సర్కారే అసలు దోషి...
అడ్డగోలుగా బాణసంచా తయారీ కళ్లుమూసుకున్న యంత్రాంగం
► వాకతిప్ప విస్ఫోటంలో మరో నలుగురు మృతి.. 17కి పెరిగిన మృతుల సంఖ్య
► మృతుల్లో 15 మంది బడుగు మహిళలే..ఆచూకీ లేకుండా పోయిన మరో బాలిక
► లెసైన్సు రద్దయిన తర్వాతా బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్న వైనం
► తనిఖీలు చేయకుండానే లెసైన్సు పునరుద్ధరించాలంటూ సిఫారసులు
► cయు.కొత్తపల్లి తహశీల్దార్ సస్పెన్షన్.. నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు
కాకినాడ: ప్రభుత్వ యంత్రాంగం అలసత్వానికీ, నిర్లక్ష్యానికీ అమాయకులు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలో బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం సంభవించిన పెను విస్ఫోటంలో మృతుల సంఖ్య 17కి చేరింది. వీరిలో 15 మంది బడుగువర్గాల మహిళలే. ఈ దుర్ఘటనలో మరో బాలిక ఆచూకీ లేకుండా పోయింది. వాకతిప్ప ఎస్సీ కాలనీకి చెందిన 11 మంది దుర్మరణం పాలు కాగా.. మిగిలిన వారు మరో రెండు గ్రామాలకు చెందినవారు. దీంతో మూడు గ్రామాల్లో విషాదం అలముకుంది. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ సామెత చందంగా ఇన్ని ప్రాణాలు బలయ్యాక.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కాకినాడలో ప్రకటించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రయత్నం ఇంతకు ముందే జరిగి ఉంటే బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఇన్ని ప్రాణాలు బలయ్యేవి కావని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
17కు పెరిగిన మృతుల సంఖ్య...
వాకతిప్పలో ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మణికంఠ ఫైర్‌వర్క్స్‌లో సంభవించిన భారీ విస్ఫోటంలో సోమవారం 12 మంది మృతి చెందగా.. మంగళవారం తెల్లవారుజామున మరో నలుగురు మృతి చెందారు. ఉల్లంపర్తి కామరాజు (30), మేడిశెట్టి నూకరత్నం (20), దమ్ము గురవయ్య (45), తుట్టా నాగమణి (35) కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరోవైపు.. సంఘటనా స్థలానికి అరకిలోమీటర్ దూరంలో పంటకాలువలో వాసంశెట్టి రాఘవ (50) అనే మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆచూకీ లేకుండా పోయిన 12 ఏళ్ల ఉండ్రాజపు కీర్తి కూడా మృతిచెంది ఉంటుందని అధికారులు ప్రాధమికంగా నిర్థారణకు వచ్చారు. పరిసరాల్లో లభించిన తెగిపడ్డ ఓ కాలు ఆ బాలికదేనని భావిస్తున్నారు. అవసరమైతే లభించిన కాలికి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహిస్తామని చెప్తున్నారు. ఫైర్‌వర్క్స్ నిర్వాహకుడు కొప్పిశెట్టి అప్పారావు, అతడి తల్లి లక్ష్మి, కుక్కల శ్రీనివాసరావు అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
లెసైన్సు రద్దయినా ఆగని తయారీ...
వాకతిప్పలో మరణమృదంగానికి కారణమైన మణికంఠ ఫైర్‌వర్క్స్‌కు 2015 వరకు లెసైన్సు ఉన్నప్పటికీ పెరిగిన వ్యాపారానికి తగ్గట్టు ఫీజు చెల్లించని కారణంగా గత నెలలో లెసైన్సు రద్దు చేశారు. నిర్వాహకుడు కొప్పిశెట్టి అప్పారావు కొత్తగా లెసైన్సు కోసం గతవారం పెట్టుకున్న దరఖాస్తు కాకినాడ ఆర్‌డీఓ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. అయినా బాణసంచా తయారీని ఆపలేదు. దరఖాస్తు చేయడానికి ముందు నుంచే (గత నెలన్నర రోజులుగా) బాణసంచా తయారుచేయిస్తూనే ఉన్నాడు. ఈ కేంద్రం నుంచి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు పశ్చిమగోదావరి జిల్లాకు కూడా పెద్ద ఎత్తున హోల్‌సేల్‌గా బాణసంచా సరఫరా చేస్తున్నారు. దీపావళి సందర్భంగా అమ్మకాల కోసం సుమారు రూ. 50 లక్షల విలువైన సరుకును కూడా శివకాశి నుంచి కొని, తెచ్చినట్టు సమాచారం. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగానే జరుగుతున్నాయి.
కళ్లు మూసుకున్న అధికారులు...
బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకాలకు విడివిడిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ బాణసంచా తయారు చేసేందుకు ప్రస్తుతం లెసైన్సు లేదు. గతంలో ఉన్న లెసైన్సు రద్దయింది. అన్ని కార్యకలాపాలూ నిబంధనలకు విరుద్ధంగా కళ్లెదుటే చేస్తున్నా అధికారుల కళ్లకు కనిపించనే లేదు. నెల రోజులు ముందుగానే దుకాణాలను తనిఖీ చేసి సరుకు నిల్వలు, తయారీ విధానం, పనిచేస్తున్న వారికి బీమా చేయించారా లేదా అనే వివరాలు స్వయంగా పరిశీలించాల్సిన అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయం, విద్యుత్ కార్యాలయం, నివాస ప్రాంతాలు, నిత్యం జనసమ్మర్థం ఉండే ప్రాంతానికి సమీపాన అడ్డగోలుగా ఈ కేంద్రం నిర్వహిస్తున్నా.. క్షేత్రస్థాయిలో తహశీల్దార్, అగ్నిమాపక అధికారులు, పోలీసులు.. ఎటువంటి తనిఖీలు లేకుండానే సర్టిఫై చేసి జిల్లా కేంద్రానికి లెసైన్సు పునరుద్ధరణకు సిఫారసు చేశారు. పర్యవసానంగా జరిగిన ఘోరం 17 నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. అధికారుల నిర్లక్ష్యానికి, ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా నిలిచింది. దుర్ఘటనకు బాధ్యుడిగా యు.కొత్తపల్లి తహశీల్దార్ పినిపే సత్యనారాయణను సస్పెండ్ చేశారు. బాణసంచా కేంద్రం యాజమాన్యంపై ఐపీసీ 286, 337, 338, 304(2), 1884 ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టాండ్స్ చట్టం సెక్షన్ 9బి ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశారు.
మృతదేహాల కోసం రాత్రి వరకూ పడిగాపులు...
కాకినాడ జీజీహెచ్ ఫోరెన్సిక్ విభాగ వైద్యుడు డాక్టర్ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం 15 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. తెగిపడ్డ కాలినీ పరీక్షించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించడంలో మానవత్వం లోపించింది. కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ జీజీహెచ్‌లో పడిగాపులు పడాల్సి వచ్చింది. సీఎం వచ్చే వరకు మృతదేహాలను జీజీహెచ్‌లోనే ఉంచేయడం కుటుంబ సభ్యులను కలచివేసింది. ఉదయం 10.30 గంటలకు సీఎం వస్తున్నారని హైరానా పడ్డ అధికారులు హుటాహుటిన పోస్టుమార్టం పూర్తి చేసినా సీఎం మధ్యాహ్నం 3.30 గంటలవరకు రాకపోవడంతో అంతవరకు వేచి చూడాల్సి వచ్చింది. సీఎం వెళ్లిపోయాక మృతదేహాలను తరలించేందుకు ఏర్పాటుచేసిన అంబులెన్స్‌లకు డీజిల్ పోసే బాధ్యతను రెవెన్యూ అధికారులు ఒకరిపై మరొకరు నెట్టుకోవడంతో బంధువులు రాత్రి వరకూ నిరీక్షించాల్సి వచ్చింది.
పేలుడులో మృతుల వివరాలు...
మసకపల్లి అప్పయమ్మ (55), మసకపల్లి గంగ (23), మసకపల్లి విజయకుమారి అలియాస్ బుజ్జి (28), ద్రాక్షారపు కాంతమ్మ (50), మసకపల్లి కుమారి (24), ద్రాక్షారపు చిన్నతల్లి (46), అద్దంకి నూకరత్నం (25), మసకపల్లి పుష్ప (35), ఉల్లంపర్తి కామరాజు (30), పిల్లి మణికంఠస్వామి (35), తుట్టా మంగ (40), తుట్టా సత్తిబాబు (20), మేడిశెట్టి నూకరత్నం (20), దమ్ము గురవయ్య (45), తుట్టా నాగమణి (35), రాయుడు రాఘవ (40), వాసంశెట్టి రాఘవ (50). ఈ 17 మంది మృతి చెందగా.. ఉండ్రాజపు కీర్తి (12) అనే బాలిక ఆచూకీ లభ్యంకాలేదు. ఇక ఆస్పత్రిలో కుక్కల శ్రీనివాసరావు, కొప్పిశెట్టి లక్ష్మి, కొప్పిశెట్టి అప్పారావులు చికిత్సపొందుతున్నారు.