విజయనగరంఫోర్ట్: వడదెబ్బ మరణాల నిరోధానికి కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లట్కర్ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్, డ్వామా, ఆర్‌డబ్లు్యఎస్‌శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది వడదెబ్బకు గురై 125 మంది మృత్యువాత పడ్డారని ఈ ఏడాది సైతం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మరణాలు లేకుండా చూడాలని సూచించారు.
ఉపాధి హామీ కూలీల వద్ద 104 వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. గర్భిణులు, వృద్ధులు, షుగర్ వ్యాధిగ్రస్తులను ఉపాధి పనులకు అనుమతించవద్దన్నారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, సబ్ సెంటర్‌ల్లో తగినన్ని ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజలకు ఓఆర్‌ఎస్ ద్రావణం వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రజలకు వివరించాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ సి.పద్మజ, డ్వామా పీడీ ప్రశాంతి, డీఐఓ కిషోర్‌కుమార్, కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ కె.సీతారామరాజు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.