విజయనగరం కంటోన్మెంట్: ఇంటిని పోషించే యజమాని వడదెబ్బతో చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అందజేసే సాయం విషయంలో బాధితులకు మరో దెబ్బ తగులుతోంది. జిల్లాలో వడదెబ్బ మృతులకు సాయం అందించడంలో ప్రభుత్వ సూచనల ప్రకారం కోత తప్పదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మే 20 నుంచి వడదెబ్బ మృతులను ప్రభుత్వం గుర్తిస్తున్నది. వడదెబ్బకు ఎంత మంది మృతి చెందారన్న వివరాలను సేకరించింది. గ్రామస్థాయిలో మృతిచెందిన వారి వివరాలను మండల కేంద్రంలోని తహశీల్దార్, ఎస్సై,వైద్యాధికారులున్న త్రిసభ్య కమిటీ గుర్తించి పంపించాల్సి ఉంది.
అయితే వీరి ద్వారానే కాకుండా ముందుగా తహశీల్దార్ కార్యాలయాల నుంచి వడదెబ్బ మృతుల సంఖ్యను ప్రతిరోజూ నమోదు చేసుకుని కలెక్టరేట్‌లోని సెక్షన్ కార్యాలయానికి పంపించారు. దీని ప్రకారం జిల్లావ్యాప్తంగా మే20 నుంచి మే 31 వరకూ జిల్లా వ్యాప్తంగా వడదెబ్బల కారణంగా మృతి చెందిన వారిని గుర్తించారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తం గా ఈ ఏడాది మే20 నుంచి నెలాఖరు వరకూ 214 మంది మృతి చెందారు. అయితే జిల్లా అధికారులకు త్రిసభ్య కమిటీ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం 18 మంది మాత్రమే మృతి చెందినట్టు ధ్రువీకరించారు.
ఇది మంగళవారం వరకూ నమోదైన వడదెబ్బ మృతుల సంఖ్య. అయితే మిగతా వారి సంగతేంటనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. మిగతా వారి వివరాలు ఎప్పటికి పంపిస్తారో! అవి ఎప్పటికి సీసీఎల్‌ఏకు వెళతాయో? వాటిని గుర్తించి నిధులు ఎప్పుడు మంజూరు చేస్తారోనని బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఎటువంటి ఆదాయ వనరు లేక సంపాదన పరులు ఎండ దెబ్బకు మృతి చెందితే ఆ కుటుంబాలు ఎలా జీవిస్తాయనే ఆలోచనతో ప్రభుత్వం విపత్తుల నిర్వహణ కింద కుటుంబానికి లక్ష రూపాయలు ప్రకటించింది. మరి వాటిని అర్హులైన అందరికీ అందజేయాల్సి ఉన్నా అర్హుల ఎంపికలో పూర్తిగా న్యాయం జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గత ఏడాది కూడా ఇదే దారుణం
జిల్లాలో గత ఏడాది వాస్తవానికి 140 కన్నా ఎక్కువ మందే వడదెబ్బకు మృతి చెందారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇందులో అందరినీ గుర్తించి 44 మందికి మొదటి విడతగా నిధులు మంజూరు చేసింది. ఆ తరువాత మిగతా వారికి మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అర్హులను కుదించే చర్యలు తీసుకుంది. దీంతో వడదెబ్బ కారణంగా మృతిచెందిన వారిని గుర్తించేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. దీని ప్రకారం ఆ కమిటీలోని అధికారులు వడదెబ్బకు మృతిచెందిన వారు కేవలం 28 మంది ఉన్నారని గుర్తించారు. దీని ప్రకారమే నిధులు విడుదల చేసి ఇటీవలే వాటిని పంపిణీ చేశారు. వడదెబ్బ వల్ల మృతి చెందిన వారి మృతదేహాలకు ఆయా కుటుంబ సభ్యులు ముందుగా పోస్టుమార్టం చేయించుకుని ఉంటే త్రిసభ్య కమిటీ ఆమోదం అవసరం లేదు. అసలు త్రిసభ్య కమిటీ గ్రామంలోని పెద్దల సమక్షంలో విచారణ చేసి వడదెబ్బ మృతులను ధ్రువీకరించాల్సి ఉంది. అయితే గ్రామాల్లో విచారణ సక్రమంగా జరిపి నివేదిక పంపిస్తున్నారా లేదా అన్న విషయం అధికారులకే తెలియాలి.
దెబ్బ మీద దెబ్బ !
Published Thu, Jun 11 2015 2:31 AM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM
Advertisement
Advertisement