ఈనెల 30న పాలమూరులో రైతు దినోత్సవ సభ
డిసెంబర్ 7–9 వరకు హైదరాబాద్‌లో లేజర్ షో, కార్నివాల్, సాంస్కృతిక వేడుకలు
ఉన్నతస్థాయి సమీక్షలో ప్రజాపాలన విజయోత్సవాల మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలో అమలు చేసిన విప్లవాత్మక పథకాలు, సంక్షేమ కార్యక్రమాల వివరాలను గడపగడపకూ చేర్చాలని ప్రజాపాలన విజయోత్సవాల మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ విజయోత్సవాల్లో అన్ని శాఖలు భాగస్వాములు కావాలని అధికారులను ఆదేశించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ భేటీలో ఉపసంఘం సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. వచ్చే నెల 9వ తేదీ వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేసింది.
అన్ని మాధ్యమాల ద్వారా ప్రచారం: భట్టి
డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ వివిధ శాఖల పరిధిలో అమలైన పథకాలు, కార్యక్రమాల గురించి ఆయా శాఖలు ప్రజలకు వివరించాలని సూచించారు. ఇందుకోసం సోషల్ మీడియా సహా అన్ని మాధ్యమాలను ఉపయోగించుకోవాలని కోరారు. విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో రైతు దినోత్సవంతోపాటు సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా లేజర్ షో, కార్నివాల్‌తోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు.
మహిళలను చైతన్యవంతులను చేయాలి: మంత్రి ఉత్తమ్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళల అభ్యున్నతి కోసం చేపట్టిన 70 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం, బ్యాంకు లింకేజీల కల్పన, సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ తదితర పథకాల గురించి మహిళలందరికీ తెలియజేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులకు సూచించారు.
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అన్ని ఆర్టీసీ బస్సులపై ప్రజా ప్రభుత్వ పాలన విజయాలను తెలియజేసేలా ప్రకటనలు తయారు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఇందిరమ్మ ఇళ్లు, ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల ఏర్పాటుపై పాఠశాల స్థాయి విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు.
సీఎం చేతుల మీదుగా ఆరు పాలసీల విడుదలకు ఏర్పాట్లు: సీఎస్
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలు, 200 విద్యుత్ సబ్‌స్టేషన్లు ప్రారంభిస్తున్నామని.. 9,007 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. అలాగే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆరు ప్రధాన పాలసీలను విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment