ఎండనబడివెళ్లాక...
విజయనగరం అర్బన్: ఎండలు చండప్రచండంగా ఉన్నాయి....మరో వైపు వడదెబ్బతో జనాలు పిట్టల్లారాలిపోతున్నారు. పెద్దవాళ్లే ఈ ఎండలను తట్టుకోలేక సొమ్మసిల్లి పోతున్నారు. మరి పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది. అయితే అధికారుల నిర్ణయాల కారణంగా స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు. ముందుగా ప్రకటించకుండా పాఠశాలకు విద్యార్థులు చేరిన తరువాత సెలవని చెబుతుండడంతో ఆ ఎండలో తిరిగి ఇంటికి రాలేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఆ సమయంలో పిల్లలకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత...
ఎప్పుడు పాఠశాల తెరుస్తారో... ఎప్పుడు సెలవు అని ప్రకటిస్తారో తెలియక విద్యార్థులు, ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా గత రెండురోజులుగా జిల్లా అధికారులు ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏ రోజుకారోజు పాఠశాల ప్రారంభించిన తర్వాత సెలవని ప్రకటించడంపై ఇటు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రమం వ్యక్తం చేస్తుండగా, అటు ఉపాధ్యాయులు అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. మిగిలిన జిల్లాల మాదిరిగానే ముందు రోజున సెలవు ప్రకటించకపోవడం వల్ల ప్రతి రోజూ యథావిధిగా విద్యార్థులు ఎండలో పాఠశాలలకు వచ్చి సెలవని తెలుసుకొని తిరిగి ఎండలో ఇళ్లకు వెళ్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వాహణ గందరగోళంగా మారింది.
కలెక్టర్ దృష్టికి...
జిల్లా ఉన్నతాధికారుల అసమర్థ నిర్ణయాల వల్ల సెలవు ప్రకటించినా ఎండ నుంచి విద్యార్థులను కాపాడలేకపోతున్నామని కలెక్టర్ కాంతీలాల్ దండే దృష్టికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తీసుకువెళ్లారు. ఈ మేరకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక (జాక్టో) ప్రతినిధులు మంగళవారం కలెక్టర్‌ను కలిసి వేర్వేరుగా వినతి పత్రాలను అందజేశారు. కలెక్టర్‌ని కలిసి సంఘ నేతల్లో జాక్టో కన్వీనర్ డీ.ఈశ్వరరావు (ఆపస్), కె.గోపాల పట్నాయక్ (పీఆర్టీయూ), జెసీరాజు (ఏపీటీఎఫ్), చిప్పాడ సూరిబాబు (వైఎస్‌ఆర్‌టీఫ్), జి.ఎస్.ప్రకాష్‌రావు (ఎస్‌టీఎప్), వైశ్రీనివాస్‌రావు (పండిత పరిషత్) ఉన్నారు.
సర్కారు బడుల పిల్లలంటే అంత చులకనా..!: యూటీఎఫ్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులంటే జిల్లా పాలకులకు ఇంత చులకన పనికిరాదని యూటీఎఫ్ జిల్లా కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో సంఘం నేతలు కె.శేషగిరి, డి.రాము, అల్లూరి శివవర్మ, నిర్మల, శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎండల తీవ్రతపై స్కూళ్లు ప్రారంభం నుంచి జిల్లా అధికారులకు నేరుగా కలిసి చెప్పామని, అయితే వాళ్ల స్పందన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చిన్నచూపు చూసే విధంగా ఉందని ఆరోపించారు.