సన్నబియ్యం చేరేనా?
సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సన్నబియ్యం వండిపెట్టడంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. జనవరి ఒకటినుంచి ఈ పథకాన్ని అమలుచేయాలి. అంటే మరో ఐదు రోజులే గడువుంది. కానీ ఇప్పటి వరకు జనవరి కోటాను కొనుగోలు చేయకపోవడం.. బస్తా బియ్యం కూడా హాస్టల్స్‌కు చేరకపోవడంతో పథకం అమలుపై అనేక సందేహాలు
వ్యక్తమవుతున్నాయి.
నల్లగొండ : సంక్షేమ వసతి గృహాలకు సన్నబియ్యాన్ని అందించేందుకు జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. పేద విద్యార్థులు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్న ఉద్దేశంతో రాష్ర్ట ప్రభుత్వం జనవరి 1 తేదీ నుంచి హాస్టళ్లకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భాగంగా బియ్యం పంపిణీకి సంబంధించి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోంది. హాస్టల్స్‌కు బియ్యం చేరవేసేందుకు గడువు మరో ఐదు రోజులు మాత్రమే ఉంది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా బస్తా బియ్యం హాస్టల్స్‌కు చేరలేదు. జనవరి నెలకు కావాల్సిన బియ్యం కోటాను మిల్లర్ల నుంచి కొనుగోలు చేసే ప్రక్రియ కూడా ఇప్పటి వరకు పూర్తికాలేదు. మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసిన బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ (మండల్ లెవల్ స్టాక్ పాయింట్లు) తరలించాలి. అక్కడి నుంచి రవాణా వాహనాల ద్వారా హాస్టల్స్‌కు చేరవేయాలి. కా నీ ఇప్పటి వరకు బియ్యం కొనుగోలు చేయడమే ఇంకా పూర్తికాలేదు.
జిల్లాలో పరిస్థితి ఇదీ...
జిల్లాలో 68 బీసీ వసతి గృహాల్లో 6,800 మంది విద్యార్థులు, కాలేజీ హాస్టల్స్ 26 ఉండగా అందులో 2,050 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరికి రోజుకు 400 నుంచి 500 గ్రాముల బియ్యాన్ని వండిపెట్టాలి. ఇందుకోసం నెలకు 750 క్వింటాళ్ల బియ్యం అవసరమని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. ఎస్సీ వసతి గృహాలు 121కు గాను 10, 500 మంది విద్యార్థులు, కాలేజీ హాస్టల్స్ 17 కుగాను 1650 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఈ విద్యార్థులకు రోజుకు 500 గ్రాముల నుంచి 600 గ్రామల బియ్యాన్ని వండిపెట్టాలి. ఇందుకు గాను నెలకు 1500 క్వింటాళ్ల బియ్యం అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇక ఎస్టీ వసతి గృహాలు 39 ఉన్నాయి. దీంట్లో 10 వేల మంది విద్యార్థులు, 10 కాలేజీ హాస్టల్స్‌లో 600 మంది, ఆశ్రమ పాఠశాలలు 11 ఉండగా 3 వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వారందరికీ రోజుకు 500 గ్రామలు చొప్పున బియ్యాన్ని వండిపెట్టాలి. దీనికిగాను నెలకు రెండు వేల క్వింటాళ్ల బియ్యం అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇవిగాక రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఉన్నాయి.
అరొకర బియ్యం సేకరణ
జనవరి నెలకు గాను సంక్షేమ వసతి గృహలకు మొత్తం 18 వందల టన్నుల బియ్యం సేకరించాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకు కేవలం 2 వందల టన్నుల బియ్యం మాత్రమే సేకరించారు. ప్రభుత్వం కిలో రూ.32ల చొప్పున రైస్ మిల్లర్లకు చెల్లించి కొనుగోలు చేస్తుంది. మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసే బాధ్యత జిల్లా పౌరసరఫరాల శాఖ పైనే ఉంది. ఆ బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్లకు తరలించి అక్కడి నుంచి హాస్టల్స్‌కు పంపిణీ చేసే బాధ్యత డీఎం సివిల్ సప్లయ్‌నే ఉంది. కానీ ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో బియ్యం కొనుగోలు చేయకపోవడంతో సంక్షేమ అధికారులు ఏటూ తేల్చుకోలే కపోతున్నారు. ఇక్కడ మరో విషయమేమంటే సన్న బియ్యాన్ని తరలించడానికి కంటే ముందే హాస్టల్స్‌లో ఉన్న దొడ్డు బియ్యాన్ని సమీ పంలోఉన్న ఎంఎల్‌ఎస్ పాయింట్లకు అప్పగించాలని వార్డెన్‌లకు మౌఖిక ఆదేశాలు జారీ చేయడం గ మనార్హం.
పక్కదారి పట్టకుండా...
దొడ్డు బియ్యాన్నే పక్కదారి పట్టించిన ఘనులు సంక్షేమ శాఖల్లో ఉన్నారు. ఎంఎల్‌ఎస్ పాయింట్లకు వచ్చిన బియ్యాన్ని వార్డెన్లు మొత్తం తీసుకెళ్లకుండా కొంత బియ్యాన్ని గోదాముల్లోనే నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్‌కు తరలించిన సంఘటనలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సన్నబియ్యం విషయంలో పకడ్బందీ నిఘా లేకపోతే వార్డెన్లు మరింత రెచ్చిపోయే అస్కారం ఉందని సివిల్ సప్లయ్ అధికారులే పేర్కొంటున్నారు. అలా కాకుండా ఆర్డీఓలు, తహసీల్దార్లు, బియ్యం రవాణాపై నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఎంఎల్‌ఎస్ పాయింట్లకు తరలించిన బియ్యాన్ని హాస్టల్స్ వరకు చేరేవే సేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇది ఏమేరకు సత్ఫలితాలు సాధిస్తుందో వేచిచూడాల్సిందే.