సర్కారు వారి ‘భజన భూమి’
గాడి తప్పిన ‘జన్మభూమి-మా ఊరు’
♦ ప్రజా సమస్యలను ప్రస్తావించిన వారిపై దాడులు, దౌర్జన్యం
♦ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు ఆహ్వానమే లేదు
♦ గత 2 జన్మభూమి కార్యక్రమాల్లో అందిన దరఖాస్తులు 33.27 లక్షలు
♦ వీటిలో ఇంకా పెండింగ్‌లో మగ్గుతున్న దరఖాస్తులు 28.52 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమ లక్ష్యం పూర్తిగా గాడితప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు భజన కే పరిమితమైంది. ఓవైపు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని చెబుతూ రూ.కోట్ల ఖర్చుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నిర్దేశిత లక్ష్యానికి ఆమడ దూరంలో కొనసాగుతోంది. ప్రచారం పొందడమే ఏకైక లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ నెల 2న మూడో విడత జన్మభూమి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమం నిర్వహణకు అధికారికంగా రూ.13 కోట్లు ఖర్చు చేస్తున్నా, అనధికారికంగా అది రెండింతలుంటుందని అధికారవర్గాలే పేర్కొంటున్నాయి.
జరగాల్సిందేమిటి?: వివిధ శాఖల అధికారులు ఎక్కడికక్కడ ప్రజల తో సమావేశమై ఆయా గ్రామాలు, వార్డుల అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేయాలన్నది జన్మభూమి ఉద్దేశం. ఇందుకోసం జన్మభూమి కార్యక్రమ ప్రారంభానికి నెల రోజుల ముందు నుంచే ప్రభుత్వ యంత్రాంగం గ్రామాలు, వార్డుల్లో పర్యటించి, నివేదికలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ నివేదికలను జన్మభూమి గ్రామసభల ముం దుంచి.. ప్రజల అవసరాలపై చర్చించాలి.
ఈ అవసరాలను తీర్చడానికి ఆయా శాఖలు ఎంత మేరకు ఆర్థిక తోడ్పాటు అందించగలవన్న దానిపై సమీక్ష జరపాలి. స్మార్ట్ విలేజీ- స్మార్ట్ వార్డు కార్యక్రమాల్లో గ్రామాలు, వార్డులను దత్తత తీసుకున్న వారిని జన్మభూమి గ్రామసభల్లో భాగస్వాములను చేయడంతో పాటు వారు గ్రామాభివృద్ధికి ఏ విధంగా తోడ్పడగలరన్న దానిపై చర్చించాలి. చివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు పంచాయతీల సొంత ఆదాయ వనరులు, దాతల విరాళాలతో గ్రామ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించాలి.
జరుగుతున్నదేమిటి?: రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయితీలు ఉండగా, శనివారం సాయంత్రానికి 11,674 గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ 11,674 గ్రామాల్లో 59 గ్రామాల్లో మాత్రమే గ్రామ అభివృద్ధి ప్రణాళికలపై చర్చ, వాటి రూపకల్పన జరిగింది. 4 వేల గ్రామాల్లో ప్రభుత్వ సిబ్బంది జన్మభూమికి ముందస్తుగా చేపట్టాల్సిన సర్వే నివేదిక ల రూపకల్పనే పూర్తి చేయలేదు. జన్మభూమి సభల్లో పింఛన్లు, రేషన్ సరకులు మా త్రమే పంపిణీ చేస్తున్నారు. జన్మభూమి కార్యక్రమం ఉన్నా లేకపోయినా ప్రతి నెలా వీటిని పంపిణీ చేయడం పరిపాటే. గతంలో అధికార ంలో ఉన్నపుడు తాను మాత్రమే సమర్థంగా పనిచేస్తున్నానని, అధికారులు ప్రజలను, వారి సమస్యలను పట్టించుకోవటం లేదన్నట్లుగా చిత్రీకరించిన చంద్రబాబు ఈసారి కూడా అదే తంతు కొనసాగిస్తున్నారు. రోజూ ఏదో ఒక చోట ప్రజల సమక్షంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారంతో మూడో విడత జన్మభూమి ముగియనుంది.
విపక్ష నేతల నిర్భంధం: జన్మభూమి కార్యక్రమంలో భాగంగా సీఎం జిల్లాల్లో పర్యటించే సమయంలో విపక్ష నేతల నిర్బంధం రోజూ కొనసాగుతోంది. మంచినీటి సమస్య, ఇళ్లు, ఇంటి స్థలాలు, ఫించన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయాలని, నిత్యావసరాల ధరలు తగ్గించాలని కోరుతూ ప్రజలు వినతిపత్రాలు అందించడంతోపాటు ఎక్కడికక్కడ నిరసన తెలియచేస్తున్నారు. రైతులు తమ రుణాలు మాఫీ కాలేదని నిలదీయటంతోపాటు ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటున్నారు. దీంతో చంద్రబాబు పర్యటనల సందర్భంగా ముందుగానే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు, గృహ నిర్బంధాలు కొనసాగిస్తున్నారు. తాజాగా శనివారం చంద్రబాబు వైఎస్సార్ జిల్లా పర్యటన సందర్భంగా కడప వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంజాద్‌బాషా, మేయర్ సురేష్‌లను గృహ నిర్బంధం చేశారు. విజయనగరం జిల్లాలో పర్యటన సందర్భంగా వామపక్ష నేతలను అరెస్టు చేశారు. కృష్ణా జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేత సామినేని ఉదయభాను జన్మభూమి సభలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా అరెస్టు చేశారు. జోగి రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
డ్యాష్ బోర్డు నుంచి సమాచారం మాయం
జన్మభూమి ద్వారా సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెబుతున్న చంద్రబాబు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గత రెండు జన్మభూమి కార్యక్రమాల్లో వచ్చిన లక్షలాది వినతులను పరిష్కరించని ప్రభుత్వం ఒక్క రోజులో వాటన్నింటినీ పరిష్కరించామని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. సీఎం కోర్ డ్యాష్ బోర్డులో ఈ నెల ఒకటో తేదీ నాటికి గత రెండు జన్మభూముల్లో రేషన్‌కార్డులు, ఫించన్లు, ఇళ్లు కావాలని వచ్చిన 33.27 లక్షల దరఖాస్తుల్లో 28.52 లక్షల దరఖాస్తులను పరిష్కరించలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ ప్రచురించింది. దీంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని ఆందోళన చెందిన ప్రభుత్వం ఆ రోజు సాయంత్రానికి సీఎం కోర్ డ్యాష్ బోర్డు నుంచి ఆ సమాచారాన్ని మాయం చేసింది.