మరో 2 గ్యారంటీలు అమలు చేద్దాం | Telangana Congress government to implement two more guarantees | Sakshi
Sakshi News home page

మరో 2 గ్యారంటీలు అమలు చేద్దాం

Published Fri, Feb 2 2024 4:39 AM | Last Updated on Fri, Feb 2 2024 9:21 AM

Telangana Congress government to implement two more guarantees - Sakshi

సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.చిత్రంలో మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు,  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం కేబినెట్‌ సబ్‌కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సబ్‌కమిటీలో ఉన్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. రూ.500లకు సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుంది? ఎంత మందికి లబ్ధి చేకూరుతుందనే వివరాలు ఇవ్వాలని, ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ బడ్జెట్లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని సీఎం ఆర్థిక శాఖకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినెట్‌ సబ్‌కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  

మొత్తం డేటా ఎంట్రీ  
రాష్ట్రవ్యాప్తంగా గత డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమంలో ఐదు గ్యారంటీలకు అర్హులైన వారి నుంచి గ్రామసభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించిన విషయం విదితమే. ఐదు గ్యారంటీలకు మొత్తంగా 1,09,01,255 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డు సమయంలో పూర్తి చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు.

ఒకే పేరుతో రెండు మూడు  
ఒకే పేరుతో రెండు మూడు దరఖాస్తులు కొందరు ఇచ్చారని, కొన్నింటికి ఆధార్, రేషన్‌కార్డు నంబర్లు లేవని అధికారులు చెప్పారు. అలాంటి దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అర్హులైన వారెవరూ నష్టపోకుండా ఒకటికి రెండుసార్లు సరి చూడాలని చెప్పారు. దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఎంపీడీఓ ఆఫీసుల్లో లేదా తదుపరి నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో మరోసారి అవకాశమిచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.

గ్యారంటీల అమలుకు లేని పోని నిబంధనలు పెట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చూడాలన్నారు. దరఖాస్తు చేయని వారుంటే.. నిరంతర ప్రక్రియగా మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించారు. సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌.చౌహాన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రోస్, హోంశాఖ సెక్రటరీ జితేందర్, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శేషాద్రి, సీఎం స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement