పౌర సరఫరాల జిల్లా మేనేజర్ కార్యాలయంలో బియ్యం నమూనాలను పరిశీలిస్తున్న జిల్లా కమిటీ ప్రతినిధులు
సాక్షి, ఒంగోలు సిటీ: ప్రజా పంపిణీలో నాణ్యమైన బియ్యం ఇవ్వడానికి కసరత్తు జరుగుతోంది. తెల్లకార్డు కలిగిన వారికి ఇచ్చే బియ్యంలో నూక శాతం తగ్గాలి. తేమకు పరిమితి ఉంది. తౌడు మోతాదు తగ్గాలి. తుక్కు, రద్దు జాడే ఉండకూడదు. ముక్కి వాసన రాకుండా నాణ్యతా ప్రమాణాలు అందుబాటులో ఉండాలి. ఇలా మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ కానుంది. ఇందుకు సంబంధించి గోదాము స్థాయిలో నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉంచుకోవడానికి తగిన సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీ నాణ్యమైన బియ్యం ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది. కార్డుదారుడు తీసుకున్న బియ్యం ఇంటిల్లపాది వినియోగించుకొనే విధంగా బియ్యం నాణ్యతా ప్రమాణాలు ఉండితీరాలి. ఇందు కోసం గోదాముల్లో ఉన్న బియ్యం నమూనాలను సేకరించే పనిలో పడ్డారు.
జిల్లాలో ప్రజా పంపిణీ కింద నెలకు 15,117.120 టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. 2151 చౌక ధరల దుకాణాల ద్వారా 9,90,501 తెల్లకార్డు కలిగిన వారికి బియ్యం పంపిణీ జరుగుతోంది. 2018–19 ఏడాదిలో బియ్యం 1,28,685 టన్నులు కేటాయిస్తే అందులో 1,27,692 టన్నులు బియ్యం కార్డుదారులకు పంపిణీ చేశారు. ఏటా కార్డుదారులకు వినియోగమవుతున్న బియ్యం లెక్కలను తీశారు. వీటి ప్రకారం ఇక జిల్లాలోని కార్డుదారులకు నాణ్యమైన బియ్యం ఇవ్వడానికి కార్యాచరణకు పూనుకున్నారు. వలంటీర్ల ద్వారా నాణ్యమైన బియ్యం పంపిణీ జరగనుంది. ఇక డీలర్లు స్టాకిస్ట్‌లుగా ఉంటారని సంకేతాలను సంబంధిత మంత్రి ఇచ్చారు. స్టాకిస్ట్‌ల విధివిధానాలు ఇంకా రాకపోయినా నాణ్యమైన బియ్యం ప్యాకెట్లు వలంటీర్ల ఆధ్వర్యంలో కార్డుదారుని ఇంటికే నేరుగా తెచ్చి ఇవ్వనున్నారు. బియ్యం ప్యాకెట్లు 5,10,25 కిలోల లెక్కన ఉంటాయి. ఈ ప్యాకెట్లను తయారు చేయడానికి ప్రాథమికంగా కేంద్రాల గుర్తింపు ప్రక్రియ జరిగింది.
నూకలకు కాలం చెల్లింది..
ఇక నాణ్యమైన బియ్యంలో నూకల శాతం పరిమితంగానే ఉండాలి. దీని కోసం పరిశీలనకు జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటయింది. జిల్లా సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి, పౌరసరఫరాల సంస్ధ జిల్లా మేనేజర్, ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఇద్దరు సాంకేతిక అసిస్టెంట్ మేనేజర్లు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ కమిటీలో ఉన్నారు.
► ఇప్పటి వరకు ప్రజా పంపిణీకి ఇస్తున్న కస్టమ్ మిల్లింగ్ రైస్‌లో నూకలు ఇతర వ్యర్థాలు 25 శాతం వరకు అనుమతిస్తున్నారు. ఈ ప్రమాణాల కన్నా అదనంగా మరో 5–10 శాతం కూడా నాణ్యత లోపిస్తోంది. ఇక నూకల శాతం బాగా తగ్గించారు. దీనితో పాటు బియ్యం నాణ్యతకు ప్రమాణాలను సవరించారు. ఇక నుంచి ప్రజాపంపిణీలో ఇచ్చే బియ్యంలో నూకలు, ఇతర వ్యర్ధాలు కలిపి మొత్తంగా 15 శాతంలోపే ఉండాలి. దీని కోసంగా జిల్లా కమిటీ నుంచి ప్రభుత్వం నివేదిక కోరింది.
107 నమూనాల సేకరణ..
జిల్లా కమిటీ ప్రస్తుతం పౌరసరఫరాల గోదాముల్లో ఉన్న సీఎంఆర్ రైస్‌లో ఉన్న నూకలు, ఇతర వ్యర్థాలు కలిపి ఎంత మోతాదులో ఉన్నాయో వివరాలను సేకరించి నివేదిక ఒకటి రెండు రోజుల్లో ఇవ్వమని పౌరసరఫరాల సంస్థ ఎండీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ నమూనాల సేకరణకు ఉపక్రమించింది. జిల్లాలోని గుండ్లాపల్లి, దొడ్డవరప్పాడు గోదాముల్లో నమూనాలను సేకరించారు. చీరాల గోదాముల్లో శుక్ర,శనివారాలు నమూనాలను సేకరించనున్నారు. వీటితో పాటు సెంట్రల్ వేర్ హౌస్ గోదాముల నుంచి నమూనాలను సేకరించనున్నారు.
కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన..
గోదాముల నుంచి సేకరించిన బియ్యం నమూనాలను జిల్లా పౌరసరఫరాల సంస్ధ కార్యాలయంలో కమిటీ పరిశీ లిస్తోంది. వివిధ గోదాముల నుంచి 107 శాంపిల్స్‌ను తీశారు. 3,240 బస్తాలకు ఒక శాంపిల్ లెక్కన తీశారు.
► నమూనాలను పరిశీలించి ప్రాథమికంగా నివేదిక తయారు చేశారు. జిల్లాలోని వివిధ గోదాముల్లో సీఎంఆర్ ద్వారా సేకరించిన బియ్యం బస్తాల నుంచి సేకరించిన నమూనాల్లో నూకల శాతం 20–28 శాతం వరకు ఉన్నాయి. అథమంగా 17 శాతంగా కొన్ని శాంపుల్స్‌లో ఉన్నాయి. సరాసరిన 10 శాతంగా నూకలు ఇతర వ్యర్థాలను తగ్గించి 15 శాతంగా నూకలు ఉన్న బియ్యాన్ని ప్రస్తుతం ఉన్న లాట్‌ల నుంచి అనుమతిస్తారు. బియ్యం బస్తాల నుంచి తీసిన నమూనాలపై నివేదిక ఒకటి రెండు రోజుల్లో పౌరసరఫరాల సంస్థ ఎండీ కార్యాలయానికి పంపనున్నారు. ప్రస్తుతం ఉన్న నాణ్యతా ప్రమాణాల ఆధారంగా ఏ విధంగా పంపిణీకి నిర్ణయాన్ని తీసుకుంటారో ప్రభుత్వ పెద్దల చేతిలో ఉందని అధికారులు చెబుతున్నారు.
ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ
జిల్లాలోని కార్డుదారులకు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడానికి రంగం సిద్ధమైంది. వలంటీర్ల ద్వారా కార్డుదారులకు పంపి ణీ చేస్తారు. జనవరి నుంచి రేషన్‌కార్డు లేని కుటుంబాలకు 72 గంటల వ్యవధిలోనే కొత్త కార్డులను ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యం లోనే తగినంత మోతాదులో నాణ్యమైన బియ్యం సీఎంఆర్ ద్వారా తీసుకోవడానికి కార్యాచరణకు పూనుకుంది. జిల్లాలో పండిస్తున్న ధాన్యం రకాలు, ఇతర జిల్లా ల నుంచి వస్తున్న సీఎంఆర్ బియ్యం రకాలలో ఇక నుంచి నూకలు ఇతర వ్యర్ధాలన్నీ కలిపి 15 శాతంలోపే ఉండే విధంగా కార్యాచరణకు పూనుకున్నారు. ఇప్పుడున్న బియ్యం పంపిణీకి త్వరలో మార్గదర్శకాలు విడుదలకానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment