‘ఛీ’ప్‌ ట్రిక్స్‌     | TDP Chief Tricks On Quality Rice In Srikakulam District | Sakshi
Sakshi News home page

‘ఛీ’ప్‌ ట్రిక్స్‌    

Published Sun, Sep 8 2019 8:38 AM | Last Updated on Sun, Sep 8 2019 8:40 AM

TDP Chief Tricks On Quality Rice In Srikakulam District - Sakshi

ఇటీవల కురిసిన వర్షాలకు రవాణా సమయంలో తడిసిన బియ్యం బ్యాగులు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ పథకం ఒక బృహత్తర కార్యక్రమం. జిల్లాలో 8.31 లక్షల కార్డుదారులకు నేరుగా సరఫరా చేసే టాస్క్‌ ఇది. అధికారులు ప్రణాళికబద్ధంగా రాత్రింబవళ్లు కష్టపడి ఆచరణలో పెట్టిన పైలెట్‌ ప్రాజెక్టు ఇది. చరిత్రలో ఎక్కడా లేని విధంగా తలపెట్టిన వినూత్న సంక్షేమ కార్యక్రమమిది. అనుకున్నట్టుగానే శనివారం ఇంటి ముంగిటకే నాణ్యమైన బియ్యం బ్యాగులు చేరాయి. తొలిరోజే 92 శాతం మేర పంపిణీ పూర్తయింది. లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం కనిపించిది. జిల్లా అంతటా సంతోషం వ్యక్తమవుతోంది. కానీ ఇది టీడీపీ నేతలకు మాత్రం కంటగింపుగా మారింది. ఇంటింటికీ నాణ్యమైన బియ్యం బ్యాగులు చేరుకునేసరికి ఆ పార్టీ నేతలకు వణుకుపుట్టింది. పునాదులు కదులుతాయేమోనన్న భయం పట్టుకుంది. ఇంకేముంది తమకు అలవాటైన చీప్‌ పబ్లిసిటీని నమ్ముకున్నారు.


ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పంపిణీ చేస్తున్న నాణ్యమైన బియ్యంపై బురద చల్లే కార్యక్రమానికి ఒడిగట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు రవాణా సమయంలో తడిసిన బ్యాగులను పట్టుకుని రాద్ధాంతం చేశారు. వాస్తవమేంటో తెలుసుకోకుండా నాణ్యత లేని బియ్యమంటూ దుష్ప్రచారానికి దిగారు.  జిల్లాలో శనివారం ఒక్కరోజే శతశాతం పంపిణీ చేసేందుకు కలెక్టర్‌ జె.నివాస్‌ నేతృత్వంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.శ్రీనివాసుల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శనివా రం సాయంత్రానికి జిల్లావ్యాప్తంగా 92 శాతం మేర పంపిణీ జరిగింది. సీతంపేట ప్రాంతంలో వర్షం కురిసిన కారణంగా, కొంతమంది ఇళ్ల వద్ద లేని కారణంగా పంపిణీలో కొంతమేర జాప్యం చోటు చేసుకుంది. మిగతా అన్నిచోట్ల ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో ఇళ్ల వద్దకే 

నాణ్యమైన బియ్యం చేరాయి. బూర్జ మండలం లాబాం గ్రామంలో జరిగిన బియ్యం పంపిణీ కార్యక్రమంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. నరసన్నపేలో మంత్రి ధర్మాన కృష్ణదాస్, రేగిడి మండలంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, మెళియాపుట్టిలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, లావేరు మండలంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, వీరఘట్టంలో ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమం సందడిగా సాగింది.

తడిసిన బియ్యాన్ని పట్టుకుని టీడీపీ రాద్ధాంతం..
జిల్లావ్యాప్తంగా 9 లక్షల 36 వేల 941 బ్యాగులను పంపిణీ చేస్తుండగా వాటిలో 30 బ్యాగుల వరకు తడిసినవి బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా నుంచి రవాణా సమయంలోనూ, చౌక ధరల దుకాణాలు, గిడ్డంగులలో వసతి వలన ఇ టీవల కురిసిన భారీ వర్షాలకు కొన్ని బస్తాలు తడవడం వలన బియ్యంలో తేడా వచ్చింది. లబ్ధిదారులు తెలియజేయగానే వాటిని అధికారులు రీప్లేస్‌ చేశారు. కానీ టీడీపీ నాయకులు వాటిని పట్టుకుని ముక్కిపోయిన బియ్యంగా చూపిస్తూ ప్రచారం చేయడం ప్రారంభించారు. అధికారులు తక్షణమే మార్చినప్పటికీ వాటి ని చూపించి నానా యాగీ చేశారు. నిజానికి గతంలో బియ్యంలో ఊక, బొత్తు, మ ట్టి రాళ్లు కలిసి ఉండేవి. 25శాతం నూకలు ఉండేవి. ఇప్పుడు నాణ్యమైన బియ్యం లో ఊక, బొత్తు, మట్టి రాళ్లు లేవు సరికదా.. నూకలు 10 శాతానికి తగ్గాయి.

టీడీపీ వ్యూహాత్మక కుట్ర.. 
నాణ్యమైన బియ్యం పథకంపై బురద జల్లేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా కుట్ర పన్నింది. కొత్త విధానంతో తమకెక్కడ ఇబ్బంది వస్తుందోనని గత ప్రభుత్వంలో నియమితులైన దాదాపు 250 డీలర్లను చేతిలో పెట్టుకుని  అసత్య ప్రచారం కోసం లీకులు ఇప్పించడం ప్రారంభించారు. ఇప్పటికే మీరేం చేయలేరని... ఎలా చేస్తారో చూస్తామని... వలంటీర్‌ బాధ్యతలు కష్టమని... వలంటీర్లను బెదిరించే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే, కార్డుదారులు కూడా తప్పనిసరిగా రూ.300 చేతిలో ఉంచుకోవాలని, ప్రభుత్వమిచ్చిన అన్ని సరుకులు విడిపించుకోవాలని భయపెడుతున్నారు. వాస్తవానికైతే, ఎవరికి ఏ సరుకులు కావాలో వాటిని విడిపించుకునే అవకాశం ఉంది. కానీ, ఏదో ఒకటి చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని అదే పనిగా పథక రచన చేస్తున్నారు. అందులో భాగంగానే నాణ్యమైన బియ్యం పంపిణీ తొలి రోజున ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన బియ్యాన్ని పట్టుకుని దుష్ప్రచారానికి ఒడిగట్టారు. తగిన సమాధానం ఇచ్చేలా అధికారులు వెంటనే తడిసిన బియ్యం అందిన చోట రీప్లేస్‌ కూడా చేశారు. కానీ టీడీపీ నాయకులు అదే పనిగా అసత్యాలతో పబ్బం గడుపుకోవడానికి యత్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement