలకు పరోక్షంగా కారణమవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రవాణా చార్జీలు పెరుగుతుండటంతో బియ్యం ధరలు కూడా పెరుగుతున్నాయని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment