‘ఆధారం’లేకపోతే ఆగమే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉన్న ఊరిని, వలస జీవిని కలిపేది తెల్లకార్డు. సార్లొచ్చినప్పుడు ఊర్లో లేకపోతే కార్డు తీసేస్తారని అని చెబితే చాలు.. ఇతర రాష్ట్రాల్లో ఉన్నా సరే, వలసజీవులు పరుగు పరుగున సొంతూళ్లకు వచ్చేస్తారు. ఇంతకష్టం ఎందుకంటే తాము ఈ గ్రామానికే చెందినవాళ్లం అని చెప్పేందుకు ఇదో ఆధారమంటారు. కానీ ఇపుడు అలాంటి ఆధారమే వలసజీవికి లేకుండా పోతోంది.
సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికే దక్కాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు వలస జీవులకు, నిరుపేదలకు ఇబ్బందిగా మారుతున్నాయి. వ్యక్తి సమగ్ర వివరాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డును తప్పని సరి చేసింది. ఈ నిర్ణయంతో జిల్లాలో దాదాపు 5 లక్షల మందికి సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయి. పైగా జిల్లాలో ఆధార్ సెంటర్లను మూసి వేయడంతో ప్రజలు ఇప్పటికిప్పుడు ఆధార్ కార్డు తెచ్చుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.
ఆధార్ లేని వాళ్లు 8 లక్షలు
2010- 11 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 6,68,628 కుటుంబాల్లో 30,33,288 మంది జనాభా ఉన్నారు. ఇటీవల జరిపిన సమగ్ర సర్వే ప్రకారం జిల్లాలో 8,50,834 కుటుంబాలు ఉన్నట్లు తేలింది. ఈ లెక్కన చూస్తే జిల్లా జనాభా కనీసం 5 నుంచి 6 లక్షల పెరిగే అవకాశం ఉంది. సమగ్ర సర్వేలో 27,15,857 మంది మాత్రమే ఆధార్ కార్డును నమోదు చేయించుకున్నట్లు తేలింది. మిగిలిన వారు ఆధార్ కార్డును ఇవ్వలేకపోయారు. సర్వే నివేదిక ప్రకారం కనీసం 8 లక్షల మందికి ఆధార్‌కార్డులు లేవు. ప్రతి సంక్షేమ పథకానికీ ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో ఆధార్ లేని వారంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యే ప్రమాదం ఉంది.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఆహార భద్రత కార్డు, పెన్షన్ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా మళ్లీ సొంతూళ్లకు చేరుకుంటున్నారు. అయితే అధికారులు వారిని ఆధార్ కార్డులివ్వాలని కోరుతుండడంతో వారంతా ఇబ్బందిపడుతున్నారు. పోనీ ఇప్పుడైనా ఆధార్ కోసం నమోదు చేసుకుందామంటే జిల్లాలో అన్ని సెంటర్లనూ మూసివేశారు. మీ సేవా కేంద్రం ద్వారా ఆధార్ కార్డును పొందే అవకాశం ఉన్నా, పేరు నమోదు చేసుకున్న తర్వాత ఎన్‌రోల్‌మెంటు నంబర్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పెన్షన్ లాంటి సంక్షేమ పథకాల్లో లబ్ధిపొందుతూ, ఆధార్ కార్డులేని వారు, కనీసం ఇంకా నమోదు చేయించుకోని వారు సుమారుగా 3,12,007 మంది ఉన్నట్లు సర్వేలో తేలింది. ప్రస్తుతం వీరి పరిస్థితి సందిగ్ధంలో పడింది.
దళితుల్లోనే ఎక్కువ
ఆధార్‌కార్డు లేని వారిలో ఎక్కువగా దళితులే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు గుంట జాగ కూడా లేని దళితులు శ్రమనే నమ్ముకొని బతికారు. ఎక్కడ పని దొరికితే అక్కడకు వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు. వలసలు కూడా దళిత కుటుంబాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. వలసలు వెళ్లిన చాలా మంది దళితులకు ఆధార్‌కార్డులు లేవు. వీళ్ల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. జిల్లా నుంచి ఎంత మంది వలసలు వెళ్లారు, వాళ్ల వివరాలు డీఆర్‌డీఏ, డ్వామా, రెవిన్యూ, కార్మిక శాఖ అధికారుల వద్ద లేరు.
వలస జీవుల వివరాలు ఇవ్వండని అడితిగే ఏ ఒక్కరి దగ్గర కూడా వివరాలు లేవు. ప్రతి శాఖ అధికారులు కూడా అది తమ పరిధిలోకి రాదంటే తమ పరిధిలోకి రాదని చెప్పి చేతలు దులుపుకుంటున్నారు. ప్రభుత్వం దళితులకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమికి కూడా అర్హుల జాబితాను ఆధార్ కార్డు ఆధారంగానే రూపొందిస్తున్నారు. దీంతో చాలా మంది దళితులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది.
ఆధార్ సెంటర్లు తెరవాలి
సర్కార్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నింటికీ ఆధార్ కార్డు తప్పని పరిస్థితి అయిన నేపథ్యంలో ఇప్పటికీ ఆధార్‌కార్డు పొందని వారికోసం వీలుగా ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ముందుగా ప్రతి వ్యక్తికీ ఆధార్ కార్డు అందేవిధంగా చర్యలు తీసుకున్న తర్వాతే ఆధార్ కార్డును సంక్షేమ పథకాలతో లింక్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.