విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కాంక్షిస్తూ ప్రజానీకం చేస్తున్న ఉద్యమం రోజు రోజుకీ మహోగ్రరూపం దాలుస్తోంది. ఈ పోరులో తుది గెలుపు సాధించే వరకూ విశ్రమించే లేదని ఉద్యమ వీరులు సైనికుల్లా సాగుతున్నారు. ప్రభుత్వ పాలనతో పాటు ప్రజా జీవనం కూడా స్తంభించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఆందోళనలు, నిరసనలతో ఇప్పటికే జిల్లా హోరెత్తుతుంటే తాజాగా ఏపీఎన్జీవోలు మరింత ఉధృతానికి నిర్ణయించారు. ఈ నెల19న అన్ని ఉద్యోగ సంఘాలతో దాదాపుగా 10 వేల మందితో మహా ర్యాలీకి సిద్ధమవుతున్నారు.
ఈ నెల 24 నుంచి 31 వరకు రిలే నిరాహారదీక్షలు చేయనున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించారు. తాజాగా విద్యుత్ ఉద్యోగులు కూడా వచ్చే నెల 2 తరువాత ఏ క్షణానైనా సమ్మెకు వెళ్లే అవకాశముంది. వారు సమ్మెకు దిగితే జిల్లా అంధకారంలోకి వెళ్లిపోనుంది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. మరోవైపు ఎంసెట్ కౌన్సింగ్‌పై కూడా ఈ సమ్మె ప్రభావం చూపుతోంది.
ఇప్పటికే కౌన్సెలింగ్ ప్రక్రియకు జాప్యం జరిగింది. తాజాగా కౌన్సెలింగ్‌కు మార్గం సుగమమైనప్పటికీ విద్యార్థులకు ధ్రువపత్రాలు మంజూరు చేసే తహశీల్దార్ కార్యాలయాలు మూతపడ్డాయి. సబ్బవరంలో విద్యార్థులు శనివారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మూడురోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మకు దహన సంస్కారాలు చేపట్టారు. ఉద్యమానికి సంఘీభావంగా పాయకరావుపేటలో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, కార్మికులు, తుని ఆర్టీసీ డిపో ఉద్యోగులు బస్సులతో భారీ ర్యాలీతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
ఉద్యమం ఉగ్రరూపం
Published Sun, Aug 18 2013 12:55 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
Advertisement