సాక్షి, చైన్నె: తనతో పాటు తిరుచ్చి శిబిరంలో ఉన్న వారిని శ్రీలంకకు పంపించాలని ప్రధాని నరేంద్రమోదీకి రాజీవ్ హత్య కేసులో విడుదలైన శాంతను విజ్ఞప్తి చేశాడు. ఈమేరకు ప్రధానికి లేఖ రాశాడు. వివరాలు.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులైన నళిని, మురుగన్, పేరరివాలన్ శాంతన్, రవిచంద్రన్, రాబర్ట్, జయకుమార్‌ను గత ఏడాది సుప్రీంకోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. వీరిలో నళిని, పేరరివాలన్, రవిచంద్రన్ తమిళనాడు వాసులు. మిగిలిన నలుగురు శ్రీలంకకు చెందిన వారు.
దీంతో వీరిని శ్రీలంకకు పంపించడంలో సమస్యలు నెలకొని ఉన్నాయి. దీనిని అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో మురుగన్, శాంతన్, రాబర్ట్‌ను తిరుచ్చి కేంద్ర కారాగారం ఆవరణలోని ప్రత్యేక శిబిరంలో ఉంచారు. అయితే, తమను బయటకు పంపించాలని పదేపదే ఈ నలుగురు నిరసనలకు దిగుతున్నారు. ఈ పరిస్థితుల్లో శని వారం శాంతను ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాడు. జైల్లో ఉన్నప్పుడే తమకు స్వేచ్చ ఉండేదని, అయితే ఇక్కడ చీకటి గదుల్లో తమను బంధించినట్లుగా పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరు నెలలుగా ఇక్కడ తాము నలిగి పో తున్నామని, దయ చేసి శ్రీలంకకు పంపించాలని కోరాడు. రక్త సంబంధీకులను మాత్ర మే చూసేందుకు ఇక్కడ అనుమతి ఇస్తున్నారని, తమకు రోజు వారీగా ఆహారం ఖర్చు రూ. 175 ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని పేర్కొన్నాడు. శ్రీలంకకు త్వరితగతిన పంపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment