ప్రభుత్వాలకు శిక్ష తగ్గింపు అధికారం లేదు! | Supreme critical comment on the case Rajiv assassins | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాలకు శిక్ష తగ్గింపు అధికారం లేదు!

Published Thu, Dec 3 2015 1:30 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ప్రభుత్వాలకు శిక్ష తగ్గింపు అధికారం లేదు! - Sakshi

ప్రభుత్వాలకు శిక్ష తగ్గింపు అధికారం లేదు!

♦ రాజీవ్ హంతకుల కేసులో సుప్రీం కీలక వ్యాఖ్య
♦ శిక్షల విధింపులో ఔదార్యం సమాజానికి నష్టం
 
 న్యూఢిల్లీ:
సీఆర్‌పీసీలోని 432(1) నిబంధన కింద దోషులకు శిక్షను తగ్గించడం లేదా శిక్షను రద్దు చేసే అధికారాన్ని కేంద్రం కానీ, రాష్ట్రాలు కానీ తమకు తాము తీసుకోకూడదని బుధవారం సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. దోషులు పెట్టుకున్న దరఖాస్తుల ఆధారంగానే సీఆర్‌పీసీ సెక్షన్ 432(2)లో పేర్కొన్న ప్రకారం ఆ ప్రక్రియ చేపట్టాలని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, సంబంధిత కోర్టు అభిప్రాయం ప్రకారం శిక్ష తగ్గింపు, లేదా రద్దుపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.

 

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులను విడుదల చేస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. అయితే, ధర్మాసనంలోని ఐదుగురు జడ్జీల్లో ఇద్దరు న్యాయమూర్తులు ఆ తీర్పుతో విభేదించడం విశేషం. దోషులకు శిక్ష తగ్గింపు విషయంలో ప్రభుత్వాలకు ఉన్న చట్టబద్ధ అధికారాలను కోర్టులు తప్పించలేవని జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం సాప్రే అభిప్రాయపడ్డారు. ఈ కేసులో జస్టిస్ లలిత్ ప్రత్యేకంగా 80 పేజీల తీర్పును రాశారు. ధర్మాసనం తీర్పులోని ఇతర ముఖ్యాంశాలు, కీలక వ్యాఖ్యలు..

► తీవ్రమైన నేరాలకు పాల్పడినవారికి శిక్షలు విధించడంలో ఔదార్యం చూపితే.. అది సమాజంలో అస్తవ్యస్తతకు, శాంతిభద్రతల క్షీణతకు దారితీస్తుంది. దానివల్ల వేలాది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.
► సామాన్యుల ప్రాణాలకు, స్వేచ్ఛకు ప్రభుత్వ యంత్రాంగం రక్షణ కల్పించలేకపోతోందనేది కఠిన వాస్తవం. అందువల్ల తీవ్ర స్థాయి నేరాల్లో శిక్షల విధింపులో ఔదార్యం కూడదు.
► అక్రమ సంపాదనతో, అధికార కాంక్షతో ఉన్న అత్యున్నత స్థాయి వ్యక్తుల సహకారంతో ఇలాంటి చట్టవ్యతిరేక శక్తులు సామాన్యుల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి. ఆ వ్యక్తుల చేతిలో వీరు గూండాలుగా, డబ్బులు తీసుకుని హత్యలు చేసేవారిగా మారుతున్నారు.
► చట్టం ప్రకారం నడుచుకోకపోవడం ఇప్పుడు సాధారణం అయింది.
► ఈ ప్రొఫెషనల్ క్రిమినల్స్, గ్యాంగ్‌స్టర్స్, గూండాల బెదిరింపులతో కుటుంబ సభ్యులు, ఇతర దగ్గరి వారు కూడా సాక్ష్యం చెప్పడానికి ముందుకురాని పరిస్థితిని చాలా కేసుల్లో చూశాం.
► కేసుల విచారణలో జాప్యం వల్ల అండర్‌ట్రయల్స్‌గా ఉన్న నేరస్తులు మరిన్ని తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారు. కేసుల సంఖ్యకు సరిపోయే స్థాయిలో జడ్జీలు లేకపోవడం దీనికి ఓ కారణం.
► శిక్ష రద్దుకు సంబంధించిన ఆశా కిరణాన్ని రాజీవ్‌గాంధీ హంతకులు ఆశించకూడదు. నేర ఘటన తరువాత ఎలాంటి ఉపశమనం పొందని బాధితులు, వారి బంధువులకే అది వర్తిస్తుంది.
 
 సంక్షిప్తంగా...
 ’పెషావర్’ముష్కరుల ఉరితీత: పెషావర్ ఆర్మీ స్కూలులో గతేడాది డిసెంబర్‌లో 150 మందికిపైగా చిన్నారులు, ఇతరులను చంపిన ఘటనలో పాలుపంచుకున్న నలుగురు తాలిబాన్ ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వం బుధవారం ఉరితీసింది.  
 తృణమూల్ నేతను విచారించిన సీబీఐ: శారదా స్కాంలో తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ ప్రధాన కార్యదర్శి శంకుదేబ్ పాండాను సీబీఐ విచారించింది..
     మరో ఐఎస్‌ఐ ఏజెంట్ అరెస్టు: పాస్‌పోర్టు ఏజెంటుగా పనిచేస్తూ.. పాక్‌కు సహకారం అందిస్తున్న షేక్ బాదల్(59) అనే మరో ఐఎస్‌ఐ ఏజెంటును కోల్‌కతా పోలీసులు అరెస్టు  చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement